ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఓ మనిషీ తరచి చూడు-- రామ్మోహన్ రావు తుమ్మూరి
September 7, 2020 • T. VEDANTA SURY • Poem

మనిషికెపుడు మనసులోన
మార్పుకొరకు ఆరాటం
తనలో గుండెకు బుద్దికి
నిరంతరం పోరాటం

ఆకలికోసం యుద్ధం
అనివార్యం ఎప్పుడూ
శోకం పెంచే యుద్ధం
ఆగిపోవుటెప్పుడూ

మనిషికి మనిషే శత్రువు
ఏ చరిత్ర చదివినా
సంగ్రామాలకు మూలం
స్వార్థం కాదందునా

ఆకసానికెన్ని ఎన్ని
నిచ్చెనలను వేసినా
సుఖసౌధాగ్రపు అంతిమ
అంతస్తులు అందునా

తలపండిన ఋషులెందరొ
బోధలెన్ని చేసినా
అహమహమిక శార్వరిలో
వెలుగులు విరజిమ్మునా

కంటికి కనిపించని చిరు
కణం నిన్ను నిలదీస్తే
పనికిరాని నీ ప్రగల్భ
ప్రగతి నిన్ను ప్రశ్నిస్తే

ఏది నీ సమాధానం
ఏది నీకు సంధానం
ఓ మనిషీ తరచి చూడు
నీ జీవనవిధానం