ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఓ కవి డైరీ:--A.K.Ramanujan – Journeys – A Poet’s Diary అనే పుస్తకాన్ని మద్రాసులో ఉన్న రోజుల్లో చదివాను. ఈ పుస్తకం చదవడానికి ముఖ్యకారణం ఓ కవి డైరీ ఏం రాసుకున్నారో చూడాలని ఆరాటం. నాకు ప్రముఖుల డైరీలు , ఉత్తరాలు చదవాలంటే మహా ఇష్టం. అటువంటి ఉత్తరాల పుస్తకాలు కొన్నాను కూడా. ఇక్కడ చెప్పబోయే పుస్తకం ఎ.కె. రామాజన్ అనే కవిగారి పుస్తకం. ఆయన తమిళనాడులోని మదురైలో ఉన్న త్యాగరాజర్ ఆర్ట్స్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు.ఆయన 1951లో మదురైలో పని చేయడం కోసం వెళ్ళారు. యాభైలలో మదురై గురించీ, తన ఉద్యోగ అనుభవాల గురించీ ఓ ఆంగ్ల పత్రికలో రాసుకున్నారు. ఆయన ఓ గొప్ప కవి. వ్యాసకర్త. అనువాదకుడు. పరిశోధకుడు. ఇంగ్లీషులోనూ కన్నడంలోనూ కవితలూ కథలూ రాశారు.The Interior Landscape: Classical Tamil Love Poems, Poems of Love and War: From the Eight Anthologies అనే పుస్తకొలనం రాశారు.చికాగో విశ్వవిద్యాల యంలో రామానుజన్ పని చేసిన రోజుల్లో ఆయన కృషి వల్లే మద్రాసులో రాజా ముత్తయ్య లైబ్రరీ ఏర్పడింది.ఆయన రాసిన పుస్తకాలలో Collected Essays of A. K. Ramanujan ఎంతో ముఖ్యమైనది ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన రామానుజన్ కు తమిళ సాహిత్యమంటే మక్కువెక్కువ. అలాగే తమిళ జానపద కథలన్నా ఎంతో ఇష్టం.ఆయన సంకలనపరచిన A Flowering Tree and Other Oral Tales from India అనే భారత దేశ కథల పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. ఇంగ్లీష్ సాహిత్యం చదివి కేరళలలో ఉద్యోగం కోసం వెళ్తున్నప్పుడు మదురైలో ఓ ఉద్యోగానికి అవకాశం ఉందనే ప్రకటన చూసి రామానుజన్ అందుకో దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు ముగ్గురిని ఇంటర్వ్యూకి పిలిచారు. వారిలో రామానుజన్ ఒకరు. ఈయనను ఉద్యోగానికి ఎంపిక చేశారు. మదురైలో తొప్పక్కులం అనే ప్రాంతానికి దగ్గర్లో ఉన్న త్యాగరాజర్ కళాశాల ఆవరణ గురించీ అక్కడి లైబ్రరీ గురించీ అక్కడున్న బల్లల గురించీ ఆయన తన డైరీలో రాస్తూ వచ్చారు.ఆయనకు మదురైలో బంధువులు ఉండేవారు. కనుక వారి ఇళ్ళల్లో బస చేస్తూ కాలేజీలో పని చేసుకుంటూ ఉండేవారు.ఆయన వైగై నది గురించి ఇంగ్లీషులో ఓ కవిత రాశారు.మదురై ప్రాంతంలో చేసే వంటల రకొల గురించీ మీనాక్షి అమ్మవారి ఆలయ శిల్పాల గురించీ వేయి కాళ్ళ మండపం గురించీ ఆయన ఎన్నో రాశారు. కుమారి కమల అనే ఆవిడ నాట్యం చూసిన తర్వాత, Destination Moon అనే ఇంగ్లీష్ సినిమా చూసిన జ్ఞాపకాలను కూడా డైరీలో రాశారు.రద్దీగా ఉండే మదురై రైల్వే స్టేషన్ గురించీ గాంధీ గ్రామ అందమైన దృశ్యాల గురించీ అమెరికన్ కాలేజీలో జరిగిన ఓ సదస్సు గురించీ ఆయన రాసుకున్నారు.మదురై దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు రాసిన ఆయన కవితలూ విశేష ప్రాచుర్యం పొందాయి.మైసూరులో ఉండిన ఓ తమిళ .కుటుంబంలో పుట్టి పెరిగిన రామానుజన్ తండ్రి ఓ లెక్కల ప్రొఫెసర్. ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రామానుజన్ 1959 లో Fulbright fellowship పొంది అమెరికా వెళ్ళి ఇండియానా విశ్వవిద్యాల యంలో చేరారు. అక్కడ ఉన్న కాలంలోనే భాషపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు.1962లో చికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. 1968లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు.హార్వర్డ్ విశ్వవిద్యాలయం, విస్కాన్ విశ్వవిద్యాలయం, మాడిసన్ విశ్వవిద్యాలయంలోనూ ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పారు.తమిళ సాహిత్యంతో పాటు కన్నడ సాహిత్యంగురించి ఇంగ్లీషులో అనేక వ్యాసాలు రాశారు. ప్రత్యేకించి యు.ఆర్. అనంతమూర్తి గారి పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించగా అది ఎంతో ఆదరణ పొందింది.రామానుజన్ మరణానంతరం ఆయన డైరీలు అనువాద రచనలను చికాగో విశ్వవిద్యాలయం పదిలపరచింది. వాటి ఆధారంగా పరిశోధనలు చేస్తున్న విద్యార్థులుండటం విశేషం. ఆయన తన డైరీలో తన నౌకాయానం గురించి ఆసక్తకరంగా రాశారు. 1959 లో అమెరికాలో పరిశోధన చేయడంకోసం ఆయన ముంబై నుంచి న్యూయార్క్ వరకూ నౌకలో ప్రయాణం చేశారు. ఈ ప్రయాణానుభవం గురించీ ప్యారిసులో ఆయన చూసిన మ్యూజియం గురించీ అక్కడి కళల గురించీ ఆయన ఎంతో గొప్పగా రాశారు.ఓ అధ్యాయంలో ఆయన మత్తు పదార్థాలిచ్చే కిక్కు గురించి కవిత రాయడానికి ప్రయత్నించిన అనుభవాన్నీ రాశారాయన. ఆయన గృహస్థు జీవితంలో భార్యతో తలెత్తిన గొడవలు, దూరమవడం, మళ్ళీ కొంత కాలానికి భార్యను కలవడం వంటి విషయాలను విపులంగా రాసుకున్నారు. ఉద్యోగం కోసం ఆయన సాగించిన వెతుకులాటలో మానసిక ఆందోళనను భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన గురించీ ఆయన రాసినవి చదువుతుంటే అన్ని కాలాల్లోనూ యువకుల మానసిక స్థితి ఒకేలా ఉంటోందని అనిపించకమానదు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామానుజన్ ఆర్థిక పరిస్థితుల గురించిన ఆందోళనలు ఆయనలో అధికంగా ఉండేవి.తాను ఓ సంతోషకరమైన కుటుంబాన్ని సృష్టించలేనేమోనని కలవరపడ్డారు. మంచి జీతం మంచి ఉద్యోగం ఇల్లు అంటూ సకల సౌకర్యాలూ సమకూరినప్పటికీ ఆయన ఈ జీవితం తనదైనది కాదని అనుకున్నారు. ఇవన్నీ పైపై మౄరుగులుగా భావించారు. బయటకు చెప్పుకోలేని ఆందోళనలు అయోమయ స్థితిగానే ఆయన జీవితం సాగినట్లు ఈ పుస్తకం చదువుతుంటే అనిపించింది.ఇంతకూ ఈ డైరీ ఎందుకు రాశానో అని ఆయన చెప్తూ "నేనేమనుకుంటున్నాను, ఎలా ఫీలవుతున్నాను, ఎలా నడచుకుంటున్నాను అని తనను తాను సమీక్షించుకోవడం కోసమే ఈ డైరీ రాసుకునేవాడిని.... ఇవి రహస్యాలైనప్పటికీ దాచవలసిన విషయాలు కావనుకున్నారాయన.ఓ కవి ఎలా ఎదిగారని తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం.- యామిజాల జగదీశ్
August 7, 2020 • T. VEDANTA SURY • Book Review