ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గీతగోవిందం--నాకెంతో ఇష్టమైన కావ్యం. నేను మొదటిసారిగా ఈ పుస్తకం మా నాన్నగారి పుస్తకాల వరుసలో చూశాను. వావిళ్ళ వారు ప్రచురించిన పుస్తకమది. అది చదివి వాటిలోని తాత్పర్యాలను కొన్నింటిని ఓ నోట్ బుక్కులో కాపీ చేసాను. వాటిలో అక్కడక్కడా కొన్ని మార్పులు చేసి పక్కనపడేశాను.కొన్నేళ్ళ తర్వాత టి. సాయికృష్ణగారి ఇంగ్లీషు, తెలుగు వ్యాఖ్యానాలతో అందమైన ఓ భారీ పుస్తకం గురించి వేదాంతసూరిగారు చెప్పారు. అప్పటి నుంచి సాయికృష్ణగారిని కలవాలనుకుని అనుకున్నదే తడవుగా ఓరోజు ఫోన్ చేసి వెళ్ళి కలిశాను. పుస్తకం అందుకున్నాను. పుస్తకంలోని విషయాన్ని మరిపించి ఆయన వేసిన రెండు వందల యాభై బొమ్మలకు నేను పడిపోయాననడమే సముచితం. ఏమిటా బొమ్మలు....కాస్సేపు ఈ విషయం పక్కనపెట్టి ఈ కావ్య మూల రచయిత గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకోకతప్పదు. ఈ కృతి రచయిత జయదేవుడు గొప్ప సంస్కృత కవిపండితుడు. పన్నెండవ శతాబ్దానికి చెందిన జయదేవుడు రాసిన ఈ గీతగోవిందం రాధాకృష్ణుల ప్రణయకావ్యం.ఒడిషా రాష్ట్రంలో పుట్టిపెరిగిన జయదేవుడికి చిన్నతనం నుంచీ సంగీతమంటే ప్రాణం. సాహిత్యంలో మంచి ప్రావీణ్యమున్న జయదేవుడి భార్య పద్మావతి. వీరిద్దరూ అన్యోన్యానురాగాలతో దాంపత్య జీవితం గడుపుతారు.రాధాకృష్ణుల ప్రేమ తత్వాన్ని తెలిపే జయదేవుడి గీతగోవిందం పన్నెండు అధ్యాయాల కావ్యం. ఒక్కొక్క అధ్యాయం 24 ప్రబంధాలు కూడినది. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిదేసి ద్విపదలు ఉంటాయి. వీటిని అష్టపదులూ అంటారు. మొత్తంమీద ఇందులో 24 అష్టపదులు, 80 కి పైగా శ్లోకాలు ఉన్నాయి. అష్టపదులన్నీ నాయకా, నాయికలు పాడుకోవడానికి వీలుగా రాసినవే. ఈ గీతగోవిందాన్ని మొదటిసారిగా ఇంగ్లీషులో 1792లో సర్ విలియమ్ జోన్స్ అనువదించారు. ఆ తర్వాత ఇది అనేక భాషలలోకి తర్జుమా అయింది. అయితే డాక్టర్ టి. సాయికృష్ణగారు రాసిన ఇంగ్లీషు, తెలుగు వ్యాఖ్యానాలతోపాటు సంస్కృత మూలాన్ని పొందుపరచి 681 పేజీలలో వెలువడిన ఈ మహద్గ్రంథాన్ని గౌరు తిరుపతి రెడ్డిగారి సౌజన్యంతో ప్రజాహిత పబ్లిషర్స్ ప్రచురించింది. ఈ పుస్తకంలోని ప్రత్యేకత ఏమిటంటే బొమ్మలు. వర్ణమయమైన ఈ చిత్రాలన్నీ అమోఘం. అపూర్వం. పుస్తకం చేతిలోకి తీసుకోవడంతోనే కళ్ళు బొమ్మలపైకి మళ్ళుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి బొమ్మా అద్భుతం. ఈ బొమ్మలను మొదటిసారి 1995లో వేసిన సాయికృష్ణగారికి ప్రేరణ కలిగించినది దాశరథిగారి గాలిబ్ గీతాలకు బాపుగారు వేసిన బొమ్మలే. మొదట్లో బ్లాక్ అండ్ వైట్ లోనే వేసిన బొమ్మలను అనంతరం రెండుసార్లు సరిచేసారు. మూడోసారి ముచ్చటైన రంగలతో తీర్చిదిద్దిన ప్రతీ బొమ్మా ఇట్టే మనసుని దోచుకుంటుంది. దశావతారాలతో మొదలుపెట్టి ప్రతీ శ్లోకంలోనూ ఏదో ఒక పదాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా బొమ్మ గీయడం విశేషం. 2010లో పాఠక ప్రపంచంలోకి వచ్చిన ఈ పుస్తకంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే జయదేవుడు పేర్కొన్న రకరకాల పువ్వుల ఫోటోలను ప్రచురించి వాటి పేర్లివ్వడం. రాధాకృష్ణుల ప్రేమ, శృంగార చరిత్రను చాటే ఈ గీతగోవిందాన్ని కాళిదాసాదుల ఋతుసంహారం, మేఘదూతం వంటి కావ్యాలతో పోల్చవచ్చు. ఈ కావ్యంలోని నాయికా నాయకుల ప్రణయం, సంభోగ విప్రలంభ శృంగార పోషణ ఎంత రమణీయమైనదో చదివితే తెలుస్తుంది. రాథాకృష్ణుల ప్రణయలీలలకు అద్దం పట్టే ఈ కావ్యానికి వ్యాఖ్యానమూ బొమ్మలూ గీసిన సాయికృష్ణగారి జీవితం ధన్యమే.- యామిజాల జగదీశ్
August 17, 2020 • T. VEDANTA SURY • Book Review