ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఒక్క టీకా కోసం--కె ఎస్ అనంతాచార్య.
September 17, 2020 • T. VEDANTA SURY • Poem

ఉరుము లేని పిడుగులా 
ఊడిపడి
మానవాళి బ్రతుకుల
దుఃఖ భాజనం చేసి
దేశాలను చుట్టుతూ
అంటుకొని అరగోస పెట్టే అదృశ్య జీవి

అణు రహస్యం ఛేదించి సృష్టి కి ప్రతి సృష్టి చేసిన జాతి ఇప్పుడు భీతి తో వణుకుతోంది

సంక్షోభంలో జనాలు
వేడి నీళ్లయి మసలుతున్నారు
ఇండ్లలోనుంచి నిట్టూర్పుల
అవిరులు ఎగిసి పడుతున్నాయి

నీరెండ కోసం మిద్దెలెక్కి చెమటలు కారుస్తున్నారు
అలవాటు లేని కషాయాల తో
 రోగాలు కొని తెచ్చుకుంటున్నారు

వీర విహారం చేస్తూ
విలయతాండవ మాడుతూ మూడు కోట్ల మైలరాయిని దాటిన 
ఈ పరుగు ఆపే దెపుడు!

గొంతులు మూగపోయాయి
చాక్పీసులు తెల్ల మొగ మేసాయి
సిరంజీలు పగిలినాయి 
నాగళ్ల నోగలు
విరిగిపోయాయి

ఊపిరులు ఆపి
నుదిటి కుంకుమలుజార్చి
తల్లి దండ్రుల అమరుల జేసి
 పిల్లల బతుకు రోడ్డు పాలు చేసిన
 పాషాణ గుండె కరోనా

కోతి మూతి మాస్కుల కు
విముక్తి ఎప్పుడో
రోత పుట్టించే చేతి పూతలకు మూతలుపెట్టేదెపుడో?

దాడికి విరుగుడు  
బాడీలు లేక
జోరెత్తిన వైరస్
మారుదాడుల 
అంతానికి కొత్త సీరం
 తీరం చే రేదెన్న డు

పరిశోధక దేవుడు పంపే టీకా కోసం
ప్రపంచం చాతక పక్షి లా
 ఎదిరిచూస్తోంది