ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఒక్కసారి ఆలోచించండి!--డి.కె.చదువులబాబు
September 24, 2020 • T. VEDANTA SURY • Story

కోసల రాజ్యానికి రాజుస్వర్ణసేనుడు.ఆయన మరణానంతరం కుమారుడు కీర్తిసేనుడు రాజయ్యాడు.ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలని భావించాడు.రాజ్యంలో తిరిగి స్వయంగా ప్రజల కష్టసుఖాలను గమనించాలనుకున్నాడు.మారువేషంలో తిరుగుతున్న రాజుకు బావి నుండి నీళ్ళు తెస్తున్న వృద్దులు కనిపించారు‌.కట్టెల మోపులు తెస్తున్న ముసలివాళ్ళు కనిపించారు.పొలాల్లో ఎండకు పని చేస్తున్న వృద్ధులు కనిపించారు.పూరి గుడిసెల్లో,సత్రాల్లో,చెట్ల క్రింద జీవిస్తున్న ముసలి వాళ్ళను చూశాడు.విచారించగా ఓ భయంకరమైన విషయం ఆయనకు తెలిసింది.అదేమంటే కొడుకులు తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకోవటం లేదు.కొందరు వృద్ధులు కొడుకుల దగ్గర ఉన్నప్పటికీ,కొడుకు,కోడళ్ళు సూటిపోటి మాటలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు.తల్లిదండ్రులను ఆదరిస్తున్న కుటుంబాల సంఖ్య చాలా తక్కువగాఉంది.పిల్లల్నికని,పెంచి,పెద్దచేసి,నడకనేర్పి,జీవితాన్నిచ్చిన అమ్మా,నాన్నలు పిడికెడు ప్రేమకు విశ్రాంతికి నోచుకోక విలవిలలాడటం కీర్తిసేనుడి మనసుని కలిచివేసింది,హృదయాన్ని శూలంతో గుచ్చుతున్నట్లు విలవిలలాడాడు.రాజు ఓ భవంతి ముందు న్యాయగంటను ఏర్పాటు చేయించాడు. కష్టాలు పడుతున్న వృద్ధులు న్యాయగంటను మ్రోగిస్తే అధికారులు అక్కడ కు చేరుకుంటారు.వారి కొడుకులను పిలిపించి,మందలించి అవసరమైతే శిక్షించి అమ్మానాన్నలను చూసుకునేలా చూస్తారు. ఈ విషయం రాజ్యమంతటా దండోరా వేయించారు.ప్రచారంచేశారు.వారాలు గడిచినా ఒక్కరూ గంటను మ్రోగించలేదు.తాను ఊహించినట్లుగానే జరిగిందనుకున్నాడుకీర్తిసేనుడు.కన్నప్రేమను మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. బిడ్డలపై ప్రేమతో ఏ తల్లీ,తండ్రీ తన బిడ్డలపై ఫిర్యాదు చేయటానికి రావడంలేదని గ్రహించాడు.
కీర్తిసేనుడు బాగా ఆలోచించిరాజ్యమంతటా
ఓ ప్రకటన చేసాడు.
' రాజు రాజ్యమంతటా వృద్ధుల కోసం ఆశ్ఱమాలుఏర్పాటు చేస్తున్నాడు,ఆశ్రమంలో తల్లిదండ్రులను చేర్చాలనుకునేవారు  వారి వివరాలనునమోదుచేసుకోవాలి.నమోదైనవారి సంఖ్యనుబట్టి ఆశ్రమాలు ఏర్పాటు చేస్తారు,తల్లిదండ్రులుపిల్లలదగ్గరుండాలి.లేదా ఆశ్రమంలో ఉండాలి.విడిగావుంటే కొడుకులు శిక్షార్హులవుతారు,
అయితేఓషరతు.ఒక్కసారిఅమ్మా,నాన్నలనుఆశ్రమంలో చేర్చిన తర్వాతబిడ్డలు అమ్మానాన్నలనుచూడటానికి‌ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబడరు.ఆశ్రమంలో చేర్చినరోజే చివరిచూపు.
ఈవిషయం రాజ్యమంతటా ప్రచారం చేసారు.
వేలమంది కొడుకులు పేర్లు నమోదుచేసుకున్నారు.తల్లిదండ్రులను ఆశ్రమంలో చేర్చితే మళ్ళీ
చూడలేమని  కూతుర్లు తాము పుట్టిన ఇంటికిబయల్దేరారు.అమ్మా, నాన్న లను ఆశ్రమంలో చేర్చవద్దని  అన్నా వదినలతో వాదనకు దిగారు.
"నువ్వు నీ అత్త,మామలను ఆశ్రమంలో చేర్చొచ్చు.మేము చేర్చకూడదా?" అంటూ వదినలు వాదనకు దిగారు.అన్ని చోట్ల అదే పరిస్థితి‌'తనకు అమ్మ,నాన్నలు ఎంతో అత్తమామలు కూడా అంతే'అనే సంగతి కోడళ్ళకు స్ఫురించింది‌.తల్లిదండ్రులను ఆశ్రమంలో చేర్చుకోమని పేర్లు నమోదు చేసుకున్న వేలాది కుటుంబాలకు రాజు నుండి అధికార ముద్రతో,కీర్తిసేనుడి సంతకంతో ఓ లేఖ అందింది.
ఒక్కసారి ఆలోచించండి!
అమ్మా,నాన్న ను మించిన దైవం ఈ లోకంలోలేరు.ఈ ప్రపంచంలో మిమ్మల్ని అమితంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ అమ్మానాన్నలే.అందుకే ధర్మగంట మ్రోగించి బిడ్డల మీద ఫిర్యాదు చేయటానికిఏఒక్కరూ రాలేదు. చావు బ్రతుకులతో పోరాడి అమ్మబిడ్డలకు జన్మనిస్తుంది.ఏ పనీ చేసుకోలేక,లోకమే తెలియక మంచంలో పడుండే బిడ్డకు సర్వం తానై,ఆప్యాయతనే అమృతంలో ముంచి,పెంచి,పెద్దచేసి,నడక నేర్పిస్తుంది.అమ్మా,నాన్న లు అష్టకష్టాలు పడి,తినీతినక బిడ్డల కడుపు నింపుతారు.బిడ్డలకుచిన్నగాయమైనా,జ్వరమెుచ్చినా వాళ్ళకే వచ్చినంతగా విలవిలలాడిపోతారు.ఎండలో,వానలో రాత్రీ
పగలు కష్టపడి పెంచి పెద్దచే స్తారు.పిల్లల కొరకుతమ సుఖాన్ని,కోరికల్ని చంపుకుని బ్రతుకుతారు
.అలాంటి అమ్మ,నాన్నలను చివరిదశలో కొంతకాలం దగ్గరుంచుకోలేని బిడ్డలు ఈభూమ్మీద బ్రతకడానికే అనర్హులు,అమ్మా, నాన్న  ఒక రోజు కనిపించకపోతే  గుక్కపట్టి
ఏడ్చిన రోజులు మర్చిపోయి ,ఈరోజు వారినిశాశ్వతంగా వదిలించుకోవటానికి సిద్దపడ్డారు.
.మీకంటే  ఈభూమ్మీద హీనమైనదేదీ లేదు,
రాబోయేరోజుల్లో మీకొడుకులు కూడా మిమ్మల్ని ఇలాగే వదిలించుకుంటారు,అదే ఆశ్రమానికిపంపిస్తారు,ఒక్కసారి ఆలోచించండి.
                                  ఇట్లు
             ‌‌‌           మీ కీర్తి సేనుడు
ఆలేఖ అందరినీ ఆలోచనలో పడేసింది,తల్లిదండ్రులు లేకుండా తామెక్కడున్నామనిప్రశ్నించుకున్నారు.కొడుకులు ,కోడళ్ళు సిగ్గు పడ్డారు,ఆశ్రమంలో చేర్చడానికి నమోదుచేసుకున్న తమపేర్లను అందరూ తొలగించుకున్నారు,
అమ్మా నాన్నలను ఇంట్లోకి తెచ్చుకున్నారు.
తల్లిదండ్రులను ఇంట్లో వుంచుకున్న వారిలోఅతిపేదలెవరో గుర్తించమని రాజు ఆజ్ఞాపించాడు,
నిరుపేదలైనవారి తల్లిదండ్రుల కోసం ప్రతినెలాకొంతడబ్బు అందేలా ఏర్పాటు చేశాడు,దీనికొరకు పెద్దమొత్తంలో ధనం కేటాయించాడు.
       ఊరు ఊరునా తల్లిదండ్రుల గొప్పదనాన్నివిలువనుచాటడానికి,సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్న సారా,బాల్యవివాహాల వంటి కొన్ని సమస్యల పట్ల ప్రజల ను చైతన్యవంతులను చేయటానికి రాజ్యమంతటా కళాబృందాలను,వక్తలను ఏర్పాటుచేశాడు.దీనికొరకు పెద్ద మొత్తంలో ధనం కేటాయించారు.ఒకరోజు మంత్రి రాజుతో "మహారాజా!నాదొక సందేహం ఇంత డబ్బును ఈ విధంగా ఖర్చు చేయటమెందుకు? ఈ డబ్బుతో ఆశ్రమాలు ఏర్పాటు చేస్తే సరిపోయేది కదా!" అన్నాడు.
అందుకు కీర్తిసేనుడు చిరునవ్వు నవ్వి"వృద్దాశ్రమాలు నిర్మించి,లేదా కఠినమైన శాసనాలు చేసి ఈ సమస్యను పరిష్కరించవచ్చు.కానీ తరతరాలు తల్లిదండ్రుల ను ఆశ్రమాలలో చేర్చే మార్గంలో నడుస్తాయి.వృద్దుల సలహాలు అనుభవజ్ఞానం పిల్లలకు అవసరం.కాబట్టి వృద్ధులు ఇళ్లలోఉండాలి.ఆశ్రమాలకు పంపే సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తే ప్రేమాభిమానాలు,మానవత్వం నశిస్తాయి.అది సమాజానికి చాలా ప్రమాదం.కావలసింది ఆశ్రమాలు,శాసనాలు కాదు.ప్రజల్లో చైతన్యం ముఖ్యం.శాసనాలు అమలు జరుగుతాయన్న నమ్మకం లేదు.రాజులు మారవచ్చు,శాసనాలు మారవచ్చు.రాజులు మారి ఆశ్రమాల నిర్వహణ ఆగిపోవచ్చు.సారా,బాల్యవివాహాలు,జూదం మొదలగు సమాజాన్ని నిర్వీర్యం చేసే పనులు,శాసనాలు చేసినా చాప క్రింద నీరులా సమాజంలో వ్యాపిస్తూ ఉండవచ్చు.వీటి పరిష్కారానికి కావలసింది ప్రజా చైతన్యం.ప్రజలఆలోచనావిధానంలో మార్పు తేవాలి.ఆ మార్పు చైతన్యవంతంగా సమాజంలోతరతరాలకూప్రవహిస్తుంది.ప్రజాచైతన్యం మాత్రమే సమాజాన్ని కాపాడగలదు.నేను కోరుకున్నది ఇదే!అన్నాడు. రాజు దూరదృష్టికి మంత్రి ఆశ్చర్యచకితుడయ్యాడు.