ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గుణము-- డాక్టర్. బి. వి. ఎన్ . స్వామి
October 3, 2020 • T. VEDANTA SURY • Story

సెలవు కదా అని బుంగి ఇంటికి పోయిన. ఇంటిముందు కుర్చీలు వేసుకొని కూర్చున్నం. కాఫీ తాగుతూ కబుర్లలో పడినం. ముందున్న ఇంటి నుండి కుక్కల అరుపులు వినవచ్చినయి. ఏమిటా అని లేచి చూసిన అక్కడ ఏం కనబడలేదు. ఆ ఇంటి స్థితి చూసి బుంగిని వివరం అడిగిన. చూస్తుండగానే ఆ ఇంట్లో నుండి పొగ లేచింది. ఆ ఇంటి ముందు ఇద్దరు ముగ్గురు వచ్చి చేరినారు. ఆ ఇంటి గురించి బుంగి చెప్పడం మొదలు పెట్టిండు.
అది నాలుగు గోడల మధ్యగల దండకారణ్యం. ఆ ఇంటి గేటు తీస్తే ఆకుల వాసన, కుక్కల అరుపులు ఒకేసారి తాకుతయి. చెత్తా చెదారం గుట్టలుగా పడి ఇల్లు పెంటను తలపిస్తది. అడ్డదిడ్డంగా పెరిగిన వృక్షాలు ఇంటిని చీకటి గుహను చేస్తున్నవి. చెట్టు కొమ్మలు పక్క ఇండ్ల పైకి పెరిగి ఆకులను వర్షిస్తయి. బుంగి ఆ ఇంటి వర్ణన చేస్తుండగానే నేను వెళ్ళి నలుగురితో కలిసి ఆ ఇంట్లోకి తొంగి చూసిన కట్టెల పొయ్యి పై అన్నం వండే దృశ్యం కనిపించి కొయ్యబారిపోయిన. అక్కడ గుమిగూడిన నలుగురు ఈ విధంగా అనుకున్నరు.
‘‘వీళ్ళింట్లో కుక్కర్ ఉంది’’
‘‘గ్యాస్ పొయ్యి ఉంది’’
‘‘ఏం గుణాలో’’
‘‘మొన్ననే ఇంటాయన చెట్టు కొమ్మ కొట్టిండు’’
‘‘కట్టెలు వేస్ట్ చెయ్యొద్దని పొయ్యి పెట్టిండు కావచ్చు’’
‘‘నిజమే ఇంతకు ముందు ఎన్నడూ చూళ్ళేదు’’
‘‘కొమ్మ ఎందుకు కొట్టిండట’’
‘‘వెలుతురు కోసమట’’
‘‘మన ఇండ్లమీద కొమ్మలు ఎందుకు కొట్టలేదట’’
‘‘చెట్లు చల్లదనాన్నిస్తయని అతడెపడు అంటడు’’
అందరి మాటలు విన్న నాకు నవ్వొచ్చింది. తన సొమ్ము సోమవారం ఒక్క పొద్దులుంటారు. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు. అనే పాట యాది కొచ్చింది.

వేము పాలు బోసి వెయ్యేండ్లు పెంచిన
చేదు విడిచి తీపి చెందనటుల
ఓగు గుణము విడిచి ఉచితజ్ఞుడగునెట్లు
విశ్వదాభిరామ వినురవేమ
వేమన శతకం
వేమన