ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ రచనలలో ముఖ్యమైనవి, కానివి అంటూ ఏమీలేవు. అన్నీ రచనలు చదువ వలసినవే. సమాజ పరివర్తనకు ఆ రచనలన్నీ ఉపయుక్తమైనవే. కథాత్మక కవిత " కాసులు" లో స్ర్తీల అందాన్ని బంగారు ఛాయతోను, మంకెన పువ్వు అందాలతో గురజాడ పోల్చాడు. ఇక ప్రేమ విషయానికొస్తే " ప్రేమ కొరుకుకు/తిందురా ? యెట్టిదది ? నా వలను/కలదో, లేదో "యను నొక వింత/చూపును చూచెదవు -"మిసిమి మేనికి పసుపు నలదితి;/కురుల నలరుల నూనె నించితి/కాటుకను మెరుగిడితి చూడ్కికి'' " మరుల ప్రేమని మది తలంచకు/మరులు మరలును వయసు తోడనె;/మాయమర్మము లేని నేస్తము/మగువలకు మగవారి కొక్కటె/ బ్రతుకు సుకముకు రాజమార్గము/ ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును / ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును/ఇంతియె." అంటారు ప్రేమ గురించి గురజాడ. డాక్టర్. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి ఉద్దేశంలోగురజాడ సాహిత్యంలోని స్త్రీలంతా భూస్వామ్య వ్యవస్థలోపురుషాధిపత్య ఉక్కుపాదాల క్రింద నలిగిపోతూ అందులోనుంచి బయటపడటానికి పోరాటం చేస్తున్నవాళ్ళే! ఈ వాస్తవాలకన్నిటికీ సైద్ధాంతిక రూపంగా గురజాడ " కాసులు" కవిత వ్రాసాడు. స్ర్తీ పురుష సంబంధాలలో విప్లవాత్మక మార్పు అంటే యజమాని బానిస సంబంధాలు ధ్వంసమై ప్రేమపూరితమైన స్నేహ సంబంధాలు ఏర్పడటమే.గురజాడ"కాసులు"కవితలో ఆలాంటి సంబంధాలనే ప్రతిపాదించాడు.అందుకే ఆయన భావ విప్లవకారుడు. 1910లోనే గురజాడ మరులను ప్రేమగా భ్రమ పడవద్దని హెచ్చరించాడు. గురజాడ స్ర్తీ పురుషుల మధ్య భూస్వామ్య సంబంధాలనే గాక, ధనస్వామ్య సంబంధాలను కూడా తిరస్కరించి ప్రేమసంబంధాలను ప్రతిపాదించాడు " అంటారు. ఇక గురజాడ "కన్యక " ను రెండు భాగాలుగా వ్రాసాడు. మొదటి భాగంలో 20 కవితలు ఉంటాయి.అలానే రెండవ భాగములో 16 కవితలు ఉంటాయి.మొదటిభాగంలో నున్న కవితలు మచ్చుకు " తగటు బంగరు చీర కట్టి/కురుల పువ్వుల సరులు జుట్టి/నుదుట కుంకుమ బొట్టు పెట్టి/ సొంపు పెంపారన్" అని మొదటి కవిత ఉంటుంది. " పసిడి కడవల పాలు పెరుగులు/పళ్ళెరమ్ముల పళ్ళుపువ్వులు/మోములం దున మొలక నవ్వులు/చెలగ చెలికత్తెల్ వెంట నడిచిరి". " అంత పట్టపురాజు యెదురై/ కన్నెసొగసుకు కన్ను చెదురై/మరుని వాడికి గుండె బెదురై/యిట్లు తలపోసెన్" "పట్టవలెరా దీని బలిమిని /కొట్టవలెరా మరుని రాజ్యం/కట్టవలెరా గండపెండెం/రసిక మండలిలో ". గురజాడ ఈ కవితను పురుషాధి క్యతను వ్యతిరేకిస్తూ వ్రాస్తాడు.రాచపాళెం వారి ' దీపధారి గురజాడ' అనే వ్యాసంలో "సాంప్రదాయవాదులు విశ్వనాథంను, అభ్యుదయ ప్రగతిశీల వాదులు గురజాడను, దళితవాదులు జాషువాను, స్త్రీ వాదులు చలంను అలా సొంతం చేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఇందులో అసహజతత్వమేదీ లేదు. అనివార్యం కూడా. సమాజం విభజితమై ఉన్నప్పుడు అభిరుచులు కూడా విభజితాలై ఉంటాయి.........ఏ రచయితా అన్ని కాలాలకు యథాతథంగా ఆదర్శ ప్రాయం కాదు " అని అంటారు. కానీ గురజాడవారిని అన్ని కాలాలకు ఆదర్శ ప్రాయుడుగా మనం గుర్తించక తప్పదు. (సశేషం )--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
July 24, 2020 • T. VEDANTA SURY • Memories