ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కాకి కర్రలిల్లు-పిచ్చుక పీడకలిల్లు-- డా.. కందేపి రాణీప్రసాద్.
October 28, 2020 • T. VEDANTA SURY • Story

కాకి కర్రల ఇల్లు కట్టుకున్నది.పిచ్చుక పీడకలిల్లు కట్టుకున్నది.రెండు వాటి వాటి ఇళ్లలో ఉండి సుఖంగా జీవించసాగాయి.ఒకసారి పెద్దగాలివాన వచ్చింది.ఆ గాలివానకు పిచ్చుక ఇల్లు పడిపోయింది.పిచ్చుక ఇల్లు పిడుకలతో కట్టుకున్నది కదా!అది నీళ్ళకు నాని పడిపోయింది.కాకి ఇల్లు కర్రలతో కట్టుకున్నది.కాబట్టి గట్టిగా ఉండి పడిపొలేదు.సరే పిచ్చుక ఏం చేయాలో తోచక కాకి ఇంటికి వెళ్లింది.కాకి బావా!కాకి బావా! మా ఇల్లు పడిపోయింది.గాలివానకు బయట వర్షం కుండపోతగా కురుస్తున్నది.నేను తడిసిపోతున్నాను.మీ ఇంట్లో కాస్త చొట్టివ్వవా!అని అడిగింది.
          కాకి 'సరే మిత్రమా! అలాగేలే మా ఇంటికి రా! ఇక్కడే పడుకుందువు గాని' అన్నది.పిచ్చుక కాకి ఇంట్లో పెచ్చగా పడుకున్నది.గాలివాన మూడు రోజుల  దాకా తగ్గలేదు.మూడు రోజులూ పిచ్చుక అక్కడే ఉన్నది.నాలుగో రోజు వాన వెలిసింది.పిచ్చుక ఇంటికి వెళతానంటూ బయల్దేరింది.కాకి సరే అనబోతూ అప్పుడే ఇల్లును చూసింది.పిచ్చుక పడుకున్న చోట నాలుగైదు చోట్ల రెట్ట వేసింది. కాకికి తీవ్రంగా కోపం వచ్చింది.
           'పిచ్చుకా నిన్ను పోనీలే అని ఇంట్లో పడుకొనిస్తే నువ్వు నా ఇంట్లోనే రెట్టవేసి ఇల్లంతా పాడు చేస్తవా! అని కాకి అరిచింది.
          పిచ్చుక 'అది కాదు మిత్రమా! గాలివాన ఈ మూడు రోజులు రాత్రిం బగళ్ళు తగ్గలేదు కదా! అందుకే బయటకు వెళ్ళలేక పోయాను ఆ సమయానికి.నన్ను క్షమించు నేను శుభ్రం చెస్తాను'అంటూ బ్రతిమాలాడ సాగింది.
          కాకి వినలేదు. 'నా అందమైన ఇల్లును నీ పెంటతో పాడు చేశావు.నీవు చేసిన ఈ తప్పుకు నీకు శిక్ష వేయాల్సిందే.నీవు ఎన్ని కుప్పలు పెంట పెట్టావో అన్ని వాతలు పెడతాను' అంటూ కాకి పొయ్యిలొంచీ కాలే పుల్ల తెచ్చి పిచ్చుక వంటి మీద వాతలు పెట్టింది.
            ఆ వాతలు భరించలేక 'అమ్మో, అయ్యో' అని ఏడుస్తూ పిచ్చుక బయటకొచ్చింది.దానికి ఏం చేయాలో తోచలేదు.గాలివానకేమో ఇల్లు పడిపోయింది.ఉందామంటే ఇల్లు లేదు.ఎలాగోలా ఎక్కడోచోట ఉందామంటే వంటి మీద వాతలు బాధపెడుతున్నాయి.ఇక నేను బ్రతికి ఏం లాభం అనుకొని పిచ్చుక నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంది.ఆలోచించి ఆలోచించి ఇక చనిపోవాలని నిశ్చయించుకొని నది ఒడ్డున ఉన్న ఇసుకలో ఒక గంటను ఒక చెత్తో తవ్వింది.అందులోంచి ఒక చేతి నిండా పట్టేంత చిన్న బంగారం ముద్ద దొరికింది.ఇట్లా కాదనుకొని ఇంకా పెద్ద గుంటను తవ్వింది.ఆ పెద్ద గుంటలో నుండి పెద్ద బంగారం ముద్ద వచ్చింది.
           ఇదేంటి నేను అసలే కాకి చేత అవమానం పాలై చనిపోవాలి అనుకుంటుంటే విధి ఇలా ఎదురు తిరుగుతుందేమిటి అనుకొని చివరగా ఇలా కాదు నేరుగా కాలువలో దూకుదాం అనుకొని కాలువ దగ్గరకు పొయింది.పిచ్చుక కాలువలో దూకింది.కాలువలో దూకగానే వంటి మీద వాతలు మాయమై కావిడంత బంగారం దొరికింది.
          అప్పుడు పిచ్చుక సంతోషంలో ఆ బంగారాన్నంతా తెచ్చుకొని బంగారంతో   ఇల్లు కట్టుకొని అందులో బంగారు తూగుటుయ్యాల కట్టుకొని ఊగసాగింది.ఇలా ఉండగా ఈ పిచ్చుకకు ఇంత వైభోగం ఎలా వచ్చిందా అని కాకి ఈర్ష్య పడసాగింది.
           కొన్నాళ్ళ తర్వాత ఇంకా పెద్ద గాలివాన వచ్చింది.ఈ గాలివానలో కాకి కర్రలిల్లు పడిపోయింది.కాకి పిచ్చుక ఇంటికి వచ్చి మిత్రమా!సహాయం చేయావా! కొంచెం రాత్రికి చొటివ్వు అని అడిగింది.
         సరే కాకి బావా! నీవు ఎన్ని రోజులైనా ఉండు అని అన్నది.కాకి పిచ్చుక ఇంటికి వెళ్ళింది.అక్కడ అన్నీ బంగారంతో చేసినవే.చివరకు పిచ్చుక ఊగే ఊయ్యల కూడా బంగారంతో చెసినదే.బంగారంతో కట్టిన ఇల్లు.బంగారు పళ్లెంలో భోజనం పెట్టి బంగారు గ్లాసులో తాగటానికీ మంచి నీల్లిచీంది కాకికి.కాకి అప్పుడు అడిగింది.నీకింత ఐశ్వర్యం ఎలా వచ్చింది అని.అప్పుడు పిచ్చుక ఉన్న విషయమంతా చెప్పింది.ఓహో ఇదా సంగతి అని అనుకున్నది.తెల్లారేసరికి కాకి కూడా పిచ్చుక ఇల్లంతా పెంట పెట్టింది.తెల్లవారాక కాకి అడిగింది.నువ్వు కూడా నాకు వాతలు పెట్టు.నేను కూడా నీలాగే బంగారం సంపాదించుకుంటాను అని.దానికి పిచ్చుక పోనీలే కాకి బావా! పెంట కూర్చుంటే కూర్చున్నావు.నేను నీకేమీ వాతలు పెట్టను అని అన్నది.లేదు లేదు నీవు నాకు వాతలు పెట్టనంటున్నావంటే నీకు నేను కూడా బంగారపుటిల్లు కట్టుకుంటానని కుళ్ళు అన్నది.
           ఆ మాటకు పిచ్చుక బాధపడి సరే కాకి బావా! నీ ఇష్ట ప్రకారమే నీకు వాతలు పెడతాను అని కాలుతున్న కట్టె తెచ్చి కాకికి వాతలు పెట్టింది.ఆ మంటను తట్టుకోలేక కాకి కుయ్యే మొర్రో అని ఏడ్చుకుంటూ నది ఒడ్డుకు వెళ్ళింది.దానికి నొప్పులు బాధపెడుతున్నా బంగారం వస్తుందనే ఆశగా ఉన్నది.
           నది ఒడ్డుకు వెళ్ళగానే పిచ్చుక ఏం చేసిందో గుర్తు తెచ్చుకొని ఆత్రంగా చిన్న గుంట తవ్వింది.ఆ చిన్న గుంటలో నుంచి తేలు వచ్చి కుట్టింది.అబ్బా అంటూ ఏడుస్తూ పెద్ద గుంటను తవ్వింది.
          అందులోంచి పాము బయటకు వచ్చి కాటేసింది.
          అమ్మా అని పెద్దగా అరుస్తూ ఒక ప్రక్క ఒళ్లంతా వాతలతో భగ భగ మండుతుంటే ఇంకో ప్రక్క తేలు,పాము కాట్లతో మంట మండుతుంది.సరే అని చివరిదైనా ప్రయత్నిద్దామనీ కాలువ దగ్గరకెళ్ళి అందులోకి దూకింది.కాకి చచ్చిపొయింది.
            కాకి అత్యాశకు పోయి చావు కొని తెచ్చుకుంది.కాకి వెళ్లిపొయిన తరువాత ఇంట్లోకి వెళ్ళి పిచ్చుక కాకి పెంటను శుభ్రం చేద్దామనుకున్నది.కానీ అక్కడ కాకి రెట్టల బదులు బంగారు ముద్దలు కనిపించాయి.పిచ్చుక మంచితనానికి మంచే జరిగింది.కాకి కుళ్ళుబోతు తనానికి తగిన శాస్తే జరిగింది.