ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గానారాధ్యుడు--కె ఎస్ అనంతాచార్య
September 28, 2020 • T. VEDANTA SURY • Poem

నా పాట పంచామృతమని ఆబాలగోపాలాన్నీ అచ్చెరువున ముంచి
ఆనందలోకాల్లో విహరింప జేసిన గానాడంబరుడు!

బ్రహ్మ మురారీ  సురార్చిత లింగ అష్టకాన్ని ఇష్టంగా ఆలపించిన గాన చతురత

గాత్రం వింటే చాలు
దాహార్తుల మీదకు
భగీరతీ వచ్చినట్లు
వేసవి తాపానికి
శీతల సమీరమై
పలకరించినట్లు
ప్రేయసీ ప్రియులు
ఇంద్ర ధనస్సు మీద
విహరించినట్లు
భయం లో రామ రక్షా స్త్రోత్రమై అల్లుకున్నట్లు 
వనాల కోసం  తానై తరలి వచ్చిన వసంతం

అమరత్వాలబ్దికి గానమే సోపానమని
తెల్పిన ఆధ్యాత్మిక వేత్త

సరస స్వర సుర ఝరీ గమన సామ వేద సారాన్ని గొంతులో నింపుకొని
అందించిన గంధర్వ గానo

ఉదయాన్నే మేల్కొలుపు
భూపాలం  వినిపించి
 బిలహరి తో
బప్పీ లహరిని ఒప్పించి
రసజ్ఞుల మెప్పించిన
రాగం తానం పల్లవి

పడమటి సంధ్యారాగమై తూర్పు పడమరలన్నింటిని
మెప్పించి
తురూఫ్ ముక్క 
తెలుగు వారి
ఇంట మొలచిన తులసి మొక్క 

పామరులను పరవశింప జైకొట్టిన గణేశుడు 
ఆకలి
కేకలకు  పాటల్లో
సాపాటును వడ్డించిన
స్వరబంధువు దయాసింధువు

వెన్నెల వర్షం వేదనాదాల ఘోష
కోయిల కలకూజితాలు 
జలపాతాల పరవశాలు కలిపి స్వరాభిషేకం చేసిన పండితారాద్యుడు పద్మభూషణుడు

పాడుతా తీయుగా పాటశాలలో చిన్నారి గాత్రాలకు  మార్గదర్శి
శుద్ధ సంగీతానికి తెలుగుదనం అద్దిన భాషా జిగీషువు
గత వైభవపు ఘన కీర్తిని స్మరించి స్ఫూర్తిని నింపిన ఐదు తరాల ప్రతినిధి స్వరనిధి

షోడషభాషా కళల తో
నలుబది వేల పాట
లందించిన స్వర పేటిక, గిన్నీసు పుస్తకాన పేరు దక్కించుకున్న ఆయన పాటే జీవన వాటిక

లాలి పాడి చిన్నారుల
నిద్రబుచ్చి 
కుర్రాల్లోయ్,కుర్రాళ్ళని
కిత కితలు పెట్టి అలసి తిని సొలసితిని అంతర్యామిని అన్న అన్నమయ్య

తనువులో అణువణువున సంగీత సొబగులు నింపుకున్న  
స్వరచక్రవర్తి శిఖరాయమాన మైనది మీ కీర్తి

ఒక మహాస్వరం 
నిష్క్రమించి 
అభిమానుల గుండెల్లో
అమరదీపమై వెలిగింది