ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గానకోకిల ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి జయంతి నేడు: -మాడిశెట్టి గోపాల్
September 16, 2020 • T. VEDANTA SURY • News

ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి...పరిచయం అక్కర్లేని పేరు.  ప్రపంచ ప్రసిద్ధ గాయనీమణిగా, భారత గానకోకిలగా, భారతరత్నగా, సంగీత విధుషీమణిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ప్రపంచ దేశాలను తన గాత్ర మాధుర్యంలో మెప్పించిన సుస్వరాల గాన కోకిలగా చరిత్రకెక్కారు.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి.
ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలోని శ్రీమీనాక్షి అమ్మవారి ఆలయ మాడ వీధికి చెందిన వీణ విదూషిమణి షణ్ముఖవడివు, వకీలు మధురై సుబ్రమణ్య అయ్యర్‌ దంపతులకు 1916 సెప్టెంబర్‌ 16న జన్మించారు. తల్లి సంగీత విదూషిమణి కావడంతో అక్షరాలకన్నా ముందే సరిగమలను నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే ఆమె ఏకసంథాగ్రాహిగా సంగీతంలో రాణించడం మొదలుపెట్టారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన ఆమె 10వ ఏట ఆలపించిన పాటను గ్రామ్‌ ఫోన్‌ రికార్డు విడుదల చేయడం  సంచలనం సృష్టించింది. 17ఏళ్లకే మద్రాసు మ్యూజిక్‌ అకాడమీలో కచేరీ చేసి పండితుల చేత ప్రశంసలు అందుకున్నారు.
ఓంకారం ప్రజ్వలించే తంబుర శృతికి.. ఎమ్మెస్‌ తన గొంతు కలిపితే అదో మధురం. సుమధురం, ఆనంద తన్మయం, పరవశం, శ్రవణానందంతో ప్రతిఒక్కరూ భక్తి తన్మయం చెందాల్సిందే. అలాంటి సుమధుర కంఠం నుంచి సుస్వరాలు జాలువారితే ఇక సంగీత శ్రోతలకు వీనులవిందే. తమిళనాడుకు చెందిన ఆమె పరిపూర్ణ తెలుగులో సంకీర్తనలను గానం చేయడం మరో విశేషం. భక్తి, భావం, సాహిత్య సౌలభ్యం, సాహిత్య ఉచ్ఛారణ, రాగంలోని మాధుర్యాన్ని పలికించడంతో ఆమెకు ఆమే సాటి. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి సంగీతం ప్రపంచంలో మరెవరికీ అందని కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నారు. దేశ అత్యున్నత పురస్కారాలను అంది పుచ్చుకున్నారు. శ్రీవారికి సేవచేసి చరిత్ర పుటల్లో నిలిచారు. ఐక్యరాజ్య సమితిలో ఆలపించిన తొలి మహిళగా, తొలి భారతీయురాలుగా కీర్తి గడించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రశంస లందుకున్నారు. 
సుబ్బులక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజనపాడుతూ అందులోనే అమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు.
ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది.
శ్రీవేంకటేశ్వరస్వామి భక్తురాలిగా ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి శ్రీవారి వైభవ విశ్వవ్యాప్తికి ఎనలేని కృషి చేశారు.  ఆమె  శ్రీవారు, అన్నమయ్య సంకీర్తనల తొలి ప్రచారకురాలుగా నిలిచారు.   ఆ గొంతుక సుప్రభాతం వింటేనే సంగీత ప్రియులకు సంతృప్తి కలుగుతుంది. ఆమె ఆలపించిన బాలాజీ పంచరత్నాలు, అన్నమాచార్య కీర్తనలు, శ్లోకాలు, భజనలు, స్తోత్రాలు ప్రసిద్ధికెక్కాయి. ఆమె ఆలపించిన సంకీర్తనలు, సుప్రభాతం నేటికీ విరాజిల్లుతున్నాయి. 
తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, ఛేదించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని 'శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బులక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి. 
డాక్టరేట్‌లు అందించి గౌరవించాయి. భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఇచ్చి సత్కరించింది. వీటితో పాటు పాశ్చాత్య దేశాల నుంచి అనేక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి. పురస్కారాలు, కచేరీల ద్వారా లభించిన సుమారు రూ.3 కోట్లను ఆమె పలుధార్మిక సంస్థలకు అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని తన గానామృతంతో పరవశింపజేసిన ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి 88 ఏళ్ల వయసులో 2004 డిశంబరు 11న ఈలోకాన్ని విడిచివెళ్లారు.
ఆమెకు నివాళులు