ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడవారిచే వ్రాయబడిన -మతము--విమతము--( మతము -- అన్యమతము)నకు గల మరోపేరు " పెద్ద మసీదు." గురజాడవారు వ్రాసిన కథలలో అతిపెద్దకథ 'సంస్కర్త హృదయం'. మతము--విమతము (పెద్ద మసీదు) కథ అతి చిన్నది.చాలామంది విమర్శకులు దీనిని అసంపూర్తి కథ అంటారు. అలా అనడం వెర్రి కాదా అంటారు నార్ల. అసలు ఈ కథ ఏమిటో పరిశీలిద్దాం. ఇది ఆనాటి సామాజిక సమస్యలను తెలిపే కథ. మత విభేదాలను ప్రస్ఫుటింపజేసే కథ. ముస్లింల పాలనలో హిందూమత దేవాలయాలకు పట్టిన గతి తెలిపిన కథ. గురజాడ వ్రాసిన కథలలో స్ర్తీ పాత్ర లేని కథ. మతం వేరైనా స్నేహానికి విలువ నిచ్చే కథ. ఇందులో మూడు పాత్రలే ఉంటాయి. నారాయణ భట్టు, పుల్లంభట్లు, ముస్లమాన్ (సాయిబు ) పాత్రతో కథ నడుస్తుంది.క్రీ.శ1571లో గోల్కొండనవాబు కులీకుతుబ్ షా గజపతులను జయించి శ్రీకాకుళం సర్కారును లోబరచుకున్నాడు. కుతుబ్ షాహీల కాలంలో శ్రీకాకుళం పాలకుడుగాపనిచేసిన షేర్ మహమ్మద్ ఖాన్ అక్కడ మసీదును కట్టించాడు. నారాయణభట్టు, పుల్లంబొట్లు గురుశిష్యులని డాక్టర్.యు.ఏ. నరసింహమూర్తి గారు తను వ్రాసిన పుస్తకం "కన్యాశుల్కం--19వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు" లో పేర్కొంటారు. నారాయణభట్టు మతావలంబకుడు, పుల్లంబొట్లు హేతువాది. వీళ్ళిద్దరూ స్నేహితులుఅంటారు తెలకపల్లి రవిగారు తను వ్రాసిన పుస్తకం "యుగస్వరం"లో. నారాయణభట్టు, పుల్లంబొట్లు అనే ఇద్దరు మిత్రులు కాశీలోచదువుకొని చికాకొల్లుకు తిరిగి వస్తారని డాక్టర్. రాచపాళెంచంద్రశేఖర్ రెడ్డి తన ' దీపధారి గురజాడ ' అన్న పుస్తకంలోవ్రాస్తారు. ఎవరు ఎలా వ్రాసినా గురజాడ వ్రాసిన ఈకథలోఎవరు ఏమిటన్నది ఇదమిద్దంగా పేర్కొనబడలేదు. గురు శిష్యులిద్దరూ కాశీ వెళ్లి అక్కడ ఉండి ఒకనాటి సాయంత్రం కాశీ నుండి తమ స్వస్థలమయిన శ్రీకాకుళం సరిహద్దు లకు వస్తారు. నారాయణభట్టు ఆనందానికి అవధులు లేవు. తన ముఖం అత్యంత సంతోషంతో వికసించిపో యింది. పుల్లంభొట్లు నుద్దేశించి " మా ఊరొచ్చాంరా ! ఇటువంటి ఊరు ఈ భూప్రపంచంలో ఉండబోదు. కాళిదాసు అవంతి పట్టణాన్ని ఉద్దేశించి ఎంత గొప్పగా చెప్పాడో ఆ మాటలన్నీ శ్రీకాకుళం, శ్రీకాకుళేశ్వరుని క్షేత్ర మహత్యం తెలుసుకోడానికి కూడా వర్తిస్తాయి. శ్రీకాకుళం ఊరు, దాని ప్రాంతంలో గల నది పాడిపంటలు గురించి ఏమని చెప్పగలను ? " అని ఊరులోకి వచ్చిన నారాయణ భట్టు కోవెలను దర్శించాలని శిష్యునితో ఒక దగ్గర ఆగుతా డు. అలా ఆ ప్రదేశాన్ని చూసి నిశ్చేష్టుడైపోతాడు. అక్కడ ఉండవలసిన స్థలంలో కోవెల లేదు . శ్రీకాకుళేశ్వరుని ఆలయానికి బదులుగా ఒక పెద్ద మసీదు ఉంది. అది చూసిన నారాయణభట్టు నేల కూలబడిపోతాడు.( గోల్కొండ పాదుషాహి ఫర్మానుల సీలు ఇచ్చట విప్పడం చేత దీనికి సికాకోల్ లేక చికాకోల్ అని పేరు కలిగిందని చాలామంది చెప్పుకుంటారు. కానీ అది నిజంకాదు. ఈ పట్టణం అతి ప్రాచీనమైన పట్టణం. దీని పేరు శ్రీకాకుళం. ఒకప్పుడు ఈ శ్రీకాకుళంలో ' శ్రీకాకుళేశ్వరుని క్షేత్ర' ముండే దని, దానిని పడగొట్టి ' షేర్ మహమ్మద్ ' అనువాడు పెద్ద మసీదు దాని స్థానంలో కట్టించాడని'మతము విమతము' అనే కథ ప్రారంభించడానికి ముందుగానే గురజాడ చెబుతా డు. ఇప్పటికీ షేర్ మహమ్మద్ పురం అనేఊరు శ్రీకాకుళంకు దగ్గరలో ఉంది.) ఇదంతా చూసిన నారాయణభట్టు విషాద వదనుడై శిష్యునితో " ఈ పట్టణానికి మనకూ రుణం చెల్లిపోయింది. తిరిగి కాశీ పోదాం రా " అంటాడు. ఆ పట్టణంనారాయణభట్టు జన్మ స్థలం. అందుకే అంటారు పెద్దలు కన్నతల్లి జన్మభూమి ఒకటేనని. కన్నతల్లిపై ప్రేమ, జన్మభూమిపైప్రేమ ఒక్కలాంటిదేనని. చచ్చే వరకూ ఆ బంధం విడిపో నిదని. అందుకు పుల్లంభట్లు తను కాశీకి తిరిగి నడవలేనని, తనవి ఇనుప కాళ్లు కావనీ అంటాడు. పూర్వం రోజులలో చదువుకుగానీ, కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శిచుకునేందుకు గానీ అభిరుచి చూపే వారు. కాశీకి వెళ్ళాలంటే కొన్ని వందల మైళ్ళ దూరం కాలినడకన నడవాలి. అందుకే పెద్దలు అనేవారు" కాశీకి వెళ్లినవాడు కాటికివెళ్లినవాడూ ఒకటేనని! " ఆ రోజుల్లో దక్షిణ భారత దేశం నుండి ఉత్తర భారత దేశంలో గల కాశీకి వెళ్ళినవాడు అట్నుండి ఇటు తిరిగి వస్తాడో రాడో తెలియదు. మార్గమధ్యంలో ప్రాణాలు పోగొట్టుకున్నవారూ ఉండేవారు. అంత దూరం తిరిగి నడిచి కాశీకి వెళ్లడానికి పుల్లంభట్లు తన అనంగీకారాన్ని తెలియ జేస్తాడు. గురువు గోపురాన్నే చూడాలనుకుంటే తన ఊరు వస్తే అంతకుమించిన గోపురాన్ని చూపిస్తానంటాడు పుల్లంభట్లు. అందుకు సమాధానం గా " మీ ఊరి గోపురం ఎవరిక్కావాలిరా వెఱ్ఱివాడా ! మీ ఊరి గోపురాన్ని కూడా ఈ తుచ్ఛులు పడగొట్టి ఉంటారురా " అంటాడు నారాయణ భట్టు. " పడగొడితే ఆ పాపం వాళ్లనే చుట్టుకుంటుందిలెండి. పదండి. ఆకలేస్తుంది. ఆలస్యం చేస్తే ఉపవాసముండవలసి వస్తుంది " అంటాడు పుల్లంబొట్లు. నారాయణభట్టు తెగ బాధ పడిపోయాడు . తన మనసంతా ఆ మహా గోపురం పైనే ఉంది. ఆ మహాక్షేత్రం పోయిన తరువాత తిండిలేకపోతేవచ్చిన లోటేమిటని అంటాడు. ఇద్దరూ కష్టపడి అల్లంతదూరాన ఉన్న మసీదును చేరుకుంటారు. మసీదు నిర్మాణం,దాని తీరు తెన్నులు చూసిన పుల్లంభట్లు ఏమి తీరుగా కట్టారని మెచ్చుకుంటారు. అందుకు నారాయణభట్టు మెచ్చుకొనక వాడి శ్రాద్ధం కట్టాడు అంటూ అక్కడ గంజాయిపొగను పీల్చుకుంటూ కూర్చొన్న ఒక తురక దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న శివాలయం గురించి వాకబు చేసాడు. అందుకుతురక " హా సైతాన్కా ఘర్ " అని గంజాయి పొగని నోటి నుండి బయటకు విడిచిపెడుతూ సమాధానమిచ్చాడు. నారాయణభట్టు దేవుళ్ళకు ఎన్ని పాట్లు వచ్చాయని అంటుండగా మన తిండి సంగతి చూడండి అంటాడు పుల్లంబొట్లు. అలా బొట్లు అన్నాడోలేదో " ఈ కుర్రవాళ్ళకి ఆకలిఎక్కువ. ఇంతకీ ఈ ఊర్లో ఇక్కడే మా పెదమావ రామావ ధాన్లు, చినమావ లక్ష్మణభట్టు ఉండాలి. ఉన్నారాలేదా " అనినారాయణభట్టు అడుగుతాడు సాయిబుని. ముసల్మాన్ స్వచ్ఛమైన తెలుగులో " లేదు" అని సమాధానం చెబుతూ నారాయణభట్టును పోల్చి " నారాయణ" అని స్నేహపూర్వకముగా పలకరిస్తాడు. అందుకు బదులుగా " అయ్యో ! నువ్వా మావా ! " అంటాడు నారాయణభట్టు. మతం వేరైనా మనసు ఒక్కటైతే అందరూ సుఖవంతమైన, సంతోషకర మైన జీవనాన్ని గడపి విశ్వశాంతికి కృషి చేయవచ్చు. ( సశేషం )శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 15, 2020 • T. VEDANTA SURY • Memories