ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ రచనలలో ప్రేమకు స్థానం అధికంగా ఉంటుంది. మనిషి పై మనిషికి ప్రేమ, సమాజంపై ప్రేమ, దేశంపై ప్రేమ,కులమతాలకు తావులేని సమాజంపై ప్రేమ ఇవన్నీ గురజాడ రచనలలో కనిపిస్తాయి.1905లో తండ్రిమరణాంతరం ఆధునిక వాడుక భాషను సాహిత్య భాషగాప్రజల ముందుకు తీసుకురావాలని గురజాడ వ్వవహారిక భాషావాదం కోసం విరామమెరుగని కృషి చేసాడు. ఆ సంద‌ర్భంలో అంటే 1906లో తూర్పు జిల్లాల విద్యాధికారిజె.ఎ.ఏట్స్ తోనూ, పి.టి.శ్రీనివాస అయ్యంగార్ తోనూ, గిడుగు. రామమూర్తిపంతులు గారితోనూ కలిసి చర్చలుజరిపి వాడుక భాషకోసం ఎనలేని కృషి చేసారు. ఆధునికభాషాభివృద్ధికి మహా ఉద్యమాన్ని ప్రారంభించాడు.1906లో" కొండు భట్టీయం'' 1907లో " నీలగిరి పాటలు" 1918లో ఆంగ్ల వ్యంగ్య పద్య రచనలు చేసారు. 1909 సంవత్సరంలో రెండో కూర్పు ప్రచురణ చేసారు. 1910లో ఆకాశంలో తోకచుక్కను చూసి " తూర్పు బలబల తెల్లవారెను,/ తోకచుక్కయు వేగుచుక్కయు/ఒడయుడౌ వేవెల్గు కొలువుకు/వెడలి మెరిసిరి మిన్ను వీధిని'' అంటూ అరిష్టాన్ని కలిగించే తోక చుక్కపైనా, వేకువజామున వెలుగునిచ్చే వేగుచుక్క పైనా తన అభిప్రాయాన్ని తెలియ జేస్తూ రెండూవెలుగులిస్తున్నాయని చెబుతాడు.1910లో గురజాడ బరంపురం వెళ్లి సకల కులాల వారితో సహపంక్తి భోజనం చేసి వచ్చాడు. అదే సంవత్సరం ముత్యాలసరములు కూడాగురజాడచే వ్రాయబడ్డాయి. ' ముత్యాలసరములు' లో కొన్నికవితలను పరిశీలిద్దాం. " పట్టణమున పదినాళులుంటిని/కార్యవశమును పోయి; యచ్చట/సంఘ సంస్కరణ ప్రవీణుల/సంగతుల మెలగి" " యిల్లు జేరితి నాటి వేకువ/జేరి, ప్రేయసి నిదుర లేపితి; / ' కంటివే ' నేనంటి, " మింటనుకాము బాణం బమరియున్నది." పట్టణమున పది దినాలుఉండి ప్రముఖ సంఘసంస్కర్తలతో మెలిగి భార్య దగ్గరకు వచ్చి నిదురలేపి చెబుతాడు. '' తెలిసి దిగ్గునలేచి , ప్రేయసి/నన్ను గానక మిన్నుగానక/ కురులు సరులను కుదురు జేయుచు/ఓరమోమిడ, బల్కితిన్" అంటాడు. అంతేకాదు. సకల కులాలవారితో పంక్తి భోజనం చేసి వచ్చిన భర్త " యెల్ల లోకము వొక్క యిల్లై/వర్ణ భేదము లెల్లకల్లై,/వేల నెరుగని ప్రేమబంధము/వేడుకలు కురియ." " మతములన్నియు మాసిపోవును/జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును/అంత స్వర్గ సుఖంబులన్నవి/యవని విలసిల్లున్." అని కొనసాగిస్తాడు గురజాడ.1906నుండి1915 వరకూ అనేక కార్యక్రమాలు చేపట్టాడు అలాగే అనేక గ్రంథాలను కూడా వ్రాసాడు. సమాజంలో గల అసమానతలు, అసాంఘిక కార్యక్రమాలు తుడిచి పెట్టడానికి తను చేయని ప్రయత్న మంటూ లేదు. అలాచేసే ప్రయత్నాలలో భాగమే"ముత్యాల సరాలు" " లవణరాజు కల" కవితా రచనలు." లవణరాజు కల" గురజాడ వ్రాసిన కవితలన్నింటికన్నా ఇందులోనే అధికమైన కవితలున్నాయి. మొత్తం 384 లైన్లను కలిగున్న 96 కవితలు ఉంటాయి. వీటిని 5 అధ్యాయాలుగా గురజాడ విభజించారు. ఒక్కొక్క కవితలో నాలుగు చరణాలుం టాయి. తెలకపల్లి రవి వ్రాసిన " గురజాడ స్వరయుగం'' లో " గురజాడకు శాశ్వత కీర్తి నార్జించి పెట్టిన రెండు చరణాలు గల కవిత లవణరాజుకల . ఈ కథ అనేక కావ్యాలలో ఉంది.దీనిని గురజాడ ఎలా రాశాడనే దానిపై పండితులు ఎడతెగని చర్చ చేసారు. మూల కథను తన భావాలకు అనుగుణంగా తీర్చుదిద్దుకొని, తనకు నచ్చని అతి శృంగారాన్ని పరిహరించడమే గురజాడ దోషమని ఆ పండితుల విమర్శల సారంగా చెప్పొచ్చు " అని అంటారు.లవణరాజు కొలువుకు ఒక ఇంద్రజాలికుడు వస్తాడు. అతనితో ఒక అశ్వకుడు కూడా తన గుర్రంతో వస్తాడు. ఇంద్రజాలికుడు తన ప్రభువైన లవణరాజును లోక విహారంచేసి రమ్మంటాడు. అలా గు‌ర్రంపై లోకవిహారానికి వెళ్లిన లవణరాజు దారి తప్పి ఒక కికారణ్యములోకి వెళ్లిపోతాడు. తినడానికి తిండిలేదు. బాగా ఆకలి వేస్తుంది. ఏం చేయాలోతోచలేదు.ఇంతలో ఒక 'ఛండాల స్ర్తీ' కనిపిస్తుంది. ఆమె చాలా నల్లగా ఉంటుంది. అయినా లవణరాజుకు గల ఆకలిని తీర్చుకొనేందుకు ఆమె దగ్గర అన్నం ఉంది. ఆకలి తీర్చుకునేందుకు ఆమెను అన్నం అడుగుతాడు. లవణ రాజు తన భర్త కాదు పరపురుషుడు. గాబట్టి భర్తకు మినహా అతనికి ( పరపురుషునికి ) అన్నం పెట్టనంటుంది. ఆకలి తీర్చుకొనేందుకు లవణరాజు ఆమెను వివాహంచేసుకుంటా నంటాడు. చేసుకున్నాడు. ఆమెను పెండ్లాడి తనూ ఛండాలుడయ్యాడు. వారి గడిచిన కాలంలో పిల్లలు పుట్టడం, బాధలుఅనుభవించడం, భయానమైన కరువు పరిస్థితితులలో కుమారుని బతికించుకునేందుకు తన తనువును అర్పిస్తా నంటూ చితిలో గెంతేస్తాడు. ఇక్కడ సింహాసనం నుండి పారిపోతున్నట్టు అనిపిస్తూంది. ఇదంతా నిజం కాదు. ఇంద్రజాలికుడు సృష్టించిన కల అని తేలుతుంది. ఏదో లవణరాజు కథను ' కల' గా ముగించారు ముందుతరం కథకులు. లేకపోతే ఆకలితో అలమటిస్తున్న రాజు అన్నం కోసం నల్లగా నున్న ఓ ఛండాలపు స్ర్తీని పెళ్ళి చేసుకోవడంఏమిటి ? కల గాబట్టి అందరూ అంగీకరించారు. ఇక్కడ రచయిత ఉద్దేశం ఏమిటంటే జాతి, కులం, రంగు బేధం లేకుండా వివాహాలు జరపడం, తమకు పుట్టిన పిల్లలనుబతికించుకోడానికి తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టడానికి వెనుకంజ వేయకపోవడం. గురజాడ వ్రాసినలవణరాజు కలలో దళితులపై అన్యాయాన్ని సహించలేని తనాన్ని చూపిస్తాడు. మచ్చుకు ఈక్రింది వాటిని చదవండి. " నిండు కొలువున లవణుడను రా/జుండె , జాలికు డొకడు దరి జని,/ "దండి నృప వొక గండు గారడి/ కలదు కను" మనియెన్". " మలిన వృత్తులు మాలవారని/కులము వేర్చిన బలియు రొక దే /శమున కొందరి వెలికి దోసిరి/ మలినమే మాల" " కులము లేదట వొక్క వేటున/ పసరముల హింసించు వారికి/కులము కలదట నరుల వ్రేచెడి/క్రూర కర్ములకున్". "మలిన దేహుల మాల లనుచు/మలిన చిత్తుల కధిక కులముల/నెల వొసంగిన వర్ణ ధర్మ మ/ ధర్మ ధర్మంబే !" ఇక్కడ గురజాడ వర్ణధర్మము గూర్చితెలియజేసాడు. ఇక గురజాడవారి మరో కవితను పరిశీలించండి. " తండ్రి కోసము తెచ్చు కూటిని/-- తిండికై యొరు కెట్టు లిత్తును ?/పెండ్లియాడిన--- పెనిమిటొకనికి/పెట్ట ధర్మంబౌ ! " పైన నేను చెప్పిన మూల కథను గురజాడ యథాతథంగా చెప్పకుండా కథలో కొన్ని మార్పులు చేసాడు. తండ్రి కోసం తెచ్చిన కూడును ఇతరులకెలా ఇవ్వగలను ?పెండ్లియాడిన భర్తకు ఇచ్చుట ఒక్కటే ధర్మమని ఆ ఛండాలస్ర్తీ చెబుతుంది.లవణరాజుకు' కల' తెప్పించి ఆకలలో నల్లని ఛండాలపు స్ర్తీని సృష్టించి పట్టెడన్నము కోసం ధర్మశాస్ర్తన్నివల్లించి వివాహం చేయిస్తారు కవులు. వారికి పుట్టిన కుర్రవాడు అనారోగ్యం పాలైనప్పుడు ఆ బాలుని రక్షించే టందుకు తన మాంసాన్ని అగ్నికి ఆహుతి చేస్తాడు.పిల్లలనుకనేయడమేకాదు పిల్లలకు కష్టాలు వచ్చినప్పుడు ప్రాణాలు సైతం తల్లి దండ్రులు ఫణంగా పెట్టి పిల్లలను రక్షించుకోవాలనే గురుతర బాధ్యతను ఈకథ ద్వారా తెలియ చేసారు. ( సశేషం ) -శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
July 27, 2020 • T. VEDANTA SURY • Memories