ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కోమట్ల కాశి --------------- నా సిన్న తనంల మా ఊరి సిన్న పోరగాండ్లు దయ్యానికి బయపడలేదు గని కోమట్ల 'కాశి'కి మాత్రం బగ్గ భయపడేటోల్లు దయ్యమెట్లుంటదొ తెల్వది గని కాశిని సూత్తెనే శానా బయమయ్యేది ఎవరన్న పోరగాండ్లు ఏడ్సినా , మంకు వెట్టినా, లొల్లి వెట్టినా,గీసులాడుకున్నా సెప్పిన మాట ఇనకున్నా కొట్టినా,తిట్టినా ఇననొల్లు "కాశికి పట్టిత్తా" అని అంటె సాలు! జెప్పన్నే ఏడ్పు బందువెట్టేటోల్లు సెప్పినట్టు సేసేటోల్లు. కలల గుడ కాశి యాదికత్తే బుగులయ్యేది అయితే..పాపం ! కాశికి మాటల్ రావ్ గని సెవులు మాత్రం ఇనవడుతై " హూ..! ఆ..." అని అనే టోడు సెప్పిన పని సేసెటోడు లొడాసు లాగు , పెద్ద అంగి ఏసుకొనేటోడు అచ్చం గా టీవిల అచ్చే 'బిత్తిరి సత్తి'కి అన్న లెక్కనే ఉండేటోడు మా కాశి ఏది వెడితే అది తినే టోడు ఎవరింట్లన్న నన్న లగ్గం అయితే అచ్చి తినేటోడు కులమతాలను పట్టించు కోకుండ అందరిని ఒక్క తీరుగనే సూసెటోడు ఎవరన్న ఏరే ఊర్నుంచి మా ఊరికి అత్తే సంబుర పడుకుంట ఆల్ల ఎనుకాల్నే అచ్చే టోడు కాశి ఇంట్ల సేయి గడిగితెనే తురితి అయ్యేటిది. ఎవరన్న కోపానికచ్చి తిట్టిన గని ఏమనేటోడు గాదు గని సిన్న పోర గాండ్లు రాళ్ళతోని కొడితే మాత్రం తను గుడ రాళ్ళ తోని కొట్టేటోడు కొన్నేండ్లకు కాశి అయ్యవ్వలు కాలం జేసినంక కాశీని పిసోడని, ఊల్లే ఉంటే ఇజ్జత్ వోతదని అన్నదమ్ములు ఎవ్వరు గుడ ఆల్ల ఇండ్లల్లకు గుడ తోలుక పోలేదు. ఊర్ల ఉన్న ఇల్లు అమ్మి కాశిని దీసుక పోయి పట్నం ఎర్రగడ్డ దావకాండ్ల ఇడిసి పెట్టి పోయిండ్రట . మా కాశి కత కంచికి పోలేదు గని ఎర్రగడ్డకు వోయింది గట్ల ఒడ్సి పోయింది మా కాశి కత. ఎందుకనో.. గా, మా కాశి యాది కత్తె మనుసు కలుక్కు మంటది గుండిగల దేవినట్టు అయితది. గిప్పటిగ్గుడ మా ఊర్లె కాశంటే తెల్వనోల్లు ఎవ్వర్లేరు. ఔ మల్ల! - బాలవర్ధిరాజు మల్లారం
July 25, 2020 • T. VEDANTA SURY • Memories