ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడవారు వ్రాసిన బాలగేయాలు ఎక్కువ లేకపోయినా, ఉన్న ఆ కొద్దిపాటిగురించి ఒకసారి చెప్పుకుందాం. బూరుగు చెట్టు చిలకలతో సంభాషణ వివరిస్తాడిలా--" బూరుగు చెట్టు/చిలకలతోను/ఏమని పలికింది?/పండిన పండు/ఎండిన దూదై/పకపక నవ్వింది" బూరుగు చెట్టు తన కాయ పండిన పండుగా మారి విచ్చుకొని ఎండిన దూదిగమారి పకపక నవ్వింది " అని బూరుగు చెట్టు చిలుకలతో అంటుందంటాడు గురజాడ. ఇక్కడ కవి యొక్క భావాన్ని బాలలు అంత సులభంగా అర్థం చేసుకోలేరు.ఈ సందర్భం గా కొందరు ప్రముఖ రచయితల రచనలను మనం చెప్పుకోవలసి ఉంది. ముందుగా రాయప్రోలు వారి బాలగేయం చూద్దాం . "ఏ దేశమేగి నా, ఎందుకాలిడినా/పొగడరా నీతల్లి భూమి భారతిని/నిలపరా నీజాతి నిండు గౌరవము" అంటా రు. ఇక శంకరంబాడి సుందరాచారిగారి ప్రార్థనా గీతం చూద్దాం " మా తెలుగు తల్లికి మల్లె పూదండ/ మా కన్న తల్లికి మంగళారతులు/కడుపులో బంగారు కనుచూపులో కరుణ/చిరునవ్వులో సిరులు దొరలించు" అంటారు. ఇక కందుకూరివారి రచనను పరికించండి. " తాత ముత్తాత లెంత ధనము కూడ బెట్టి, పెట్టెల నిండుగ బెట్టి యున్న గష్టపడి, తాను న్యాయ మార్గమున బడయు స్వార్జితంబొక గవ్వతో సమముగాదు./ పరుల నీకు నెట్లు వాంఛింతువో చేయ/బరుల కట్లు చేయవలయు నీవు." అంటాడు. ఇక న్యాయపతి రాఘవరావు గీతం చూడండి." పిల్లలకే స్వరాజ్యం వస్తే/పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే/ చిట్టి తండ్రిని రాజును చేస్తాం/చిట్టి తల్లిని రాణిని చేస్తాం/మాతాత ఒక బొమ్మయితేను/మా అవ్వ ఒక బొమ్మయితేనుబొమ్మల పెళ్లికి రమ్మనమంటాం/కమ్మని విందులు 'గుమ్ముగ' తింటాం!" అంటాడు. బాలగేయం ఎప్పుడూ పిల్లలకు అరటి పండు ఒలిచి ఇచ్చినట్లుండాలి.సులభ శైలిలో పిల్లలకు అర్థమయ్యే టట్లుండాలి. అయితే గురజాడ బాలగేయాలలోఎక్కడో ఒక దగ్గర ఆ పదాల అంతరార్థం కోసం వెతుక్కో వలసి వస్తుంది. ఈ వ్యాసానికి ఆరంభంలోనే ఒక బాలగేయాన్ని మచ్చుకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గురజాడవారి మరికొన్ని బాలగేయాలను చూద్దాం. చిలకల్లారా/చిలకల్లారా కలవలతోనూ/ఏమని పలికారు?/"కలవల్లార?కలవల్లారా!/ రాజు వచ్చెను/కన్నులు విప్పండి!/ఇక్కడ రాజు వచ్చెను అంటే కలువల రాజు చంద్రుడు అనీ, అతను వచ్చాడని బాలలకు అర్థం తెలియాలి. ఏడు సంవత్స రాలలోపు బాలబాలికలకు కలువలకు రాజు చంద్రుడని ఎంతమందికి తెలుస్తోంది. అలాగే " కన్నులు విప్పండి" అంటే ఎంతమంది బాలలకు చంద్రుని చూసి కలువలకు గల తమ (కన్నులు) రేకులను విప్పమంటున్నాడని తెలుస్తోంది ? కచలవల్లార!/కలవల్లార/రాజు గ్రుంకెను/కన్నులు మూయండి! అంటే చంద్రుడు గ్రుంకిపోయాడు (చీకట్లోకి వెళ్లి పోయాడు) మీ కలవల రెక్కలు మూసుకొండని ఎంతమందికి అర్థమవు తుంది ? తరువాత " గురజాడవారి పిల్లల పాట" అనే శీర్షికతో నున్న బాలగేయాన్ని మనం ఎక్కడా ఎంచడానికి వీలులేదు. మొదటి నుండి ఆఖరి వరకూ బాలలకు అర్థమయ్యే సులభ శైలిలో ఉంది. ఈ గేయం " చింతా చెట్టు చిలకల తోటీ/ఏమని పలికిందీ ?''................మామిడి చెట్టూ చిలకలతోటీ ఏమని పలికిందీ?/ "చిలకల్లారా చిలకల్లారా రండీ రండండీ" అని ముగిస్తాడు. ఈ గేయంలో పదహారు లైన్ లు ఉంటాయి. ఈ గేయంను గురజాడ అత్యంత సులభమైన పదాలతో మూడు, నాలుగు సంవత్సరాల బాలబాలికలకు కూడా అర్థమయ్యే రీతిలో వ్రాసాడు. భమిడిపాటి సోమయాజి గారు " విశ్వవీణ" 1959 డిసెంబర్ 1 వ తేదీ సంచిక నుండి ఈపాటను సేకరించి ఇచ్చారనీ, ఇలాంటి పాటలు అనేకం వ్రాయడానికి గురజాడ పూనుకున్నారని చెప్పబడుతున్నది. కానీ ఇంకెక్కడా నాకు తెలిసినంత వరకూ గురజాడ ఇంతకన్నా మించిన బాలగేయాలు వ్రాసినట్టు ఎక్కడా కనిపించలేదు. కథలు, కవితలు, వ్యాసాలు వ్రాయడానికి ఇచ్చిన ప్రాధాన్యత బాలగేయాలకు ఇవ్వడంలేదనిపిస్తుంది. (సశేషం) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
August 4, 2020 • T. VEDANTA SURY • Memories