ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గాంధీకందాలు---:కవి:కిలపర్తి దాలినాయుడు
October 2, 2020 • T. VEDANTA SURY • Poem

కం.-1
అరకొరదుస్తులు గలవని
దొరపలుకగ గాంధితాత-దొరకిట్లనెమా
సిరులన్ని దోచుకొంటిరి
చిరిగిన గుడ్డలెమిగిలెను-జీవించుటకై!
కం.-2
గుజరాతొకకేంద్రముగా
విజయాలకునిలయమనగ-వెలసెను పుడమిన్!
గజగజవడకించి దొరల
భుజబలమణగించబూనె-పోరటములో!
కం.-3
కర్రను చేగొని దొరలను
వెర్రెక్కించిన ఘనుండు-వేకువ వేళన్
కిర్రుమన రాట్న సేనలు
పుర్రెలలోమంట బుట్టి-పొగిలిరి దొరలున్!
కం.-4
ఉప్పెనలాలేచి కడలి
యుప్పును దాకంగ వెడలె-నొప్పుగ గాంధీ
రెప్పలకదలిక దొరలకు
నిప్పుల పైయ్యుప్పుజల్లి-నెగడురగిల్చెన్!
కం.-5
సాబర్మతియాశ్రమమది
చేబూనెను భరతమాత-స్వేచ్ఛావిధికై
తాబూనె గాంధి తాత,జ
వాబుగ సత్యాగ్రహమను-వజ్రాయుధమున్!
కం-6
విడువుడు విదేశ వస్త్రాల్
విడువుడు దొరలంటగట్టు-వింతల సరకుల్
నడువుడు పన్నులు గట్టక
జడుపేవలదనుచుగాంధి-జాగృతపరచెన్!
కం-7
క్విట్టిండియవిప్లవమును
గట్టిగ చేబూని గాంధి-గమనము పెంచెన్
చట్టములకట్లు ద్రెంపుడు
జట్టుగ పోరాడరండి-చావో రేవో!
కం-8
శాంతియహింసల మంత్రము
సాంతము సత్యాగ్రహమును-చరఖా చేతన్
శ్రాంతియునులేక బాపూ
పంతముతో స్వేచ్ఛ కొరకు-పవరముచేసెన్!
కం-9
మువ్వన్నెలకేతనమును
రివ్వున గగనానయెగిరి-రెపరెపలాడన్
నవ్వుమొగంబున తాతయు
పువ్వులు రాలంగచూచి-పొందెను శాంతిన్!
కం-10
అల్లా ఈశ్వరుడొక్కరె
తల్లికి హరిజనుడుకూడ-తనయుడుగాదే
పల్లెలె వెన్నెముకలుగద
కల్లును సారానుమాని-గడపండనియెన్!