ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురజాడ వ్రాసిన ' అభూత కల్పనా గాథకు ఇతివృత్తం' అన్న ఈ నాటిక పాట రూపంలో ఉంటుంది. ఇది గురజాడ పెట్టిన శీర్షిక పేరు. ఏ సంవత్సరంలో ఈ పాట వ్రాయబడిందో ఎవరికీ తెలియదు. దీని చిత్తు ప్రతిని గురజాడ కుమారుడు గురజాడ రామదాసు ఆరోజుల్లో విజయనగరం నుండి ప్రచురింపబడుతున్న " విజయ" అన్న పత్రిక మొదటి ప్రచురణ ప్రచురించింది. ఆపత్రికలో 75 ఏళ్ళ క్రితం ప్రచురింప బడటం జరిగిందని మనకు ...సెట్టి. ఈశ్వరరావుగారు వ్రాసిన గ్రంథం " గురజాడ రచనలు-- కవితల సంపుటి '' ద్వారా తెలుస్తోంది. గురజాడ రచనల సంపుటాలలో వేటిలోనూ దీనిని ప్రచురించలేదు. అయినా ఈశ్వర రావుగారు పాట రూపంలో నున్న నాటికను " గురజాడ రచనలు--కవితల సంపుటిలోయథాతథంగా ప్రచురించారు.ఇది అసంపూర్ణ రచనే ! గురజాడ వ్రాసిన గేయ నాటికకు ముందు ఈశ్వరరావు గారు ఒక కథను పొందుపరిచారు. ఆ కథను చదివితే అతి చిన్న ఇతివృత్తంతో అతి చిన్న కథలో అతి చక్కని నీతి ఉంటుంది. హాస్యపూరితమైన రచన. చదవ వలసిందే కానీ నేను చెప్పవలసిందికాదు. కథలోకి వెళితే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఇంటి డాబా మీద కనిపిస్తుంది. రోజూ ఈ అమ్మాయికి " బీట్" వేస్తాడు. ఇతనికి పెళ్లి అయిపోయింది కూడాను. ( ఈ విషయం గురజాడ పాఠకులకు ముందుగా తన కథలో తెలియ జెప్పడు). గురజాడ పాటను చదువుతుంటే ఒక దగ్గర " నీ కాంత నేనైన నెనరుంతువేమో/పరకాంత పొందంటె..... "అని అంటుంది. పరకాంత పొందు అన్న పదాలు ఆ అబ్బాయి వివాహితుడని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆ అబ్బాయి చేస్తున్న చేష్టలు, అమ్మాయికి చేస్తున్న సౌజ్ఞలు, ఆ అమ్మాయి గమనిస్తుంది. ఆ అమ్మాయి ఇతని యొక్క ప్రేమ కా‌ర్యకలాపాలను గమనిస్తుంది. ఆమె కోసం ఆతడు వెన్నల రాత్రిళ్ళు ఆ వీధిలో సంచరిస్తుంటాడు. ఆ వెన్నెల రాత్రుల్లో అమె పాటపాడుతుంది. " ఏ గాలి విసరెరా మగడ నిను యీ వంక ( నా వంక ) " అంటుంది ఆ అమ్మాయి. అతడు ఆమె పాటను వింటూ ఉంటాడు. ఆమె పాడిన రాగం వరుసకు అతనూ రాగం కలుపుతాడు. " తనువుకు తనువుకు తగులదే లంకె " అనడమే గాకుండా మగువల మాటలు వింతగా ఉంటాయంటాడు. అందుకామె సమాధానంగా " మగవారి బాటలుమరి మరి వింత/మగనా‌లిపై గాని మరులు కోరెంత " అంటుంది. అందుకు అతడు "మాటలు కావిదె మనసిత్తు జూర " అంటాడు. ఆ వెనువెంటనే ఆమె అందుకొని " మనసొక్క టేయైతె మరి రాకు పోర " అంటూ " నీ కాంత నేనైన నెనరుంతువేమో( ప్రేమ, విశ్వాసము, దయ చూపుదువేమో)పరకాంతపొందంటే......." ఇంకా ఏదో అనబోతుంది.అందుకు సమాధానంగా " నా కాంత నీవైతె నా భాగ్యమెంత ?" అంటాడు. అందుకామె కూడా అతనికి సరియైన సమాధానమే చెబుతుంది. అదేమిటంటే " నీ కాంత నయ్యదనిదె చూడు వింత. '' అంటుంది గడసరిగా. తరువాత కథఏమయిందో గురజాడవారు వీరి సంభాషణను ముందుకు నడపలేదు. కథను ముగింపుకు తేలేదు. కానీ సెట్టి. ఈశ్వరరావుగారు తెలిపిన కథలో ' కలుసుకోడానికి కంగారెత్తించే పథకాలు చెప్పి అతణ్ణి రకరకాల చిలిపి పనుల్లోకి దింపుతుంది. చివరకు అవి దాసిని కౌగలించుకొనేట్టు చేస్తాయి. ఆ అమ్మాయి కథానాయకుని భార్యతో కుమ్మక్కై ఒకనాటి రాత్రి , ఆ అబ్బాయికి అతని భార్యే తటస్థ పడేలాగ చేస్తుంది. '' ఈ కథకు ఒక విధమైన ముగింపునిచ్చారు. అయితే ఈ ముగింపు ఎవరిచ్చారన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే పాట రూపంలో నున్న గురజాడ నాటికను చదివితే గురిజాడ ముగింపునీయలేదు. అందుకే "అభూత కల్పనా గాథకు ఇతివృత్తం'' అన్న గురజాడ రచన అసంపూర్ణమైన గురజాడ రచనలలో ఒకటిగా మిగిలి పోయింది. (సశేషం) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 1, 2020 • T. VEDANTA SURY • Memories