ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడవారు వ్రాసిన కథలలో అతి పెద్ద కథ--' సంస్కర్త హృదయం'. ఈ కథ ఒక సామాజిక సంస్కర్తకథ.ఇది 7 అంకములను కలిగి ఉంటుంది.ఇది గురజాడవారూ వ్రాసిన " Stooping to raise" అన్న ఇంగ్లీషుకథను అవసరాల సూర్యారావుగారిచే తెలుగులోకి అనువదించ బడింది. 1904లో ఈ కథ వ్రాయబడి ' భారతి' అనే పత్రికలో ప్రచురింపబడింది. ఇంతవరకూ మనం చదివిన 'దిద్దుబాటు' 'మెటిల్డా కథా గమనం, తీరువేరు. ' సంస్కర్త హృదయం' కథను చివరి వరకూ గురజాడ నడిపించే తీరువేరు. దేశంలో ఎక్కడ చూసినా వేశ్యావృత్తితో సమాజం నిండుకుపోయింది పడుపు వృత్తి నిర్మూలింపబడాలని ఒక ఉద్రేక భావం సమాజాన్నంతటినీ ఆవరించింది. చెన్న రాష్ట్రమంతా ఇదే ఉద్యమం. " నాచ్ " (భోగం వృత్తి ) సమస్యను ' కాలేజ్ యంగ్ మెన్స్ యూనియన్' వారు ఈసమస్యపై చాలా కాలం చర్చిస్తూ వాదోపవాదాలు చేసుకునేవారు. యువకులు ఈ నాచ్ ' సమస్యపై చర్చలు వింటూ చెవికోసుకొనేవారు. యువకులు భోగవృత్తికి అను కూలంగా ఉండేవారు.కొందరుపెద్దలలో మాత్రం ఆ ఉద్యమంపై ఐక్యత కుదురలేదు.హిందూ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంతో విద్యా సంపన్నుడు, మర్యాద మప్పిదం కలిగినవాడు, సరళ స్వభావం, హోదా, దర్జా అన్నీ ఉన్నవాడు. ఇంతటివాడు యాంటీ నాచ్ ఉద్యమానికి దూరంగా ఉన్నాడు మనకెందుకులే ఈ ఉద్యమాలు అనుకుంటూ. మన సమాజంలో ఇటువంటిగోడమీద పిల్లివాటం పెద్ద మనుషులు తరతరాలుగా, యుగయుగాలుగా ఉంటున్నారు. అంచేత సంఘసంస్కర్తలు ఈ ప్రిన్సిపాల్ ను తమ వర్గీయుడుగా లెక్కించలేదు. ఇక ప్లీడర్లలో కొందరు ఈ ఉద్యమం గొప్పదే. ఈ ఉద్యమఆశయాలు ఎంత గొప్పవైనా ఈ ఉద్యమానికి మద్దతు ఈయలే మనీ, ఎందుకంటే వారికొచ్చే క్లైంట్లలో అధిక భాగం ఈ వేశ్యలేననీ, అలాంటప్పుడు సంస్కరణలకు మద్దతుగా ఎలా నిలుస్తామన్నారు. బార్ లీడర్ అయితే పగలంతా యాంటీ నాచ్ ననీ, రాత్రిళ్ళు ప్రోనాచ్ గా ఉంటానని తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.ఆ ప్లీడర్ తెలివి తేటల్ని అందరూ అభినందించారు. ఇక కాలేజీలో రంగనాథయ్యర్ గారు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇతను మంచి సంస్కారి. సంఘసంస్కరణోద్యమానికి చేయూతనివ్వగలిగినవాడు. అన్యాయం, అవినీతి సమాజంలో ఏ రూపంలో నున్నా సరే ఏరిపారేయాలనే మనస్థత్వం కలిగినవాడు. ఊర్లో ఉన్న కొంతమంది విద్యాధికులు, ప్లీడర్లు ప్రోనాచ్ వాదులని రంగనాథయ్యర్ విన్నాడు.వాళ్ళ నైతిక పతనావస్థకు ప్రొఫెసర్ సిగ్గుపడ్డాడు.నీతి నియమాలులేని ప్లీడర్ల వృత్తిపై విమర్శల వర్షం కురిపించాడు. తరగతి గదిలో సమయం సందర్భం చూసుకొని వేశ్యలపై మోజుపడుతున్న వ్యక్తులపై విమర్శల వర్షంకురిపించేవాడు. ఈ విషయం జిల్లా మున్సబ్ గారి చెవిలోపడింది. ప్రొఫెసర్ మీద చిర్రెత్తుకు పోయాడు. ఎందుకంటేమున్సబ్ గారూ గృహ సంబంధమైన కొన్ని కారణాల వలనకాలక్షేపం కోసం నాజూకైన భోగం పిల్లను తన భార్య చెంత ఉంచుకున్నారు. ఆ ప్రొఫెసర్ ఇటువంటి వాళ్ళనందరినీ దేశద్రోహులని ఒక పత్రికలో వ్యాసం వ్రాసాడు. ఈ వ్యాసం పెద్దలలో సంచలనం కలిగించింది. ఊర్లో చిచ్చు రగిలింది. మున్సిపల్ కౌన్సిల్ లోనూ, దేవస్థానం బోర్డులలోను వాదోపవాదాలు పెరిగి, రెండు వర్గాలుగా చీలి కొట్టుకొనే పరిస్థితికొచ్చారు. సంస్కరణవాదుల పేరు చెబుతే సానిపిల్లలకు గుండె దడ పట్టుకుంది . సంస్కర్తల గురించి ఎకసెక్కాలాడుకునేవారు. యాంటీనాచీలను సరసం తెలియని మోటుమనుషులనీ, శృంగార రసాస్వాదన చేయలేని పరమ బభ్రాజమానులనీ విరివిగా ప్రచారం చేసారు. రంగనాథయ్యర్ ఈ విమర్శలను లెక్కచేయలేదు. తరగతి గదిలో వీలు కల్పించుకుని పడుపు వృత్తిని తూర్పారబెట్టేసేవాడు. నైతిక పతనావస్థ నుండి దేశాన్నివిద్యార్థులే రక్షించాలని ప్రభోదించేవాడు. ఇప్పటి వరకూ మనం చెప్పుకున్న విషయాలన్నీ గురజాడ మనకు కథా రూపంలో చెప్పినా రాజారామ్ మోహన్ రాయి, కందుకూరివీరేశలింగం, గురజాడ లాంటి వారి కాలంనాటి దేశ చ‌రిత్ర మనం చదివిట్టైతే గురజాడ వ్రాసినవి కథలు కాదు. నిత్యజీవితంలో జరిగిన సంఘటనలేనని మనం తెలుసుకోవాలి.ప్రఖ్యాత రచయిత కె.వి.రమణారెడ్డిగారు " గురజాడ రచనలన్నీ జీవితాన్ని, జీవిత వాస్తవాన్ని ఆశ్రయించుకునే సామాజిక చిత్రణలు " అంటారు. ఇంకా మిగిలిన కథ రేపు.(సశేషం ) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 8, 2020 • T. VEDANTA SURY • Memories