ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కమలములు నీట బాసిన: ఎం. బిందు మాధవి
November 18, 2020 • T. VEDANTA SURY • Story

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ! "
సూర్యరశ్మి ఉన్నంతవరకే నీటిలోనుండే కమలం విచ్చుకుని ఉంటుంది.
అలాంటి కమలాలని నీటిలో నించి తీసి బయట పడేస్తే, అదే సూర్య రశ్మి ధాటికి అవి వాడి వత్తలై పోతాయి.
అంటే కమలాలకి సూర్యరశ్మి కి మధ్య స్నేహపు పొత్తు అవి నీటిలో ఉన్నంత సేపే, అని ఈ పద్యానికర్ధం
....................
సృష్టిలో ఏ జీవికైనా ఒక స్వస్థానం అనేది ఉంటుంది.ఆస్థానం తప్పనంత వరకే దానికి రక్షణ.
మనం రోజూ న్యూస్ పేపర్ లో చూస్తున్నాం కదా- ఒక చిరుత దారి తప్పి అడవినించి ఒక గ్రామంలోకి చొరబడింది అని, భయంతో గ్రామస్థులు దాన్ని కొట్టి చంపేశారని.
చిరుత తన స్వస్థానమైన అడవిలో ఉన్నంత సేపు అది బలమైనది. దాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఒకసారి తన స్థానం విడిచి బయటకొస్తే దానికి రక్షణ లేదు అని.

మరి ఇప్పుడు "కమలములు నీట బాసిన" అనే మన కధలోకొద్దామా.....

అంజయ్య - లక్ష్మి దంపతులు కూలిపనులు చేసుకుని బతుకుతున్నారు..వారికో కూతురు, ఓకొడుకు.
కలో గంజో తాగుతూ గుట్టుగా జీవితం గడుపుతున్నారు.

తమ లాగా పిల్లలు కష్టపడకూడదని కూతురు దుర్గని పదో తరగతి దాక చదివించారు. కొడుకు బాలరాజు ఏడో క్లాస్ లో ఉన్నాడు.

ఇంక ఆ పైన చదివించలేక దుర్గ కి పెళ్ళి చెయ్యాలని దగ్గరి బంధువుల్లో ఒక సంబంధం చూసి, ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు.

దుర్గకేమో ఇంకా చదువుకోవాలని ఉన్నది. తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పలేదు. ఏం చెయ్యాలో తెలియక, రాత్రి అందరూ పడుకున్నాక రెండు జతల బట్టలు ఓసంచిలో పెట్టుకుని ఇంట్లో నించి బయటపడింది.
ఏదో ఆవేశం లో ఇంట్లో నించి బయటికైతే వచ్చింది కానీ, తరువాతి అడుగు ఎటు వెయ్యాలో తెలియక... రైల్వే స్టేషన్ కి వెళ్ళి మూలగా ఓ బెంచ్ చూసుకుని కూర్చుంది.

రాత్రి పొద్దు పోయినందువల్ల సంచి తలకింద పెట్టుకుని నిద్రలోకి జారిపోయింది.. 2-3 గం.ల వేళ ఎవరో తనని తడుముతున్నట్లు అనిపించి నిద్ర మెలకువ వచ్చి, యిల్లువదిలి అక్కడ ఎందుకుందో. గుర్తుకు వచ్చి బిక్క మొహం వేసి భయంగా చుట్టూ చూసింది.

ఎవరో తన తండ్రి వయసు వాడు, మీది మీదికి వస్తూ వెకిలి చూపులు చూడటం మొదలు పెట్టాడు. బాగా తాగేసి ఉన్నాడు. దూరం జరుగుతున్న కొద్దీ తనమీద చేతులు వేస్తూ, పట్టు బిగిస్తున్నాడు.

వాడిని విదిలించుకుని పరుగు లంకించుకుంది. ఇంతలో రైల్వే పోలీసులు అటు రావటం చూసి వాడు పక్కకి తప్పుకున్నాడు.

అంతలో రైల్వే క్యాంటీన్ వాళ్ళు దుర్గని చూసి, ఇంట్లోంచి పారిపోయి వచ్చిందని ఊహించి తెల్లవారాకా వివరాలు అడగొచ్చులే అని ...లోపలికి పిల్చి భయపడకుండా పడుకోమన్నారు.

దుర్గ కి నిద్ర పట్టలేదు. ఇంట్లో తనని తల్లి, తండ్రి, తమ్ముడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, యిల్లువదిలి తానెంత తప్పుచేసిందో గుర్తు తెచ్చుకోసాగింది.

స్టేషన్లో తన మీద చెయ్యి వేసిన వాడు ఇంచు మించు తండ్రి వయసు వాడే. వాడికి మాత్రం తన ఈడు కూతురు ఉండదా? అన్నీ మర్చిపోయి వయసుతో సంబంధం లేకుండా మీద చెయ్యేస్తాడా? లోకం ఇంత దుర్మార్గంగా ఉంటుందా? అని పరి పరి విధాల ఆలోచిస్తూ నే తెల్లారే వరకు గడిపింది.

తెల్లారాక ,,క్యాంటీన్ మేనేజరు ...పళ్ళుతోముకోమని దుర్గకి చెప్పి..ఇడ్లీ ,కాఫీ ఇచ్చి దగ్గరకి పిల్చి అనునయంగా,"అమ్మా నీకు చిన్నప్పుడు బళ్లో.. తెలుగు పుస్తకంలో ఉన్నఈ పద్యంనేర్పుంటారు ..గుర్తులేదా...

"కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులె శత్రులౌట తధ్యము సుమతీ"

"నీ తండ్రి ఈడు మగ వాడే ఒకడు నిన్ను ఇంట్లో అయితే రక్షించే స్థానంలో ఉంటాడు. వాడే, ఇల్లు వదిలి వచ్చిన నీ బోటి వారిని భక్షించే ఆలోచన చేస్తాడు. స్థానం మారేటప్పటికి, బుద్ధులు మారతాయి "అని చెప్పి మనిషిని తోడు ఇచ్చి ఇంటికి పంపించాడు.

ప్రతి పద్యం మీద కధ ..ఇలా చెబితే మీకు నచ్చుతోందా..నాకు మీరు తెలపాలి కామెంటు బాక్సులో సరేనా...