ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఓ కప్పు ఛాయ్---ఓషో రాసిన పుస్తకాలన్నీ చదవాంటే కొన్నేళ్ళు పడుతుంది. ఆయన అన్ని పుస్తకలు రాయడానికి కారణం పుస్తకాలను తెగ చదవడమే. నాకు తెలిసినంతవరకూ అన్ని పుస్తకాలు చదివిన వారెవరూ లేరనిపిస్తోంది. ఒకవేళ చదివినా ఓషో రాసినన్ని పుస్తకాలు రాసి ఉండరని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన రాసిన పుస్తకాలలో నాకెంతో ఇష్టమైనది "ఎ కప్ ఆఫ్ టీ". ఈ పుస్తకాన్ని రెండు భాషలలో చదివాను. మొదటగా చదివింది ఇంగ్లీషులో. సన్ టీవీ గ్రూపులో పనీ చేస్తున్న రోజుల్లో ఓ మళయాల మిత్రుడి వల్ల ఈ పుస్తకం పరిచయ మైంది. అతను చెప్పడమేకాక పుస్తకం నాకిచ్చి చదివించాడు. మొదటి కొన్ని పేజీలు తిరగేసేసరికి నాకంటూ ఓ పుస్తకం కొనుక్కుంటే సరిపోతుందనుకుని ఉస్మాన్ రోడ్డు (మద్రాసు టీనగర్లో) లో ఉన్న న్యూ బుక్ ల్యాండ్స్ కి వెళ్ళి కొన్నాను. ఇంగ్లీషులో చదివిందానితో తృప్తిపడక టీ. నగర్లోనే ఉన్న కణ్ణదాసన్ పబ్లికేషన్స్ కి వెళ్ళి తమిళంలోనూ ఓ పుస్తకం కొన్నాను. అటుతర్వాతి కాలంలో ఓషో పుస్తకాలు కొన్ని తెలుగులోకి అనంవదించిన ఇందిరగారు ఓషో ఫోటోలతో కూడిప ఓ భొరీ ఇంగ్లీష్ బుక్కొకటి ఇచ్చారు. ఇది కూడా ఎ కప్ ఆఫ్ టీయే. ఈ పుస్తకాన్ని నేను కొంతకాలొనికి మిత్రుడైన లలితాప్రసాద్ కి ఇచ్చాను ఉంచుకోమని. ఈ పుస్తకం తెలుగులోకి రాయాలనిపించి సగం వరకూ రాసేసాను కూడా. ఆ తర్వాత కుటుంబపరిస్థితుల కారణంగా ఈ రచన కొనసాగించలేకపోయాను. కానీ నేను కొనుకున్న ఈ తమిళ పుస్తకాన్ని నేను అప్పుడప్పుడూ చదువుతూనే ఉంటాను. తమిళంలో ఈ పుస్తకాని అనువదించిన రచయిత పువియరసు. ఎంతో సరళంగా రాశారు.ఓషో తమ శిష్యులకు రాసిన ఉత్తరాలివి. అవి కవితా శైలిలో రాశారు. ముచ్చటైన రచన. ప్రతీ ఉత్తరం ప్రేమ అనే మాటతో మొదలవుతుంది. ఇది చదువుతుంటే ఉత్తరాలింత చక్కగా రాయవచ్చుగా అనిపిస్తుంది. ఉత్తరాల మాటకొచ్చేసరికి తెలుగులో చలంగారి ఉత్తరాల సాహిత్యం గుర్తుకొస్తుంది నాకు. ఆయన రాసిన ఉత్తరాలు చదవకముందే నేను కొందరికి ఎన్నో ఉత్తరాలు రాసొను. వాటిలో ఎక్కువగా నేను కోట్ చేసినవి రవీంద్రనాథ్ టాగూర్ మాటలే. మా ఆవిడకీ, అంతకు ముందు ఇద్దరమ్మాయిలకీ రాసిన ఉత్తరాలన్నీ ఉండి ఉంటే ఈరోజొక మంచి పుస్తకం తయారయ్యేది. ఈ కాలంలో అసలు ఉత్తరాలు రాసుకోవడమే లేదు. పోస్ట్ మ్యాన్ నుంచి ఉత్తరాలందు కుని చదవడంలోని ఓ ఆనందానుభూతి ఈతరం వారు కోల్పోయారనే అనిపిస్తుంది. ఉత్తరాల కోసం ఎదురు చూడటంలో ఓ ఆనంద ముంటుంది. అది ఉత్తరం అందుకున్న మరుక్షణం ఆనందం రెండింతలవుతుంది. మనసుకి రెక్కలొస్తాయి. మనల్ని మనం మరచి పోతాం. ఊహాలోకంలోకి విహరిస్తాం. ఆ తర్వాత తిరిగి మనం ఆ ఉత్తరానికి జవాబు రాయడం....అవన్నీ పోయి ఫోన్లలో పొడి పొడి మాటలతో మెసేజ్ ఇచ్చుకోవడం...వాటిలో ఏముంటుంది ప్రేమా దోమా ఆనందమూనూ.....???ఎ కప్ ఆఫ్ టీ తమిళ పుస్తకం చివర్లో రండి, ఛాయ్ తాగేరా అంటూ రచయిత ఓ మూడు పేజీలు రాసారు. ఈ మూడు పేజీలలో ఒక చిన్న కథ కూడా ఉంది. అది టీ పుట్టుక గురించి. బలే ఉందది.జపాన్లో పుట్టింది జెన్. ఇది మతం కాని మతం. జెన్ ఆది గురువు బోధిధర్ముడు. ఆయన తొమ్మిదేళ్ళు ధ్యానం చేస్తాడు. గోడను చూస్తూ కూర్చుని కొనసాగించాడీ ధ్యానం. కొన్నిసార్లు నిద్ర వచ్ఛేసేది. అయితే ఆ నిద్ర రాకుండా ఉండటానికి ఆయన పోరాడాల్సి వచ్చేది. నిద్రను అధిగమించడానికి యాతన పడేవాడు. అయినా అది సాధారణ నిద్ర కాదు. జ్ఞాన నిద్ర. ధ్యానంలోనూ చైతన్యవంతులై ఉండటాన్నే కోరుకున్నాడు. అందుకోసం ఆయన ముందూ రాత్రీ పగలూ ఓ దీపం వెలుగుతుండేది. అదే నిజమైన ధ్యానం. చైతన్యవంతమే ధ్యానం.ఓరోజు రాత్రి ఆయన నిద్రను ఆపుకోలేకపోతాడు. దాంతో నిద్రను జయించడంకోసం తన కనురెప్పలను పీకి విసిరేస్తాడు. విసిరేసిన ఆ కనురెప్పలు పడిన చోట అవి మొక్కలై చిగురించాయట. అవే తేయాకు మొక్కలట. అందుకే ఛాయ్ తాగితే నిద్ర రాదని ఓ కథ తెలిసిందేగా....ఛాయ్ మేల్కొని ఉన్నామనేందుకు ఓ సంకేతం. ఛాయ్ తాగడం అంటే బోధిధర్ముడిని అంతరంగంలోకి స్వీకరించడమే. ఇదంతలా ఉండనిచ్చి ఓషో రాసిన ఓ ఉత్తరాన్ని నాకు అర్థమైన రీతిలో ఇక్కడ రాస్తున్నా... ప్రియమైన... నీ ఉత్తరం అందింది. నేనిక్కడకు చేరుకున్నప్పటి నుంచీ నీ ఉత్తరం కోసం నిరీక్షించాను. కానీ నిరీక్షణ ఎంత అందమైనదో. మధురమైనదో. జీవితమే ఓ నిరీక్షణ కదా. విత్తనం మొలకెత్తడం కోసం నిరీక్షిస్తోంది. నది సముద్రంలో సంగమించడానికి నిరీక్షిస్తోంది. మనిషి దేని కోసం నిరీక్షిస్తున్నాడు? అతనూ ఓ వృక్షం తాలూకు విత్తనమేగా. ఓ సముద్రాన్ని కలిసే నదేగా. అంతరంగంలోకి దీక్షగా చూసే వారెవరైనా తమ అంతరాంతరాలలో అంతులేని, ఎల్లలు లేని స్థితికి చేరడాన్నే తెలుసుకుంటారు. ఇది తెలుసుకున్న వారు భగవంతుడిని చేరే దిశలో తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. అవును. దాహం వేసే వాడు నీటికోసం వెతక్కుండా ఉంటాడా? వెతకకుండా ఉండటమనేది జరగనే జరగదు. వెతకాల్సిందే. ఎక్కడైతే అన్వేషణ ఉంటుందో అక్కడ గమ్యం చేరే దాహముంటుంది. ఒక్కొక్కరూ తమ ఈ దాహాన్ని తెలుసుకోవాలన్నదే నా ఇష్టం. ప్రతి ఒక్కరి జీవితమూ నిరీక్షణై మారాలనే నా ఇష్టం. భగవంతుడి దిశలో ప్రయాణించి అతనిని చేరుకోవడానికి సాగే నిరీక్షించే జీవితమే నిజమైన జీవితం. మిగిలిన అన్ని జీవన విధానాలన్నీ వ్యర్థమే. విలువలేనిదే! - యామిజాల జగదీశ్
August 8, 2020 • T. VEDANTA SURY • Book Review