ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎవరి కర్మకి వారే బాధ్యులు.-సుజాత.పి.వి.ఎల్.---ఒక రాజు గారు, తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి వారికి ఒక్కొక్క ఖాళీ గోనె సంచులను చేతికిచ్చి అరణ్యంలో కెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు, ఫలాలను అందులో నింపి సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞా పించాడు. ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు. మొదటిమంత్రి ఇలా ఆలోచించాడు. రాజు గారు పండ్లు తెమ్మన్నా రంటే...ఏదో విశేషం ఉండి ఉండాలి, కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి."అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు. రెండో మంత్రి ఇలా ఆలోచించాడు. 'రాజు గారికి పండ్లకి కొదవలేదు, ఐనా మమ్మల్ని పంపారు. సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు.' అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజావి, వాడిపోయిన, కుళ్ళిపోయిన పండ్లు అన్నీ నింప సాగాడు.ఇక మూడో మంత్రి చాలా చతురంగా ఆలోచించాడు. రాజు గారికి చాలా పనులు, పండ్ల అవసరం అతనికి లేదు, పై పైన చూస్తే చూడొచ్చు. బస్తా ఖాళీ చేసి చూసే సమయం కూడా ఉండదు. చూడనిదానికి కష్టపడి అడవంతా తిరగాల్సిన అవసరం ఏముంది?" అనుకుంటూ ఆకులు, అలములతో బస్తానింపి పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు. సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు. మూడోమంత్రి ఊహించినట్లేరాజు గారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు. కనీసం బస్తాలు వంక చూడనైనా చూడ కుండా సైనికులను ఆదేశించారు. "ఈ ముగ్గురినీ చెరసాలలో నెల్రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి. తినడానికి ఏమి ఇవ్వకండి. వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం!" అన్నాడు. ముగ్గురిని చెరసాలలో బంధించారు.మొదటి మంత్రి చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలి బాధలు లేకుండా శిక్షాకాలం పూర్తిచేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు. రెండవ మంత్రి కొన్నిరోజుల వరకు బాగానే తిన్నా కుళ్ళిన,వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు శాశ్వతంగా. మూడవ మంత్రి పైపైన అలంకరించిన పండ్లతో రెండు రోజులు గడిపి, ఆకులు,అలములతో మరో వారం పాటు మాత్రం గడిపి...పైలోక యాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసే లోపే! మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. మంచి కర్మలకి మంచి, చెడు,పాప కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు!గోవుల మంద ఉన్నా...దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో... మంచి, చెడు కర్మలు కూడా అలానే ... మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి.
June 30, 2020 • T. VEDANTA SURY • Story