ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కోవిడ్ కు లోబడి !!--కె ఎస్ అనంతాచార్య
August 30, 2020 • T. VEDANTA SURY • Poem

భయం, భయం గా
లేగదూడల మూతి
బుట్టలా మాస్కులు
కట్టుకొని శానిటైజర్స్ తో ప్రోక్షించుకుంటూ
ఐదు నెలలు వనవాసాననంతరం
అమ్మ ఒడిలోకి అడుగిడినట్లు బడిలో
 కాలు పెట్టాను!

ఒంటరిగా ఐసోలేషన్ లో అనుమానితునిలా
దిగాలుగా చూస్తోంది

నీడలు,నిశ్శబ్దం నా
గుండె చప్పుడు 
 తప్ప చీమ చిటుక్కు
మనలేదు


లాక్ డౌన్ లో పెరిగిన
గడ్డం లా  పచ్చ గడ్డి!

పిల్లలు లేని
మైదానం జంతుజాలనికి
సొంత అడవి అయింది!

ఆత్మీయ కొలీగ్స్ మధ్య ఆరు మీటర్ల  కోవిద్ అగాధo! 
ఆకుపచ్చని చెట్లలో
దోమల సంగీత విభావరి!

ఆసనాలన్నీ క్రిమి కీటకాలకు 
 అవాసాలై కొలువు తీరి
వున్న ఒకానొక జలదరింపు!
బల్ల ముట్టుకుంటే బెదురు
 రిజిస్టర్ పట్టుకుంటే వణుకు
అనుమాన ధ్యానం లో
 అధ్యాపక గణం
పిల్లలు బాసిన
కోడిలా ఇప్పుడు
కోవిడ్ బడి
ఆన్లైన్లో పాఠాలు
ఈ - చదువులు
 అశ్వినీ దేవతలు
ఎప్పుడు కరుణిస్తారో!
ఈ బడికి స్వాస్థ్యము
ఎప్పటి కి కుదురు తుందో