ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కరుణా వర్ధిష్ణు--కె ఎస్ అనంతాచార్య
September 6, 2020 • T. VEDANTA SURY • Poem

తనకోసం కాదు
చిన్నారుల రాత మార్చి భవితను
తీర్చిదిద్ద డానికి 
నడుము కట్టిన నవ విధాత

మట్టి బెడ్డల కింది
విత్తనాన్ని వర్షం
వెలికి తీసినట్లు
నిబిడీకృతమైన జ్ఞానాన్ని వెలికి తీసే
జ్ఞాన భాస్కరుడు

తప్పొప్పుల పట్టికను
సవరించి అడుసు తొక్కిన అడుగును
ప్రక్షాళన గావించి
మార్గదర్శనం చేసే
కరుణా వర్ధిష్ణు

కాలానుగుణంగా 
తనను తాను
సరిదిద్దుకుంటూ ఆధునిక తను సంతరించుకుంటూ సర్వస్వం ఆర్పించే
భోళా శంకరుడు

విలువలన్నింటిని
మాలలుగా అల్లి
కంఠ సీమను అలంకరించే 
అలంకార శిరోమణి

హారుని చూపే గురువొక్కడుంటే
రామకృష్ణుని శిష్యులాగా వేల
వివేకానందులు 
ఉద్భవిస్తారు

నిత్య విద్యార్థి యై
నిందా స్తుతుల
నదిగమించి బోధన చేస్తే హృదయ కోవెలలో గూడు కట్టుకుంటాడు గురు గోవిందుడు

అభిముఖ బోధనలో
సాధించే విజయాలెన్నో
శోధించి బేధించే
రహస్యాలెన్నో

పల్లకిలో
ఊరేగింపబడ్డ సర్వేపల్లి
అధ్యాపక మరుమల్లి
అబ్దుల్  కలాం ఆదర్శమైతే ప్రపంచం మన ముందు మొకరిల్లుతుంది

పరిపూర్ణ వ్యక్తిత్వానికి
పాదులు వేసి గొప్పులు తవ్వి పెంచిన అక్షర 
హాలికుడు

ఆరు రుతువులలో
అందాల చంద్రుడై
వెలుగొందు 
అధ్యాపకుడే ఆరాదనీయుడు