ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కందుకూరి వీరేశలింగం గారికి ఆటల యందు కూడా ఆసక్తి ఉండేది. బాల్యము నుండి దుర్బలుడు అగుటచే అలసట, ఆయాసం, నీరసం కలిగించే ఆటలు ఆడే వాడు కాదు. నీడ పట్టున ఉంటూ, శారీరక శ్రమలేని ఆటలు ఆడే వాడు. తీరిక దొరికినపుడంతా చదరంగము, దశావతారాలు, చీట్లు మొదలైన ఆటలకు చింత గింజలతో పందెం మొదలు పెట్టి చివరకు పైసల వరకు ఆట సాగించేవారు.ఒక సారి మిత్రులు కబుర్లు చెబుతూ, మంచి స్థలమని చూపుతూ, ఒక ముసలి దాని ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆట మొదలు పెట్టారు, తరువాత ఆ ముసలిదానిని కూర్చోపెట్టి ఆడించారు. తరువాత పడుచు పడతిని తీసుకువచ్చి ఆటలాడించడం ప్రారంభించారు. అది నీతిమాలిన పని అని వీరేశలింగం భావించి, చాలా పశ్చాత్తాప పడ్డాడు. ఇక ఆ మిత్రునితో స్నేహం విడిచిపెట్టాడు. 1871లో దొరతనం వారి మండల పాఠశాలలోకుప్పుస్వామి శాస్త్రులు ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. ఆయన సహాయంతో నెలకు 25 రూపాయల జీతంతో సహాయోపాధ్యాయుడిగా నియమింపబడ్డారు. ఇంగ్లీషు, లెక్కలు, హిందూ దేశ చరిత్ర బోధన ప్రారంభించారు. కానీ అది సంవత్సరమైనా సాగలేదు. కారణం ఏమిటంటే ఆ పాఠశాలలోనే వేపా రామమూర్తి అనే మరో ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన తమ్ముడు కృష్ణమూర్తి అదే పాఠశాలలో చదువుతుండేవాడు. వాడు ఎంత అల్లరి చేసిన ఉపాధ్యాయులు చూసి చూడనట్టుగా విడిచి పెట్టేవారు. కానీ వీరేశలింగం తన తరగతిలో ఒకసారి అల్లరి చేసినప్పుడు వెనుక ముందు చూడకుండ వాడిని బల్ల మీద నిలిచో పెట్టి పాఠశాల ముగిసే వేళ వరకు శిక్షించారు. మరో ఉపాధ్యాయుడు తగదని హెచ్చరించిన లెక్కచేయ లేదు. కాని వేపా రామమూర్తిగారు వచ్చి, నా తమ్ముడని మొహమాట పడక మీ ధర్మాన్ని నిర్వర్తించారు, మీకు అభినందనలు, మరీ మరీ కృతజ్ఞతలని కూడా తెలియజేశారు. వీరేశలింగంగారి ముక్కుసూటిదనానికి, నీతికి అందరూ మెచ్చుకున్నారు. ఆయన న్యాయవాది కావాలనే కోరికతో 1871సం.లో మేజిస్ట్రేట్ పరీక్షకు హాజరయ్యాడు. 1872సం.లో విజయం సాధించినట్లు గజిట్ లో ప్రకటించబడింది.ఆయనకు భూత ప్రేత పిశాచాల ఉనికి మీద నమ్మకం ఉండేది కాదు. "భూత వైద్యులందరు కపటనాటకాలాడే వారు" అనే వాడు.మంత్రాలంటే కుతంత్రాలనేవాడు. విశ్వాసం లేని విషయాలను విశ్వాసం లేనట్లు చెప్పడమే కాక వాటిని ఆచరణలో నిర్దిష్టంగా చూపించేవాడు. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వీళ్ల పెరట్లోని అరటిచెట్టు మధ్యలో నుండి ఒక గెల వేసింది. అది ఇంటికి మంచిది కాదని ఆ చెట్టును కొట్టించేయమని నలుగురు చెప్పారు. కానీ వీరేశలింగం కొట్టించనని ఏం జరుగుతుందో చూద్దాం అనేవాడు. గెల ముదిరింది పండ్లు కోసీ ఇంట్లో అందరూ తిన్నారు. ఇంకేం జరుగుతుంది? ఏమీ జరగలేదు! సరిగ్గా అదే సమయానికి ఇంట్లోనే మధ్య దూలానికి తేనె పట్టు పట్టింది, ఇంటికరిష్టం అన్నారు. గృహ శాంతి చేయించాలని అన్నారు. "నేను అటువంటివేమీ చేయించను, ఏమి జరగదు"అంటూ నిర్ద్వందంగా చెప్పాడు.1872సం.లో ఇతనికి కోరంగి గ్రామంలో ఆంగ్ల పాఠశాలలో ఉపాధ్యాయుని ఉద్యోగం వచ్చింది. జీతం నెలకు 30 రూపాయలు. "మంచి రోజు చూసి ఉద్యోగంలో చేరు," అని సలహా ఇచ్చారు. కాని వీరేశలింగం అమావాశ్య నాడు వెళ్ళి చేరాడు.ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇలా పారదర్శకంగా ప్రవర్తించి మరికొందరికి ఆయన ఆదర్శప్రాయం అయ్యాడు.1872లో భాషాంతరీకరణ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 1874లో కోరంగి లోని ఉద్యోగము విడిచిపెట్టి రాజమహేంద్రవరానికి నాలుగు మైళ్ళ దూరంలో కల ధవళేశ్వరం లోని ఆంగ్ల దేశ భాషా పాఠశాలలలో నెలకి రూ.44/- జీతం గల ప్రధానోపాధ్యాయుని పదవిలో చేరారు. ఆ సమయంలో కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు స్త్రీ విద్యకు వ్యతిరేకంగా రాయగా, వీరేశలింగం గారు స్త్రీల విద్య కు అనుకూలంగా "పురుషార్ధ ప్రదాయిని"లో రాశాడు. చాలా ఉత్తరాలను కూడా పద్య రూపంలో రచన గావించాడు.ఈయనకు కొత్త మిత్రులైన వెంకట జోగయ్య మొదలైనవారు స్త్రీ విద్య అవసరం అన్న వాదన సమర్థించారు. ఆ సంవత్సరమే ఆయన "వివేకవర్ధిని" అనే మాస పత్రికను ప్రారంభించారు.1875లో సంక్షేప లేఖన(précis writing) పరీక్ష ఇంగ్లీషులో పాసయ్యారు. ఈ పరీక్ష సందర్భంలోనే ఆయన అచట గల రాజకీయ శాస్త్ర పాఠశాల అధ్యక్షులైన "మెట్కాఫ్" దొరగారితో ఆయనకు పరిచయం కలిగింది. అక్కడకు కుప్పుస్వామి శాస్త్రుల వారు కూడా వచ్చేవారు.వారికి కలిగిన సందేహాలను వీరేశలింగంగారు తీర్చారు. వాక్యార్ధ విషయంలో కుప్పుస్వామి కంటే వీరేశలింగంగారిదే అర్థవంతమైన వివరణ అని దొరగారు సంతృప్తి చెందారు. వీరేశలింగం గారు కోరంగిలో ప్రధాన ఉపాధ్యాయునిగా పని చేస్తున్నప్పుడు, ఆయన 'సంగ్రహ వ్యాకరణం' రచించి, విద్యార్థులకు పాఠాలు సులభంగా బోధించి చూపించారు. ఆ కాలంలో పాఠశాల తనిఖీకి స్కూల్లో ఇన్స్పెక్టర్ వస్తే, ఆయన కుర్చీలో కూర్చుంటే, ప్రధానోపాధ్యాయుడు చేతులు కట్టుకుని నిలబడటం ఆచారం. కాని వీరేశలింగం గారు ఆ ఆచారాన్ని ప్రక్కకు నెట్టి, ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు, ఆయనకు కుర్చీ వేసి తనకు కూడా కుర్చీ వేయించుకునేవాడు. ఈ విధంగా ఆత్మాభిమానం చాటుకున్నాడు వీరేశలింగం. ( ఇంకా ఉంది )- ఇది 90వ భాగ - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 12, 2020 • T. VEDANTA SURY • Serial