ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
క్రమశిక్షణ విలువ (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
November 20, 2020 • T. VEDANTA SURY • Story

  కొత్తగా ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలోకి ప్రవేశించారు విద్యార్థులు. చుట్టుపక్కల 4 గ్రామాల పాఠశాలలలో 5వ తరగతి వరకే ఉన్నందున 5 గ్రామాల విద్యార్థులు ఈ ఉన్నత పాఠశాలలో ప్రవేశించారు. అది పూర్తిగా తెలుగు మాధ్యమ పాఠశాల. ఆ తరగతి ఉపాధ్యాయులు తిరుమలేశం గారు కూడా తెలుగు ఉపాధ్యాయులే. మొదటి రోజు విద్యార్థులు అందరినీ పరిచయం చేసుకుని వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి అభిరుచులు తెలుసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులూ తాను కథలు చెప్పి, విద్యార్థుల చేత చెప్పించారు. విద్యార్థులకు క్రమశిక్షణ ఆవశ్యకతను గురించి చెప్పి, త్వరలో ఈ తరగతికి నాయకులను నియమిస్తానని, వారు నిలకడగా చదువుతూ మంచి క్రమశిక్షణ పాటిస్తే 10వ తరగతి ముగిసే వరకు వారే తరగతి నాయకులుగా ఉంటారని చెప్పారు. చాలామంది విద్యార్థులు తమకే నాయకత్వం రావాలని ఉబలాట పడుతున్నారు. 5 సంవత్సరాలు తమదే ఇష్టారాజ్యం. ఎంచక్కా అల్లరి చేసిన వారి పేర్లు ఎక్కించవచ్చు. తమ పేర్లు ఎక్కే అవకాశం లేదు. శిక్షలు తప్పుతాయి. ఇవి ఆ చిన్నారి బుర్రలలో ఉన్న ఆలోచన.

ఆ తర్వాత రోజు తెలుగు మాస్టారు ఒక కథల పుస్తకాన్ని తెచ్చి, ఒక్కొక్క విద్యార్థిచే చదివించాడు. ఒక్కో విద్యార్థి సామర్థ్యం ఎలా ఉందో ఒక నోట్సులో రాసుకున్నాడు. ఆ తర్వాత ఉక్త లేఖనం, ఆ తర్వాత రోజు విద్యార్థులకు తెలిసిన కథలను రాయమన్నాడు. ఆ తర్వాత రోజు విద్యార్థులు వేసవి సెలవులను ఎలా గడిపారో సవివరంగా రాయమన్నారు. రాత సామర్థ్యాలను కూడా నోట్ చేసుకున్నారు. శ్రావణి, అలివేలు, పల్లవి, ప్రకాశం అన్నిటిలో చాలా చురుకుగా ఉన్నారు. ఆ తర్వాత రోజు ఒక సమకాలీన అంశం ఇచ్చి దానిపై ప్రసంగించనున్నారు. ఉత్సాహవంతులైన విద్యార్థులు ఒకరోజు సమయం ఇవ్వమన్నారు. శ్రావణి అనే అమ్మాయి లేచి ఆ అంశంపై అప్పటికప్పుడు ఏ మాత్రం బెదురు లేకుండా అనర్గళంగా మాట్లాడింది.
 
    ‌అప్పుడు తిరుమలేశం గారు ఇలా అన్నారు. "శ్రావణి చాలా తెలివైన అమ్మాయి అయినా వినయ విధేయతలు కలది. ఏ మాత్రం గర్వం లేదు. పైగా ధైర్య గుణం కలది. అందరితో స్నేహంగా ఉంటుంది. ఇవి నేను గమనించినవి. క్రమశిక్షణే మనకు మంచి భవిష్యత్తును చూపిస్తుంది. చదువు, క్రమశిక్షణ కలిగిన ఈ శ్రావణి మన తరగతి నాయకురాలు కావడానికి అర్హురాలు. శ్రావణి మీ తరగతి లీడర్" అని. విద్యార్థులు అంతా చప్పట్లు కొట్టారు.
 
       ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా శ్రావణి సడలని పట్టుదలతో చదివింది. పదో తరగతి పూర్తి అయ్యేవరకు ఫస్ట్ ర్యాంక్ తనదే. అటు క్రమశిక్షణ కూడా తప్పలేదు. తాను క్రమశిక్షణ పాటిస్తూ తోటి విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నించింది.దీనికి ఎంతో సంతోషపడిన తిరుమలేశం గారు శ్రావణి 10వ తరగతి పూర్తి అయి ఆ పాఠశాల నుంచి వెళ్ళేటప్పుడు శ్రావణి ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినా ఆమె ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ప్రకటించారు.