ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గాయం మంట--- యామిజాల జగదీశ్
September 2, 2020 • T. VEDANTA SURY • News

ఓ పూదోటలో సీతాకోకచిలుకను చూస్తున్నాడతను...
నేనడిగాను...."ఏం చేస్తున్నావు?"
"హరివిల్లులో స్నానమాడి వచ్చింది చూడు సీతాకోకచిలుక" అన్నాడు.
 "నాకు గులాబీ పువ్వులలో ఎరుపు ఇష్టం" అన్నాను నేను.
"కానీ గులాబీకి తన ఎరుపు నచ్చదు. సూర్యుడి కాంతిలో సప్తవర్ణాలు ఉన్నాయి... అన్ని పువ్వులూ ఈ ఏడు రంగులనూ స్వీకరిస్తాయి....అయితే తనకు నచ్చని రంగును పువ్వు బయట ప్రదర్శిస్తుంది. అదేమీ తప్పు కాదు" చెప్పాడు అతను.
ఆకాశంలో మాయాజాలం జరిగే సాయంకాల సమయమది...
నేను పువ్వుల్ని చూపిస్తూ "చూడు...అస్తమిస్తుండటాన్ని మరచి నవ్వుతున్న పువ్వులు" అన్నాను.
 "నువ్వూ ఓ పువ్వే" అన్నాడతను.
"అంతా అయోమయంగా ఉంది" అన్నాను....నేను.
 "చైతన్యంతో ఉండు...ఆనందంగా ఉంటావు..." నవ్వుతూ చెప్పాడతను.
"మనిషిని ఇలా మట్టిలో కప్పిన తర్వాత ఒక చెట్టుగా అతను మొలకెత్తితే ఎంత బాగుంటుంది" అన్నాడు.
ఎంత మంచి ఆశో అతనిది.
చెట్టుకింద రెండు కళ్ళపైనా రెండు గులాబీలు పెట్టుకుని పడుకున్నాడు అతను. "ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నావు?" అని అడిగాను. "ఆలోచిస్తున్నాను...పరిశోధిస్తున్నాను...." అన్నాడు అతను.
ఒక మంచుబిందువు ఆకుపై చడీచప్పుడూ చెయ్యకుండా పడిన తర్వాత ఇలా అన్నాను....
"మెదడు....హృదయం...నాలిక....ఇవన్నీ ఒక్కక్కొటే ...వీటిలో మనిషి మెదడుని తప్ప మిగిలిన వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు" అని.
"ఊపిరితిత్తులు, కళ్ళు, చెవులు....చేతులూ....కాళ్ళూ ...ఇవన్నీ రెండేసి ఉన్నాయి మనిషికి.....వీటిలో ఊపిరితిత్తులు తప్ప మిగిలిన వాటిని మనిషి అంతగా వినియోగించడు....." అన్నాడు అతను.
"ఈరోజు నువ్వు ఎక్కువగానే మాట్లాడావు..." అన్నాను.
"నేను మౌనంగానే ఉన్నాను. నేను మాట్లాడాననుకుని నువ్వే నాతో ఎక్కువగా మాట్లాడావు...." అన్నాడతను.
ఆ మాటలకు విస్తుపోయాను.... నిజానికి హృదయంలో నిప్పూ మండుతోంది అన్నాను.......
 వెంటనే "మండేదల్లా నిప్పు కాదు...గాయం కూడా మండుతుంది....నీ హృదయంలోనూ నీకు తెలియని గాయం ఉంటుంది" అన్నాడతను.