ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ రచనలలో ' లవణరాజు కల,.కన్యక, డామన్- పితియస్ పూర్ణమ్మకథ కథనాత్మకత కవితలు. పూర్ణమ్మకథలిరికల్ బాలెడ్ అని ప్రముఖ పండితులు చెబుతుంటారు."గురజాడపై ఇరువురు మహాకవుల ప్రభావమున్నది.ఒకరు వర్డ్స్ వర్త్, రెెండవవారు రవీంద్రనాథ్. అతనితో ఉత్తర ప్రత్యుత్తరములు జరిపియున్నా‌రనీ, అయిననూ వర్డ్సవర్తుకవిత్వప్రభావం గురజాడ వారిపై ప్రసరించిన విధంగా రవీంద్ర నాథ్ ఠాగూర్ రచనల ప్రభావము పడలేదంటారు. వర్డ్సవర్తు ' "లరికల్ బేలెడ్స్'' గురజాడకు అనుసరణీయమైనదని, తన " ముత్యాల సరముల" లో ప్రతిబింబించిన కవిత్వతత్వ మున కెంతో సాదృశ్యమున్నదన్నదని చెబుతూ, వర్డ్సవర్తు వ్రాసిన Lucy Gray అను గేయము పూర్ణమ్మకథను తలపింపజేస్తుంది. రెండింటి అవసానము విషాదాంతమే అని సి. నారాయణరెడ్డిగారు తన గ్రంథము ఆధునికాంధ్ర కవిత్వములో పేర్కొంటారు. రవీంద్రుడు, గురజాడ ఒకేసంవత్సరం అంటే 1861లో జన్మించారు. రవీంద్రుని రచనలు గురజాడవారిని విశేషముగా ఆకట్టుకుని ఉత్తరప్రత్యుత్తరాలకు ఆ స్నేహం దారితీసింది. గురజాడవారుకలకత్తా వెళ్లి ఠాగూర్ ను దర్శించుకున్నారు. గురజాడకు ఠాగూర్ రచనలపై ఆశక్తి ఉన్నా వర్డ్సవర్తు ప్రభావమే ఎక్కువగా తనపై పడింది అంటారు సినారే గా‌రు. పూర్ణమ్మ కథ సమకాలీనమైనది.క‌రుణ రసాత్మకమైన కథ ఇది. మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు గురజాడ. పూర్ణమ్మ కథలో 24 కవితలు ఉంటాయి. గురజాడ పూర్ణమ్మకథను చెప్పేముందు " మేలిమి బంగరు మెలతల్లారా!/కలువల కన్నుల కన్నెల్లారా/తల్లులు గన్నా పిల్లల్లారా !/విన్నారమ్మా యీ కథను! " అని చిన్నా, పెద్ద మహిళలను మేలిమి బంగారంతో పోల్చి పూర్ణమ్మకథను వినేందుకు రమ్మంటాడు.కొండల నడుమ కోనొకటున్నది/ కోనకు నడుమా కొలనొకటుంది/కొలని గట్టునా కోవెల లోపల/వెలసెను బంగరు దుర్గమ్మ అని కథ చెప్పడం ప్రారంభిస్తాడు.ఒక పూజారి ఇంట్లో బంగారపు బొమ్మలాంటి పాప పుట్టింది. ఆమె పేరు పూర్ణమ్మ. ఆమె దుర్గమ్మ పూజకు రోజూ పూవులు కోసేది. ఏ కాలంలో పూసిన ఆయా పూవులను కోసి బంగారు తల్లిదుర్గమ్మను భక్తితో కొలిచేది. ఏయే రుతువులలో పండే పళ్ళను ఆయా రుతువులలో బంగరు తల్లి దుర్గమ్మకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ భక్తితో సమర్పించేది. పూర్ణమ్మనిండు మనసుతో అను నిత్యం దుర్గమ్మను కొలిచే పనిలో నిమగ్నమై ఉండేది. అటువంటి భక్తురాలైన పూర్ణమ్మనుతన తల్లిదండ్రులు డబ్బుకు దాసోహమైన తడ్రిఒక ముదుసలి మొగుడుకు కట్టబెడతాడు.ముసలి భర్తనుచూసిన పూర్ణమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. " ఆటపాటల తోటి కన్నియలు/మొగుడు తాత అని కేలింత/ ఆటల పాటల కలియక పూర్ణమ్మ/దుర్గను చేరీ దుక్కించె."కొన్ని రోజులైనతరువాత పూర్ణమ్మ ముసలి భర్త వచ్చి పుర్ణమ్మను తనతో తీసుకుపోవాలని వచ్చి చీరలు, బంగారు ఆభరణాలు చాలా తెచ్చాడు పూర్ణమ్మకు.పూర్ణమ్మ బంగారు ఛాయ శరీరానికి పసుపు రాసి స్నానం చేయించారు. వదినలు అత్తవారింట్లో తను ఎలా మెలగాలో పరిపరి విధాలుగా నేర్పారు. పూర్ణమ్మ పెద్దలకు మ్రొక్కింది. తల్లి తండ్రులు ఆమెను దీవించారు. వారి దీవెనలు వింటూ పూర్ణమ్మ ఒక్కసారి నవ్వింది. ( ఆటలాడుకొనే పిల్లగా నున్న తనను ముసలి భర్తకు ఇచ్చి అతనితో హాయిగాబ్రతికమని దీవించడం హాస్యాస్పదంగా , దుఃఖపూరితంగా లేదూ అన్నట్టు). తనకంటే చిన్నవారినందరినీ కౌగిలించుకునిపూర్ణమ్మ కన్నీరు పెట్టింది. అన్నలనూ, తమ్ముళ్ళను పిలచి అమ్మను, నాన్నను జాగ్రత్తగా చూసుకోమంది. అమ్మలకు అమ్మ అయిన దుర్గమ్మను కొలవమని చెప్పింది. నలుగురుకూర్చుని నవ్వే సమయంలో తన పేరును ఒకసారి తలవమంది. వారు కన్నబిడ్డలలో ఒకరికి తన పేరును పెట్టమందిపూర్ణమ్మ. అలా చెబుతూ బలబల ఏడ్చుతు కన్నీళ్లుపెట్టింది. అంతలోనే నిగ్రహించుకుంటూ పూర్ణమ్మ కలకల నవ్వింది. పూర్ణమ్మను చూసి వదినలు, తమ్ములు ఏడవడం మొదలు పెట్టారు. తల్లి కంటతడి పెట్టింది. తండ్రి మాత్రం డబ్బుకు దాసోహమై అల్లుని తలచుకుంటూ ఆనందపరవశు డయ్యాడు. ఎప్పటిలాగే పూర్ణమ్మ సాయంత్రం వేళ ఏరిన పువ్వులతో దుర్గమ్మను దర్శించుటకు ఒంటరిగా వెళ్లింది.ఆ సాయంకాల సమయంలో ఆవులు, పెయ్యలు (దూడలు)మందలుగా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాయి . అలానే పిట్టలు(పక్షులు) తమ చెట్లపై గుమిగూడి ఉన్నాయి. ఆకాశంలో చుక్కలు తళతళ మెరిసిపోతున్నాయి. అంతటి వేళ అయినా పూర్ణమ్మ ఇంటికి రాలేదు. "చీకటి నిండెను కొండల కోనల/మేతకు మెకములు మెసల జనెన్/దుర్గకు మెడలో హారము జనెన్/పూర్ణమ్మ ఇంటికి రాదాయె" " కన్నుల కాంతులు కలవల చేరెను/మేలిమి జేరెను మేని పసల్/హంసల జేరెను నడకల బెడగులు/దుర్గమ చేరెను పూర్ణమ్మ.ఆఖరి కవిత ద్వారా గురజాడ అతి తెలివిగా పూర్ణమ్మ కొలనులో దూకి మరణించి దుర్గమ్మను చేరిందని చెప్పలేక పరోక్షంగా చెప్పాడు. తల్లి దండ్రులు డబ్బుకు ఆశపడి అభంశుభం తెలియని ఆటలాడుకొనే పిల్లలను ముసలి వారికిచ్చి పెండ్లి చేస్తే జీవితాలు మధ్యంతరంలోనే ముగిసిపోతాయనిసమాజానికి ఒక గుణపాఠం చెప్పినట్టు అయింది. బాల్యం లోనున్న పిల్లలకు తోటివారితో ఆటలు, పాటలు, సరదాలుతప్పిస్తే ముసలి మొగుళ్ళు అందిచ్చే బీరువాల కొలది చీరలు, గంపెడు కొలదీ ఆభరణాలను ఆశించరు. పెళ్లి అంటే ఏమిటో తెలియని బాలలకు వివాహం చెయ్యడం ఒక తప్పు. ఇంకా ముసలి వాళ్లకు ఇచ్చి చేయడం మరో తప్పు.అలా చేయడం వలన తోటి పిల్లలు అపహాస్యం చేయడం, ఆ అపహాస్యాన్ని తట్టుకోలేక, సమాజంలో బ్రతుకలేక బలవంతపు మరణాలకు పాల్పడడం జరుగుతుంది అనేనీతిని " పూర్ణమ్మ" కథాత్మిక కవిత ద్వారా గురజాడ తెలియ జెప్పాడు. (సశేషం) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
July 30, 2020 • T. VEDANTA SURY • Memories