ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కప్పలపెళ్ళి:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 19, 2020 • T. VEDANTA SURY • Poem

కప్పలపెళ్ళికి వెళ్ళామూ - గొప్పగ వింతలు చూశామూ ||కప్పల||
కోడీ పెళ్ళికి పిలిచిందీ - కోతీ పందిరి వేసిందీ
కొంగ తోరణం కట్టిందీ - మేక ముగ్గులు పెట్టిందీ
ఏనుగు నీరూ తోడిందీ - హంసా వంటలు వండిందీ
బాతూ బాజా మోగించే - కుందేలు సన్నాయి వాయించే
కోయిల పాటా పాడిందీ - నెమలి నాట్యము చేసిందీ ||కప్పల||
పట్టుపురుగు తన ప్రేమతొ ఇచ్చిన - పట్టుబట్టలు కట్టిన కప్పలు
సంతోషంతో అరిచాయీ - చెంగుచెంగున ఎగిరాయీ
నవ్వుతు కలుకుతు కప్పలు రెండూ - పెళ్ళిపీటలను ఎక్కాయీ
ఎలుకా పూలూ ఏరిందీ - కుప్పగ వాటిని వేసిందీ
చిలుక మాలలూ కట్టిందీ - కప్పలజంటకు ఇచ్చిందీ ||కప్పల||
కప్పమ్మ మెడలో కప్పయ్యా - కప్పయ్య మెడలో కప్పమ్మా
పూలమాలలూ వేశాయీ - సిగ్గుల మొగ్గలు అయ్యాయీ
చింతాకు పుస్తెను కప్పయ్యా - కప్పమ్మ మెడలో కట్టెనయ్యా
చేపలు విస్తళ్ళు పరిచాయీ - తాబేలు విందును వడ్డించే
కప్పలపెళ్ళి చేశామూ - గొప్పగ విందులు కుడిచామూ ||కప్పల||