ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఏమిటో ఈ మధ్య చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నేను ముందు, నేను ముందు అని నెట్టుకుంటూ మనసు పొరల్లో సందడి చేస్తున్నాయి. 'డా.సోమరాజు సుశీల' గారి 'ఇల్లేరమ్మ కతలు' చదివిన ఉత్సాహమో ఏమో.నేను 'శ్రీ సరస్వతీ విద్యామందిరం' స్కూల్ లో చదివే రోజుల్లోని మాట. అక్కడ నేను పూర్వశిశు (అంటే L.K.G అన్నమాట) నుండి 5.వ. తరగతి వరకు చదివాను. మా స్కూల్ లో పాఠాలే కాక అనేక రకాల కథలు చెప్పేవారు. లలిత సంగీతం నేర్పుతూ ఇంకొన్ని దేశభక్తి గీతాలు , ఏకాత్మత స్తోత్రం, అన్నపూర్ణాష్టకం నేర్పేవారు. సాయంత్రం అయ్యేసరికి డంబెల్స్, యోగ్ ఛాప్ , ఆడపిల్లలకి కోలాటం, మగపిల్లలకి చెక్కభజన నేర్పేవారు. వీటిని ఏదైనా గీతాలతో మిళితం చేసి ప్రత్యేక సందర్భాలలో ప్రదర్శించేవాళ్ళము కూడా. అది ఒక 'స్వర్ణయుగము' అని చెప్పవచ్చు.రోజూ ఉదయాన్నే స్కూల్ కి వెళ్లడం మళ్ళీ మధ్యాహ్నం భోజనానానికి ఇంటికి వచ్చి తిన్నామా, గుణింతాలు పలకలో వ్రాసుకున్నామా? పరిగెట్టామా? ఇక సాయంత్రమే ఇంటికి రావడం. రాగానే నేను ఊరుకుంటానా? గడప మీద కూర్చుని స్కూల్ లో చెప్పినవన్నీ మా అమ్మకు తిరిగి చెప్పేదాన్ని. రోజంతా ఇలానే చాలా బిజీగా గడిచి పోయేది.ఎప్పటిలాగే ఒకరోజు స్కూల్ నుండి వచ్చి పాఠాలు అప్పజెప్పడం మొదలుపెట్టాను. మా అమ్మ పనులు చేసుకుంటూనే వింటోంది. నేను అమ్మ వెనుకే తిరుగుతూ చెబుతూవున్నా. అంతలో మా అమ్మకు ఏదో పని గుర్తుకు వచ్చి ఇప్పుడే వస్తాను, తలుపు వేసుకుని ఉండు. రెండు నిమిషాల్లో వస్తానంటూ బయటికి వెళ్ళింది. సరే అని నేను హార్లిక్స్ , ఒక చిన్న గిన్నెలో వేసుకుని స్పూన్తో తింటూ వున్నా. నేను హార్లిక్స్ యాడ్ లో లాగా కాదులెండి. నేను తాగుతాను , తింటాను. నేను ఏది తిన్నా చాలా ఆస్వాదిస్తూ తినడం అలవాటు. అలా మైమరచి తింటూ వున్నానా , అంతలో గంట మోగిన చప్పుడు వినిపించింది. అమ్మ కూడా లేదు. దేవునిగదిలో పూజ చేస్తుందనుకోవడానికి. ఎలుకలు ఏమన్నా గంటను కదిలించాయేమో అని దేవుని గదిలోకి వెళ్ళి చూశా. ఎక్కడి గంట అక్కడే ఉంది . భ్రమేమో అనుకుని మళ్ళీ తింటూ కూర్చున్న. మళ్ళీ గంట చప్పుడయింది. నిన్న స్కూల్ లో చెప్పిన కథలోలా మా పిల్లి మెడలో ఎలుకలుగాని గంట కట్టాయా? అనుకుని, అలా-ఎలా అవుతుందిలెమ్మని సర్దుకుని కూర్చున్న. మళ్లీ గంట శబ్దం వినిపించింది. కొంచెం భయం కలిగింది. అలాగే వెళ్ళి ఇల్లంతా చూసి వచ్చా. ఏమీ కనిపించలేదు. బిక్కు-బిక్కుమంటూ హాల్లో ఒక మూల కుర్చీలో కూర్చున్న. మళ్ళీ గంట చప్పుడయింది. ఒక్క ఉదుటున వెళ్లి తలుపు తీసుకుని వసారాలోకి వెళ్లి పడ్డా. అప్పుడే మా అమ్మ వచ్చింది. ఆమెను చుట్టుకుని భయంతో ఏడుస్తూ, 'గం' .'మం'. 'ట'. అంటూ ఏడుస్తున్న. ఏంటి మంట? కడుపులోనా ? ఏమి తిన్నావు ? ఏమిటి? అని అడుగుతోంది. నా సగం ఏడుపు , సగం మాటలో అమ్మకు అది గంటో , మంటో ఏమి తెలుస్తుంది? ఏడ్చి అయినా చెప్పు, చెప్పైనా ఏడు అంది. అమ్మ కోపంగా అలా అనే సరికి లోపలల్లోపల వెక్కి-వెక్కి నిశ్శబ్దముగా ఏడుస్తున్న. అమ్మ నీళ్లిచ్చి , దగ్గర కూర్చోబెట్టుకుని ఏమ్మా భయపడ్డావా? అని అడిగింది. అవునంటూ తల ఊపా. మళ్ళీ అదే శబ్దం. గట్టిగా అరచి అమ్మను చుట్టేసుకున్నా. గాలికాని సోకిందా? ఏమి?అనుకుంటూ బయటికి వెళ్ళబోయింది అమ్మ. నేనూ వస్తానని వెంటబడ్డా .అప్పట్లో మేము అద్దెకుండేవాళ్ళం. మా ఇల్లు మొదటి అంతస్థులో ఉండేది. పక్కింటికి , మాకు రాసిగోడ ఉండేది. వసారాలో మెట్ల ప్రక్కగా చిన్న సందులో నుండి వెళితే పక్కింటి రాసిగోడ తగులుతుంది. అది చాలా పలుచని గోడ. కాస్త ముందుకు వంగి, పక్కకు చూస్తే, పక్కింటి వాళ్ళతో మాట్లాడవచ్చు. అలా వెళ్లి అమ్మ పక్కింటి 'శాంతమ్మ' టీచరుతో కబుర్లలో పడి నా గోల పట్టించుకోక పోయేసరికి చాలా కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోయా. కాసేపటికి వచ్చిన మా అమ్మకు నా ఏడుపు సంగతి గుర్తొచ్చింది. దగ్గరకు తీసుకుని విషయం అడిగింది. నా కోపం ఎగిరిపోయింది. 'అమ్మ! నువ్వు అటు వెళ్ళావో , లేదో మన ఇంట్లో ఏదో గంట చప్పుడు వినిపించింది. నాకు భయం వేసింది.' అంటూ విషయం అంతా పూస గుచ్చినట్లు చెప్పా. అమ్మ ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టింది. నేను భయపడితే నీకు నవ్వు వస్తోందా అమ్మ? అన్నా, బుంగ మూతి పెట్టుకుని. బుడ్డమూతి పెట్టింది చాలుగాని, ఇటు రా! అంటూ హాలులో ఒక మూలగా పైన కట్టివున్న గంటను చూపించింది. నేను ఆశ్చర్యపోయా. ఎప్పుడో కరెంటు వైరు కోసం పక్కింటికి, మాకు మధ్య ఉన్న గోడకి చిన్న రంధ్రం పెట్టారు. తరువాత అది పనికి రాలేదేమో దాన్ని పూడ్చకుండా అలా వదిలేశారు . అందులో నుండి ఒక తాడుతో ఈ గంట కట్టి ఉంది. ఏమిటమ్మ ఇది అని అడిగా? ఏం లేదమ్మా , మన శాంతమ్మ టీచరు ఒంటరిగా ఉంటారని నీకు తెలుసుగా. తనకు ఏమన్నా అవసరమైతే మనల్ని వసారా దగ్గరకు వచ్చి పిలిచినా లోపలికి వినపడదు. తను ఏదన్నా చెప్పాలనుకుంటే వాళ్ళ మెట్లు దిగి , మన మెట్లు ఎక్కి రావాలి పాపం. అంత కష్టం ఎందుకని నాన్నే ఇలా అలోచించి కట్టారు అంది. 'గుడి గంట' , 'బడి గంట' ఉంటాయి. ఇది 'పరోపకార గంట' అన్న మాట. మా నాన్నగారి ఆలోచనకు నాకు చాలా సంతోషం కలిగింది.--'గోమతి'
June 28, 2020 • T. VEDANTA SURY • Memories