ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కొండంత సాయం (పిల్లల కథ) రచన ;బి. వి. పట్నాయక్ 9441349275
October 30, 2020 • T. VEDANTA SURY • Story

  పిచ్చుకల దండు పొలం పరిసరాలలో తిష్టవేయడంతో రైతు దిగులు చెందాడు. పండే పంటలో కొంత భాగం అవి తినేస్తే దిగుబడి తగ్గుతుందనేది అతని దిగులకు కారణం. ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచనలో పడ్డాడు.
             ఇంతలో కొన్ని గుడ్లగూబలు వచ్చి రైతు ముందు వాలాయి.రైతు భయపడ్డాడు.
           ' రైతన్నా! మా గుంపును చూసి నీకేదో హాని తలపెట్టడానికి వచ్చామని ఊహించు కొని భయపడుతున్నట్టున్నావు. నీకు మేలు చేయడానికి వచ్చాం. నీ పంటను పాడు చేస్తున్న పిచ్చుకలతో పాటు ఎలుకల్ని ఆహారంగా భోంచేస్తాం. పొలం గట్టు లో ఉన్న చెట్టుపై నివాసానికి అనుమతి ఇయ్యు' అడిగింది అందులో ఒక గుడ్లగూబ.
             ఎలుకల్ని భోంచేడానికి పాములు ఉన్నాయి. పిచ్చుకల్ని తరిమికొట్టడానికి కూలీలను పెడతాను.మీ అవసరం ఇంకెక్కడ ఉంది. అదీ గాక మీ అరుపులు అరిష్టానికి మూలం అని అందరూ అంటుంటారు . ఇది తెలిసి మీ నివాసానికి అనుమతి ఇవ్వడం తెలివి తక్కువ తనం అవుతుంది తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు  రైతు.
          సాయపడదామని వస్తే నిందారోపణలు చేస్తున్నావు. మేమంటే గిట్టని కొందరు అపశకునం పేరుతో మాపై వేసిన మూఢనమ్మకపు ముద్రలు అవి. నీకు ఏదో ఒకవిధంగా సాయం  చేయాలని మా మనస్సులు ఉవ్విళ్ళూరుతున్నాయి.కూలీలను పెట్టుకుంటే డబ్బు ఖర్చు. అది నీకు అదనపు భారం కూడా! ఉచితసాయం చేసి పంటను కంటికి రెప్పలా కాపాడి నీ చేతిలో పెడతాం. గింజలను తింటూ నీకు నష్టం కలుగజేస్తున్న పిచ్చుకలను పారద్రోలే పనినైనా చేయనివ్వు  ఒప్పించే పనిలో పడింది గుడ్లగూబ.
          ఉచిత సాయం అనేసరికి రైతుకు  ఒకింత ఉపసమనం కలిగినట్టు అనిపించింది. సరే నా అలికిడి విన్నప్పుడు మాత్రం ఎటువంటి అరుపులు అరవడానికి వీల్లేదు షరతు పెట్టాడు రైతు.
             అందుకు అంగీకరించిన గుడ్లగూబలు పొలం గట్టు నున్న చెట్టుపైకి చేరాయి.
            గుడ్లగూబలు చెట్టులో నివాసం ఏర్పర్చుకున్న సంగతి పిచ్చుకలకు తెలియక పోవడంతో పిచ్చుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.
          మాటు కాపు కాసిన గుడ్లగూబలు పిచ్చుకలపై ఆకస్మిక దాడులు జరిపి దొరికినన్ని పిచ్చుకలను చంపి ఆకలి తీర్చుకుంటుండేవి.
            ప్రతి రోజు గుడ్లగూబల దాడులను తట్టకోలేని మిగిలిన పిచ్చుకల దండు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయింది.
         ఇది గమనించిన రైతు గుడ్లగూబలను పొగడ్తలతో ముంచెత్తాడు.
         ఇప్పుడు రైతుకు కొత్త సమస్య వచ్చిపడింది. పండిన పంట తెగుళ్ళతో నిండిపోయింది. కోతకు వచ్చిన పంట ఇంటికి చేరేసరికి దిగుబడి తగ్గి నష్టాన్ని మిగిల్చింది.
             తోటి రైతుతో ఈ విషయాన్ని చెప్పి గొల్లుమన్నాడు.
          ' అన్నా! గుడ్లగూబలది స్వార్థబుద్ధి.వాటి తిండికోసం ఎత్తు వేసి కపటప్రేమను నటించాయి.
ఎంచక్కా పిచ్చుకల్ని, ఎలుకల్ని కడుపు నిండా తిని వాటి ఆహార సమస్యను తీర్చుకున్నాయి నువ్వు ఖర్చు తగ్గుతుందన్న ప్రలోభానికి లొంగి వాటి మాటలను నమ్మావు. పిచ్చుకలు,గుడ్లగూబల బాధ పడలేక నీ పొలాన్ని విడిచి దూరంగా పోయాయి. పిచ్చుకలకు ,  రైతులకు మధ్య బలమైన సంబంధం ఉంది.నేనైతే పిచ్చుకపై ప్రాణాలు తీసినంత శిక్షలు వేయను.పిచ్చుకలు తినేవి కాసిన్ని గింజలైనా అవి వ్యవసాయానికి కీడుచేసిన పురుగుల్ని తిని పంటలకు తెగుళ్ళు రాకుండా కాపాడి రైతుకు కొండంత సాయం చేస్తుంది. వాటిని దూరం చేసుకున్న రైతుకు కష్టాలు దగ్గరవుతాయి 'నిజాన్ని చెప్పి ఓదార్చాడు తోటి రైతు.
      చెడు తలంపుతో వచ్చిన గుడ్లగూబకు ఆశ్రయమిచ్చి తప్పు చేశానని రైతు పశ్చాత్తాపపడ్డాడు.  పిసరంత తిని కొండంత సాయం చేసే   పిచ్చుకల విలువ తెలియడంతో గుడ్లగూబలను వెంట తరిమేందుకు పొలంవైపు కదిలాడు .