ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కవయిత్రి మొల్ల తేట తేట తెలుగు పదాలతో సరళంగా రామాయణ గాథను రచన చేయడం జరిగింది. ఈ రచనా కాలం లో ఈమె అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా పండితుల అవహేళనలు , తోటి వారి సూటి పోటి మాటలు. ఏది ఏమైనా ఇవేమీ ఆమె రచనకు ఇబ్బందులు కాలేక పోయాయి. ఈమె రామభక్తిలో, బమ్మెర పోతనను ఆదర్శంగా తీసుకొని ఆ బాటలో నడిచింది. పోతన చెప్పినట్లు పలికెడిది భాగవతమట/పలికించెడు వాడు రామభద్రుండట నే/పలికిన భవహరమగునట/ పలికెద వేరొండు గాధ పలుకగనేలా!/అనువాద సమయంలో ఆయన రాకతో భక్తితో రాసుకున్న పద్యమిది. అలాగే కవయిత్రి మొల్ల మాటలలో...చెప్పుమనె రామచంద్రుడు/ చెప్పించిన నా పలుకు మీద చెప్పెదనే నె/ల్లప్పుడు నిహ పర సాధన/మీ పుణ్య చరిత్ర తప్పు లెంచకుడు కవులతో// ఈమె కూడా రామచంద్రుడు రామాయణం వ్రాయమన్నట్లుగా చెప్పుకుంది. మొల్ల తన తప్పులు ఎంచ వద్దని సవినయంగా మనవి చేసుకోవడం విశేషం. ఇదే ఆమె విధేయతకు, పెద్దల పట్ల గౌరవానికి నిదర్శనం.'సామాన్యుని కొరకు సాహిత్యము' అనునదే మొల్ల ముఖ్య ఉద్దేశము:- ఆనాడు ఆంధ్ర కావ్యాలు ప్రౌఢ సంస్కృత పదాలతో వ్రాయబడి ఉండేవి. సామాన్యుని సాహిత్య జ్ఞానానికి అందేవి కాదు, ఇది తెలుగువారికి ఇబ్బందికరమైన విషయం. సామాన్యులు సైతం తన కవిత్వం చక్కగా అర్థం చేసుకోవాలని మొల్ల తలంపు. తేనె సోక నోరు తీయ నగురీతి/ తోడ అనర్థ మెల్ల తోచకుండా/గూడ శబ్దములను గూర్చిన కావ్యమ్ము/ మూగ చెవిటి వారి ముచ్చటగును// కఠిన శబ్దాల కలయికతో రాసిన కవిత్వం మూగ చెవిటి వారు ముచ్చట్లాడుకున్నట్లు ఉంటుందని ఆమె చెప్పింది. ఆ ఆశయం తోనే ఆమె తన కవిత్వాన్ని సరళంగా రాసింది. జనం అందరూ చదివే పద్ధతి తాను అనుసరించినట్లు చెప్పుకుంది. కందువ మాటలు సామెత/ అందంగా గూర్చి చెప్పినది తెలుగు నకున్ / బొందై రుచియై వీనుల/ విందై మరి కానుపించు విబుధుల మదికిన్ // భావం: కందువ మాటలంటే కవిత్వం మర్మాలు వివేకంతో ప్రీతి గలిగిన పదాలు.ఆ పదాలకు మాధుర్యాన్ని కూర్చే సామెతలు జోడించి నట్లైతే ఆమె కవిత్వం మనసుకు తాకునని ఆమె ఉద్దేశం మొల్ల శ్రీకంఠ మల్లేశ్వరుని వరం చేత కవిత్వం అబ్బింది ఇతర విషయాలు తనకు తెలియవని కావ్యారంభంలో తెలిపింది. కావ్యసంపద క్రియలు నిఘంటువులును/ గమము లేవియు నెరుగ విఖ్యాత గోప/ వరపు శ్రీకంఠమల్లేశు చేత/ నెరి కవిత్వంబు నేర్చుకొంటి//ఆమె విధేయతకు నిదర్శనమేమిటంటే తనకు కవిత్వం గురించి ఏమీ తెలియదని తెలియజేసింది. కాని ఇది అవాస్తవం. ఆమెకు కవిత్వం జనులకు ఎలా చెప్పాలో బాగా తెలుసు. కథా కథనం:- "రాశిలో చిన్నది వాసిలో చెప్పుకోదగినది" మొల్ల రామాయణం. ఈమె రాసిన రామాయణం మూలమైన వాల్మీకి రామాయణంలో గల కొన్ని ఘట్టాలు సమూలంగా మార్పు చేసింది. మొల్ల సంగ్రహంగా తాను రాసిన రామాయణంలో శ్రవణ కుమారుడు చరిత్ర, మందర వృత్తాంతం, అహల్యా శాప వృత్తాంతము, కబంధ వధ, సుగ్రీవ రావణ ద్వంద్వ యుద్ధము, ఆదిత్య హృదయము, త్రిజట వృత్తాంతం ఇత్యాది కొన్నిఘట్టాలను విడిచిపెట్టింది. ఇతర రామాయణాల్లో ఉన్నవి కొన్ని ఇతివృత్తాలను చేర్చి రమణీయంగా మలచి వ్రాసింది. ( ‌ఇంకావుంది) -ఇది 37 విభాగము.-బెహరా ఉమామహేశ్వరరావు** సెల్ నెంబర్:-9290061336*
June 23, 2020 • T. VEDANTA SURY • Serial