ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కలి-- డాక్టర్. బి. వి. ఎన్ . స్వామి
October 1, 2020 • T. VEDANTA SURY • Story

నలుగురం కలిసి మాట్లాడుకుంటున్నాం. వేదాంతమా! మరొకటా!! అంతా చావు కబుర్లు. ఒకతను బతికుండగానే సమాధికట్టుకున్నాడట. పిల్లల బాధ భరించలేక పడుకున్న మంచానికి తనను తాను కట్టేసుకొని నిప పెట్టుకున్నాడొకడు. బతికున్న ముసల్దాన్ని ఖననం చేయడానికి ప్రయత్నించాడట మరొకడు. సాదలేనని తలచి కన్నబిడ్డను బావిలో పడేసిందట ఒకామె. ఒకరు సునాయాస మరణాన్ని, మరొకరు రోగగ్రస్థ చావును వివరిస్తున్నారు. ఆకాశంలో విహరించే గ్రద్ద నోటిలో గల పాము జారి వ్యక్తిమీద పడడం, దాని బారిన పడ్డ శాపగ్రస్తుడిని గురించి, ఉరి బారిన పడ్డ నేరస్థుడిని గురించి కూడా మా మధ్యలో ఆ రోజు చర్చ జరిగింది. ఇదంతా విన్న బుంగి నేటి వార్తా పత్రిక చదవమని పత్రికను ముందు పెట్టిండు.
‘‘బస్సు డ్రైవర్ అజాగ్రత్తా! కాపలా లేని లెవల్ క్రాసింగా! రైలు బండి పిల్లల పాలిట చావుబండి అయింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అన్నెం, పున్నెం ఎరుగని పసిపాపలు బలి అయ్యారు. ఒకవైపు పట్టాలపై దూసుకొస్తున్న రైలు, మరోవైపు అదే పట్టాలు దాటుతున్న బస్సును ఢీ కొట్టింది. తాకిడికి బస్సు ముద్దయి డ్రైవర్, క్లీనర్‌తో సహా 14 మంది చనిపోయారు.’’
‘‘చదువుతున్న వాణ్ణి ఆపి ఈ చావు కబుర్లను విన్నా, చదివినా భయం అయితుంది. ఏ పత్రిక చూసినా హత్య, ఆత్మహత్యలు, ప్రమాద చావులు, అత్యాచార హత్యలు, చోరీ హత్యలు, పరువు హత్యలు, పగహత్యలు ఇలా ఊహించడానికే వీలులేని కలికాలపు చావులు కనపడుతున్నయి. అందుకే ఉదయం లేవగానే నేను పత్రిక చూడడం మానేసిన.’’ మాలోని ఒక సుకుమారుడు ఆవేదనతో పలికిండు.
వానరాకడ మరి ప్రాణంబు పోకడ
కానబడదు ఘనునకైన గాని
కానబడిన మీద కలియిట్లు నడచునా
విశ్వదాభిరామ వినురవేమ
వేమన శతకం
వేమన