ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురువు(ఆటవెలదులో)----అనుపటి రాంచంద్రయ్య--ఏనుగొండ, మహబూబ్ నగర్
October 6, 2020 • T. VEDANTA SURY • Poem

గురువు జెప్పుమాట గుండెలో దాచుకో
గురువు లేకపోతె గుణమె లేదు 
గురువు తీర్చిదిద్దు గుణహీను వైఖరి
 బ్రతుకు దెరువు జూపు బ్రహ్మ గురువు.

అక్షరాలు నేర్పునంధకారముబాపు
సంస్కరించు జనుల సజ్జనుండు
దేవుడయ్యి నిన్ను తీర్చిదిద్దు గురువు
ఓర్పు నేర్పు గలిగి తీర్పుజెప్పు.

తెల్లనక్షరముల నల్లబల్లనరాసి
తెలివిబెంచబూను తెరువరితడు
నీతిబోధజేసె నిరుపమానుండును
పంతులయ్యకివియె ప్రణములందు.

విద్యబుద్ధులెన్నొ విశదీకరించును
మంచిమాటజెప్పి మహిని వెలుగు
చక్కదిద్ది చెప్పు చదువు మర్మములను
చదువులోనెయుంది సారమనియు.