ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కనిపించని థియేటర్లు---మద్రాసులో ఒకానొకప్పుడు ప్రముఖంగా ఉండిన సినిమా థియేటర్లలో చాలా వరకు ఇప్పుడు కనిపించ కుండాపోయాయి. వాటి స్థానాలలో కళ్యాణమంటపాలో షాపింగ్ మాల్సో అపార్టుమెంట్లో పుట్టుకొచ్చాయి.త్యాగరాయనగర్ (టీ. నగర్) లో పుట్టి పెరిగిన నాకు తెలిసి కృష్ణవేణి, రాజకుమారి, నగేష్, మాంబళంలోని లేక్ వ్యూరోడ్డులో నేషనల్ థియేటర్లతోపాటు నగరంలోని కామధేను, చిత్రా, గెయిటీ, క్యాసినో, ప్లాజా, పైలట్, అలంకార్, మినర్వా, శ్రీ కృష్ణా, సెలెక్ట్, క్రౌన్, భువనేశ్వరి, ప్రభాత్, బ్రాడ్వే, నటరాజ్, వెలింగ్టన్, శాంతి, సఫైర్, బ్లూ డైమండ్, ఆనంద్, లిటిల్ ఆనంద్, లిబర్టీ, రామ్, కమలా‌‌, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా తయారవుతుంది.ఎంజిఆర్, శివాజీ, జైశంకర్, రవిచంద్రన్ ( ఇతనిల్లు మా ముందువీధిలోనే ఉండేది అప్పట్లో. సోమసుందరం గ్రౌండుకి ఎదురింట్లో ఉండేవారు), కమల్ హాసన్, రజనీకాంత్ తొలిరోజుల వరకూ ఇక్కడ చెప్పుకున్న జాబితాలో పలు థియేటర్లు బిజీగా ఉండేవి. మేఖల, శరవణ, చిత్రా, వెలింగ్టన్, బ్రాడ్వే థియేటర్లలో ఎంజిఆర్ సినిమాలు రిలీజ్ అయ్యేవి.శాంతి, క్రౌన్‌, భువనేశ్వరి తదితర థియేటర్లలో శివాజీ సినిమాలు విడుదలయ్యావి కొన్ని సందర్భాలలో మాత్రమే ఇందులో మర్పుండేది. అయితే ఇప్పుడు కనిపించక చాలా థియేటర్లు కాలగతిలో కలిసిపోయాయి.ఐనావరంలోని సయానీ థియేటర్ అపార్టుమెంటైపోయింది. పరుసవాక్కంగా పలికే పురశైవాక్కంరోని రాక్సీ థియేటర్ ఇప్పుడు శరవణా స్టోర్స్ వారి వస్త్ర దుకాణంగా మారిపోయింది.దర్శకుడు కె. బాలచందర్ సినిమాలు ఎక్కువగా ఇక్కడ రిలీజయ్యేవి. బాలూ మహేంద్ర దర్శకత్వంలోని మీల్లుం మలరుం‌, ఉదిరిప్పూకల్ తదితర సినిమాలు ఇక్కడ ఆడాయి. భాగ్యారజ్, టి. రాజేందర్ సినిమాలు కూడా ఈ థియేటర్లో చాలా రోజులు ఆడాయి.అణ్ణాఫ్లయ్ ఓవర్ నుంచి అణ్ణాదురై విగ్రహం వరకూ వెళ్ళే మార్గమధ్యలో ఉండిన సఫైర్, బ్లూ డైమండ్, ఎమరాల్డ్, ఆనంద్, లిటిల్ ఆనంద్, అలంకార్, వెలింగ్టన్, దేవీ ప్యారడైజ్, చిత్రా, గెయిటీ, క్యాసినో, ప్యారగన్ థియేటర్లలుండేవి. నేను మద్రాసు వెళ్ళి రెండేళ్ళుపైనే అయ్యింది. వీటిలో ఏవింకా నడుస్తున్నాయో కచ్చితంగా చెప్పలేను.బ్లూ డైమండ్ థియేటరుకో ప్రత్యేకత ఉండేది.ఈ థియేటర్లో ఏ సమయంలోనైనా వెళ్ళి సినిమా చూడొచ్చు. అంటే సినిమా మరో అయిదు పది నిముషాల్లో ముగిసేటప్పుడుకూడా హాల్లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. ఆ ఆట ముగియడంతోనే మళ్ళీ మొదలవడంతో కూర్చున్న చోటే కూర్చుని తదుపరి ఆటనూ తిలకించేందుకు అనుమతించేవారు. రచయిత టాల్ స్టాయ్ "అన్నాకెరీనా" వంటి సినిమాలు అప్పట్లో ఎక్కువసార్లు ప్రదర్శించేవారు. కొంందరు మొదటి ఆటకు లోపలకు వెళ్ళి నైట్ షో వరకూ సినిమా చూసొచ్చిన వాళ్ళున్నారు.అదొక విచిత్రమైన విధానం.నగరంలో గెయిటీ థియేటర్ చాలా పాత థియేటర్. 1930 దశకంలోంంచి ఉండిన సినిమాహాలు. ఈ థియేటరుకీ ఓ విశేషముంది. చివరిరోజుల్లో శృంగారభరిత చిత్రాలే ఎక్కువగా ఆడేవి.రాయపేటలోని ఓడియన్, ఉడ్ ల్యాండ్స్ , లియో, పైలట్ థియేటర్లలో ఉడ్ ల్యాండ్స్ ఒక్కటే ఉన్నట్టు వినికిడి. మిగిలినవి మూతబడ్డాయి. మైలాపూర్ లజ్ కార్నర్ లో కామధేను థియేటర్ ఉండేది. నేను వివేకానందా కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఒక్కొక్కప్పుడు క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడ సినిమాలు చూసిన రోజులున్నాయి.టీనగర్ పాండిబజారులో ఉండిన టి.ఆర్. రాజకుమారి థియేటరు ఇప్పుడు మెగా మార్ట్ గా మారింది. అలాగే అదే రోడ్డులో హోలీ ఏంజెల్స్ స్కూలు ఎదురుగా ఉన్న నగేష్ థియేటర్ ఇప్పుడు కళ్యాణమంటపమైంది.వెండితెరపై రాజకుమారిగా ప్రసిద్ధి చెందిన తంజావూరు రాధాకృష్ణన్ రాజాయి (1922 - 99) గాయని, కూడా. డ్యాన్సర్ గానూ మంచి పేరుంది.తమిళ సినిమాలో ఆమెను డ్రీమ్ గర్ల్ అని చెప్పుకునే వారు. ఆమె తొలి సినిమా కుమార కుళోత్తంగన్. 1938 - 39లలో ఈ చిత్రాన్ని తీసినా 1941లో గానీ విడుదల కాలేదు. తొలి రోజుల్లో ఆమె పేరు టి.ఆర్. రాజాయిగానే చూపించేవారు.ఆ తర్వాత టి. ఆర్. రాజలక్ష్మిగా పేరు మారింది. ఆమె నటించిన చిత్రాలలో కచ దేవయాని సూపర్ హిట్టయింది. ఆమెతో కలిసి నటించిన వారిలో త్యాగరాజభాగవతార్, టి.ఆర. మహాలింగం, కె.ఆర్. రామస్వామి, పి. యు. చిన్నప్ప, ఎంజిఆర్, శివాజీ తదితరులున్నారు. తర్వాతి రోజుల్లో ఆమె తన సోదరుడైన టి.ఆర్. రామణ్ణాతో కలిసి ఆర్. ఆర్. ప్రొడక్షన్స్ అనే సినీ సంస్థనుకూడా ప్రారంభించి "కూండుక్కిళి" వంటి సీనిమాలను నిర్మించారు కూడా. రాజకుమారి థియేటర్ ఆమె పేరిటే ఉండేది. తెలుగు సినిమాలు రాజకుమారి, టి. నగర్ బస్ డిపో ఎదుట ఉండిన కృష్ణవేణి థియేటర్లలో మార్నింగ్ షోగా ప్రదర్శించేవారు. ఈ థియేటర్లన్నింటికన్నా ముందుగా నిర్మించిన సినిమా హాలు పేరు ఎలక్ట్రిక్ థియేటర్. ఈ సినిమా థియేటర్ శాంతి థియేటర్ సమీపంలో ఉండేది. అలనాటి పోస్టాఫీస్ (మౌంట్ రోడ్డు) అంతకుముందు ఎలక్ట్రిక్ థియేటర్. తర్వాతది పోస్టాఫీసుగా మారింది. ఇప్పటికీ దాని గుర్తుగా అక్కడ ఓ టిక్కెట్ కౌంటర్ మాత్రం మిగిలి ఉంది. టీవీ మొదలవడంతోనో పైరసీ వీడియోల వల్లో ప్రేక్షకుల కరువై ఆర్థికంగా దెబ్బతిని అనేక సినిమా థియేటర్లు కాలగతిలో కలిసిపోయాయి. - యామిజాల జగదీశ్
July 27, 2020 • T. VEDANTA SURY • Memories