ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గుడిగంటలు.--వసుధారాణి.--తిరుపతిలో ఘంటారావం వినకముందు నేను విన్న అత్యద్భుతమైన గంట మా నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్ లోని ఆంజనేయస్వామి గుడి గంట.గుళ్ళో గంట కొట్టాలన్న సరదా పిల్లలకి పెద్దలే కల్పిస్తారు.గుడి గంట తరువాత అంత శ్రావ్యమైన గంట పాపిడీ బండి వాడి గంట.టాపిక్ పక్కదారి పట్టేటట్టు ఉంది.గుడిగంట దగ్గరికి వద్దాం.మా రైలు రోడ్డు ఆంజనేయస్వామి గుళ్ళో చాలా విశేషాలే ఉన్నాయి.గుడిగంటే కాదు ఆ గుళ్ళోనే మేము మొదటగా చాలా విషయాలు తెలుసుకున్నాము.ఉషశ్రీ గారి ఉపన్యాసాలు వారం రోజులపాటు విన్నాము.రేడియోలో వినిపించే గొంతుతోనే ఉన్నారు అని ఆనంద పడిపోయాము.అలాగే MS రామారావు గారి సుందరాకాండ.ఆ కార్యక్రమం జరిగినన్ని రోజులు తిన్నవారికి తిన్నంత రవ్వకేసరి ప్రసాదం గుళ్ళో.ఆ గుడి పూజారిగారు ఓ స్కూల్ మాస్టారు ఎంత శ్రద్దగా గుడిలో పూజ ,మిగిలిన విషయాలు చూసుకునే వారంటే గుడి ఎప్పుడూ రద్దీగానే ఉండేది.గుళ్ళోనే వారి మకాం.పూజారి గారి సతీమణి ప్రసాదాలు మహా రుచికరంగా చేసేవారు.కేవలం ప్రసాదాలకోసమే పూజలు చేయించుకునే భక్తులు కూడా ఉండేవారు.గుడిలో చాలా వరకూ ఏదో ఒక సాంసృతిక కార్యక్రమం జరిపిస్తూ వుండేవారు.మేము ప్రసాదం భక్తులము,ఆంజనేయ భక్తులమూ కూడా కావటం వల్ల ఎక్కువగా వెళుతూ ఉండేవాళ్ళం.మా సావిత్రి అక్కయ్య ప్రతి నెలా ఏదో ఒక మంగళవారం ఖచ్చితంగా పూజ చేయించేది.ఆ గుడి వరండాలో ఎన్ని ఆటలు ఆడామో, గుడి గంటని ఎంత సేపయినా ఒకే స్థాయిలో శబ్దం వచ్చేలా వాయించటం నేర్చేసుకున్నాం హారతి సమయంలో.ఇప్పటిలా ఆటోమేటిక్ ఎలెట్రిక్ బీభత్స శబ్దాలు చేసే గంటలు ,డ్రమ్ములు అప్పుడు లేవు.ప్రసాదాలు,గుడి గంటలు చిన్నపిల్లలుగా మమ్మల్ని ఆకర్షించిన ప్రాథమిక అంశాలు అయినా, లలితకళలు,సంస్కృతి,సభ్యత, జీవన విధానము పరిచయం చేసిన గుడిగంటలు మరువరానివి.
August 9, 2020 • T. VEDANTA SURY • Memories