ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఒకరోజు కలెక్టరు' గా.---- డాక్టర్ వేంపల్లి గంగాధర్ .
October 12, 2020 • T. VEDANTA SURY • News

కలెక్టర్ కుర్చీ లో కూర్చొని ధీమాగా 
సంతకం పెడుతున్న ఈ అమ్మాయి పేరు శ్రావణి .
కలెక్టర్ కుర్చీకి ఈ అమ్మాయికి సంబంధం ఏమిటనే సందేహం నాకు వచ్చినట్లే మీక్కూడా వచ్చే ఉంటుంది. అవును 'ఒకే ఒక్కడు' సినిమాలో అర్జున్ ఒక రోజు ముఖ్యమంత్రి గా పని చేసినట్లు ఈ అమ్మాయి కూడా 'ఒక రోజు కలెక్టర్' అయ్యింది. తర్వాత ఏం చేసింది ?   
 అనంతపురం జిల్లా గార్లదిన్నె కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదుకుంటున్న ఈ అమ్మాయి 'ఒకరోజు కలెక్టరు' గా అరుదైన అవకాశాన్ని పొందింది.
ఈ రోజు అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని(అక్టోబర్ 11వ తేదీన) పురస్కరించుకొని బాలికకు అపరూపమైన కానుక ఇచ్చారు అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారు .                   
ఒక రోజు కార్యాలయపు అధికారిగా బాలికకు పదవీ అవకాశం కల్పించారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో బాలికల్లో స్ఫూర్తిని కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసారు.
'బాలికే భవిష్యత్తు" కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరుగా 
ఒక రోజు బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రావణి ఏం చేసింది ?
అనంతపురం మున్సిపల్ కమీషనర్ చిన్మయి గారితో కలిసి పట్టణంలోని ఒకటవ నెంబర్ రోడ్డులో కాలినడకన పర్యటించింది.పాడయిన రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించింది.అక్కడినుంచి శారదా మున్సిపల్ గర్ల్స్ హైస్కూలును తనిఖీ చేసి జగనన్న విద్యా కానుక పథకం అమలుపై, పాఠశాలలో నాడు-నేడు పనుల పురోగతిపై వివరాలు కనుక్కుంది.
కొన్ని సూచనలు చేసింది .ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేలు పరిహారం అందించే ఫైల్ పై సంతకం చేసింది.అలాగే రాత్రి 8 గంటల తర్వాత ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులను అధికారిక పనుల గురించి ఫోన్లు చేసి ఆటంకం కలిగించకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ఫైల్ పై కూడా సంతకం చేసింది.                                                                
తీసుకున్న నిర్ణయాలు అన్నీ వెంటనే  అమలులోకి వచ్చాయి.
ఆడపిల్లల్లో చదువుపట్ల ఆసక్తిని కలిగించి, భవిష్యత్తు పట్ల వారిలో భరోసా ను , అఖండ  స్ఫూర్తిని కల్గించిన అనంతపురం జిల్లా కలెక్టర్  శ్రీ  Gandham Chandrudu  గారు నిజంగా అభినందనీయులు.
ఇది కలెక్టర్ గా వారు బాలికలకు ఇచ్చిన అరుదైన కానుక. 'బాలికే భవిష్యత్తు', విద్యతోనే సామాజిక అంతరాలను తొలగించగలం, సాధికారత సాధించగలం,  అన్న సందేశాన్ని ఈ విధంగా అనుభపూర్వకంగా నేర్పారు.
 వారి మాటల్లోనే చెప్పాలంటే "బాలికే భవిష్యత్తు-
భారతదేశ‌పు నేటి ఆడబిడ్డలను రేపటి ప్రపంచ స్థాయి లీడర్లుగా తయారుచేయడంలో మొదటి అడుగు.''
ఇదిగో ఇలా  నిదురించిన చైతన్యాన్ని రగిలించే వారు అప్పడప్పుడూ కారు చీకటిలో  కాంతి రేఖలా  కనిపిస్తారు. వారికి ధన్యవాదాలు .
ఇదొక మంచి ప్రయత్నం. మనం పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ , మాక్ పార్లమెంట్ నిర్వహించడం వెనుక ఉన్న ఉదేశ్యం అదే . ఈ కోణం నుంచి దీన్ని మనం చూడాలి.
ప్రజా కలెక్టర్  కు సెల్యూట్ !