ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కోతి మనసు: - యామిజాల జగదీశ్
August 28, 2020 • T. VEDANTA SURY • Story

ఓ చెట్టుపైనున్న కోతులన్నీ కలిసి వారానికోసారి ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాయి. కోతులన్నీ వెళ్ళి తమ నారకుడితో తమ నిర్ణయం చెప్పాయి. 
కోతుల నాయకుడు అందుకు సరేనన్నాడు. అయితే నాయకుడన్నాడు కదా "ఉపవాసం చేసిన తర్వాత తినడానికి కొవలసిన పళ్ళను సేకరించిపెట్టమని. ఎందుకంటే మనమనుకున్న ఉపవాసవ్రతం ముగిసేసరికి మనందరికీ బాగా ఆకలి వేయొచ్చు అన్నాడు.
నాయకుడి మాటలకు సరేనన్న మిగిలిన కోతులు తోటలోకి వెళ్ళి బోలెడన్ని అరటిపళ్ళు కోసుకొచ్చి నాయకుడి ముందుంచాయి
వెంటనే నాయకుడు "సరే. మన ఉపవాసవ్రతం ఆరంభించేద్దాం"అన్నాడు.
 అప్పుడు అక్కడున్న గుంపులోని ఓ అనుభవమున్న వృద్ధ కోతి "నాయకా! ఉపవాసవ్రతం మొదలుపెట్టే ముందర ఎవరెవరికి ఎన్నేసి పళ్ళో ఇప్పుడే విభజించి ఇచ్చేద్దాం. లేకుండే దీక్ష ముగిసిన తర్వాత గొడవలు రావచ్చు" అన్నాడు.
అదేదో బాగుందనుకున్న నాయకుడు అందరికీ పళ్ళు వంతులేసి ఇచ్చాడు.
ఆ వెంటనే ఓ కోతి లేచి నిల్చుని "పండ్ల పైతోలుని ఒలిచి పెడదాం. ఇప్పుడే ఆ పని చేస్తే దీక్ష తర్వాత ఒలుస్తూ టైముని వృధా చేయక్కర్లేదు" అని చెప్పింది.
ఇంతలో అక్కడున్న కోతులలో ఓ చిన్న కోతి లేచి "నాయకా!ఒక్కరోజేగా ఉపవాసముండేది. తోలు తీసి ఉంచితే ఆ పండ్లపై దుమ్మూ ధూళీ పడొచ్చు.  కనుక ఈ పండ్లు పాడైపోయే ప్రమాదముంది.  మనకు ఆహారాన్ని నోట్లో దాచి పెట్టుకునే వీలుంది కదా. కనుక ఎవరికి వారు తమతమ పండ్లను తమ తమ నోళ్ళల్లో దాచి పెట్టుకుందాం"అంది.
 ఇదేదో బాగుందని నాయకుడు చెప్పడంతోనే కోతులన్నీ తమ తమ వాటాల అరటిపండ్లను నోట్లో దాచుకున్నాయి.
కాస్సేపే అయింది.
నోట్లో ఉంచుకున్న పండ్లు తనంతటతానుగా  గొంతులోకి పోనారంభించాయి.
ఇలా కోతుల ఉపవాస దీక్ష ముగిసింది.
ఈ ప్రపంచంలో చాలా మంది ధ్యానం, దీక్షా ఇలానే ఉంటాయి.
ప్రపంచంలోని ఆశలను వదులుకోవాలని అనుకున్నా ప్రయత్నించినా అది జరిగే ప్రసక్తే లేదు.
ఎందుకంటే మనం ఆనుకున్న దానికి భిన్నమైన ఆలోచనలు మనలో మొదలవుతాయి. దాంతో అనుకున్న లక్ష్య దిశలో పయనించడం జరగదు. అందుకే అంటారు అంతా కోతి మనసని.