ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కొత్త తరం కథలు - 05--చిరుగుతున్న ఆకాశం--రక్షిత సుమ
September 3, 2020 • T. VEDANTA SURY • Story

అనగనగా ఒక అడవిలో, ఒక చిట్టి కుందేలు చెట్టు కింద కునుకు తీస్తోంది. అకస్మాత్తుగా దానికి ఏదో వింత శబ్ధం వినిపించింది.ఏదో చిరిగినట్టు..!ఏదోలే అనుకొని మళ్లీ నిద్రలోకి జారుకుంది.అంతలో మళ్లీ ఆ శబ్ధం వినిపించింది.ఎందుకో కాస్త అనుమానం వచ్చి చుట్టూ చూసింది. ఏమీ కనపడకపోవడంతో మళ్లీ చెట్టుకిందకొచ్చి కూర్చుంది.ఈసారి ఆ శబ్ధం కాస్త గట్టిగా ఇంకాఎక్కువ సేపు కొనసాగింది.చుట్టూ ఎవ్వరూ కనపడట్లేదు, కానీ శబ్ధం మాత్రం వస్తోంది.ఏంటబ్బా అని ఆలోచిస్తూ పైకి చూసింది.అంతే దానికి వెన్నులో వణుకు పుట్టింది. "ఆకాశం చిరిగుపోతోందీ..........." అనుకుంటూ పరుగందుకుంది.
"ఏంటి కుందేలు, ఏమైంది అలా పరిగెడుతున్నావు ?" భయంతో పరిగెత్తుతున్న కుందేలును చూసి పొదల్లో ఉన్న జింక అడిగింది.
"ఆకాశం చిరిగిపోతోంది, పదా నువ్వు కూడా పరిగెత్తు..."ఆయాసపడుతూ చెప్పింది కుందేలు.
"నీ మోహంలే, అప్పట్లో మీ తాత కూడా ఇట్లనే చేసిండు.ఆకాశం విరిగిపోతుంది విరిగిపోతుంది అని మమ్మల్ని అడవంతా పరిగెట్టిచ్చిండు.తీరా చూస్తే అది చెట్టు మీదనుంచి పడ్డ కొబ్బరి బొండం చప్పుడు..!! నువ్వు కూడా అలాంటిదే ఏదో విని ఆకాశం చిరిగిపోతుందనుకున్నవేమో" అని తాపీగా గడ్డి నములుతూ చెప్పింది జింక.
" నేను నిజంగానే విన్నా, కావాలంటే రా, నీక్కూడా వినిపిస్తా,"కోపంగా చెప్పింది కుందేలు.
"అంత కోపమెందుకులే కానీ, పద చూద్దాం" అంది జింక.
ఇద్దరూ కుందేలు పడుకున్న దగ్గరికి వెళ్ళారు.వాళ్ళకి మళ్లీ ఆ శబ్దం వినిపించింది.వెంటనే కుందేలు " చూసావా నేను చెప్తే నువ్వు నమ్మలేదు.. ఇప్పుడేమంటావ్..!" గాబరా గా చుట్టూ చూస్తున్న జింక ని అడిగింది." ఇంకేమంటా.....!పదా పరిగెత్తూ......"
కుందేలూ,జింకా పరుగందుకున్నాయ్.
కాస్త దూరం వెళ్ళగానే వాటికి నక్క ఎదురైంది.పరిగెడుతున్న కుందేలు జింకను చూసి ఏమైందని ఆరాతీసింది.అవి విషయం చెప్పగానే," ఈ కుందేళ్ళ సంగతి తెలిసి కూడా నువ్వు మళ్లీ ఎలా పిచ్చిదానివయ్యావు..? ఏ కొబ్బరి బొండమో, తాటి మట్టో పడి ఉంటుంది" అని ఎగతాళి చేసింది.
"లేదు లేదు నక్క బావ నేను నా చెవులతో విన్నాను"అని ఆయాసపడుతూ చెప్పింది జింక".
స్వయంగా వింటే తప్ప నమ్మను అని నక్క పట్టుపట్టేసరికి,చేసేదేం లేక మళ్లీ కుందేలు ఉండే place కి తీస్కెళ్ళాయి.
ఆ శబ్ధం విని ఆశ్యర్యపోతున్న నక్కతో "ఇప్పటికైనా నమ్ముతావా..ఇగ పదా,ఇప్పటికే ఆలస్యమైంది.ఇన్ని సార్లు వెనక్కీ ముందుకీ పరిగెడితే మధ్యలోనే ఆ చిరిగిన ఆకాశం మనమీద పడిపోతది.మళ్లీ వెనక్కి రావద్దు పదండి పరిగెడదాం"వణుకుతూ చెప్పింది కుందేలు. నక్క, జింక, కుందేలూ పరుగందుకున్నాయి.
"ఏమైంది మీకు, నేను ఇక్కడ ఉండగా మిమల్ని ఎవరు తరుముతున్నారు.. అంత భయంతో పరిగెడుతున్నారు."నవ్వుతూ అడిగింది పులి.
"ఆకాశం చిరిగిపోతోంది పులిగారు.మీరు కూడా పరిగెట్టండి.లేకపోతే మీ ప్రాణానికే ప్రమాదం" అత్యంత వినయంగా చెప్పింది నక్క.
"అవునా....! ఎవరు చెప్పారు!"ఇంకా గట్టిగా నవ్వుతూ అడిగింది పులి.
"కుందేలు ఇంటిదగ్గర విన్నాం"జింక చెప్పింది.
" వెర్రి మోహాల్లారా...ఆకాశం చిరిగిపోవడం ఏంటి.అయినా ఈ కుందేళ్ళ సంగతి తెలుసుకదా.. ఒకసారి ఆకాశం విరుగుతుందంటారు.ఇప్పుడు చిరిగుతుందంటున్నరు.మీరెందుకు అనవసరంగా వీళ్ళ మాటలు నమ్మి భయపడి చస్తున్నారు?" చిరాగ్గా అంది పులి.
" అయ్యయ్యో కాదండీ...! నేను స్వయంగా నా స్వకర్ణాలతో విన్నానండీ" ఇంకా వంగిపోతూ చెప్పింది నక్క."
"వేటితో విన్నావు... స్వక.... ఏంటవీ....??
"నా సొంత చెవులతో విన్నానని అంటున్నానండి"
"మరి అలా ఏడవచ్చుగా...!"నక్క అతి వినయానికి చిరాకు పుట్టి గుర్రుమంది పులి
"అయ్యో ఈ నక్క బావ సంగతి మనకి తెలిసిందే కదా! బతికుంటే ఆదే చాలు.పదండి పరిగెడదాం."తొందర పెట్టింది జింక.
"ఇవన్నీ చెప్తున్నయంటే,నిజమే కావొచ్చు ఏముందిలే పరిగెడితే పోలా...!"అనుకుని వాటితో పాటు పరుగందుకుంది పులి.
అలా భయంతో పరిగెడుతున్న పులి, నక్క,జింక ,కుందేలు గట్టిగా వినపడ్డ ఘర్జనకి ఆగాయి."ఎక్కడికి మీరంతా గుంపుగా పరిగెడుతున్నారు.?బయట కరోనా వస్తుందట, ఇలా గుంపులుగా తిరగొద్దని నేను ఆజ్ఞాపించినది మర్చిపోయారా..??" కోప్పడింది సింహ రాణి.
"అయ్యో అది కాదు రాణి,ఆకాశం చిరిగిపోతోంది.అది మన మీద పడకూడదని పరిగెడుతున్నాం"రొప్పుతూ చెప్పాయి జంతువులన్నీ.
"ఎక్కడ చిరిగింది ఆ కుందేలు బోరియలోనా?" అడిగింది సింహం.
"అవునండీ!నేను పడుకున్న దగ్గరే నాకు ఆకాశం చిరిగిన శబ్ధం వినిపించింది.మీకెలా తెలుసూ..?!" ఆశ్చర్యపోయింది కుందేలు.
"ఇలాంటి విషయాలన్నీ మీకే తెలుస్తాయి కదా..పదా నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నేనుకూడ ఆ చిరుగుతున్న ఆకాశాన్ని చూస్తా."
"అయ్యో వద్దండీ..అది మీ ప్రాణానికే ప్రమాదం."జంతువులన్నీ నచ్చ చెప్పాలని చూసాయి .
"ముందు మీరు నన్ను తీసుకెళ్లండి.ఆ తర్వాత పరిగెత్తడం గురించి ఆలోచిద్దాం"అని సింహం కాస్త గట్టిగానే అనేసరికి వాటికి కుందేలు ఇంటికి తీసుకెళ్ళక తప్పలేదు.అక్కడికి చేరుకోగానే మళ్లీ ఆ శబ్ధం వినిపించింది.
"విన్నరుగా ఆ శబ్ధం..ఆకాశం నిజంగానే చిరిగిపోతుంది రాణీ..పదండి పరిగెడదాం."జంతువులన్నీ కంగారుగా అన్నాయి.
ఆ శబ్ధం మళ్లీ వినిపించింది.జంతువులు కంగారు పడుతూ పరుగందుకోడానికి సిద్ధంగా ఉన్నాయి.
సింహం చెవులు రిక్కించి ఆ శబ్దాన్ని వినడం ప్రారంభించి, పక్కనే ఉన్న గుహ వైపు మెల్లగా నడిచింది.గుహలోకి తొంగి చూసొచ్చి,జంతువులని చూసి "అదిగోండి, మీ చిరుగుతున్నా ఆకాశం.లోపల ఉంది,వెళ్లి ఒక్కో ముక్క తెచ్చుకోండి" అంది సింహం.
పులి ,నక్క ,జింక, కుందేళ్ళు అనుమానంగా గుహలోపలికి అడుగులు వేశాయి.అక్కడ గుడ్డ ముక్కలు చింపుతూ, పెద్ద ఆకులు చీరుతూ మాస్కులు తయారు చేస్తున్న ఎలుగు బంటి కనిపించింది,అంతే! వాటికి విషయం అర్థమైంది.
కాస్త సిగ్గు పడుతూ కాస్త నవ్వుతూ , తలా ఒక మాస్క్ పెట్టుకొని గుహ బయటకి వచ్చిన కుందేలు, జింక, నక్క ,పులులతో "మీకేదైనా విషయం తెలిసినప్పుడు, లేదా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని సరిగ్గా నిర్ధారణ చేసుకోకుండా వేరే వాళ్ళతో పంచుకోకండి. అలా చేసి మీరు భయపడమే కాకుండా ఆ అపోహలు అడవంతా వ్యాపించడం వల్ల అందరిలో అనవసర భయాన్ని పెంచినవాళ్ళవుతారు.అస్సలే పరిస్థితి బాలేదు, అందులో మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి..? ఇకనుంచైన నిజానిజాలు తెలుసుకుని బాధ్యతగా ప్రవర్తించండి"అని సింహం మందలించింది.