ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురువు గారి దూరదృష్టి(బేతాళకథ) .డా.బెల్లంకొండనాగేశ్వరరావు.--పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా బయలు దేరాడు.విక్రమార్కుని భూజాన ఉన్న బేతాళుడు"మహీపాల నీపట్టుదల చూడటానికి చాలా ముచ్చటగా ఉంది.నీ గురించి ఇంద్రుని నగరంలోని 'శితాత శిఖరం'-విధ్యాధరుల రాజ్యంలోని 'మహానీల శిఖరం'-కిన్నెరుల నగరం లోని'వేణుమానవ శిఖరం'-గరుడ పక్షుల నివాసమైన'కరంజ శిఖరం'-'వసువులు నివసించే'వసుధారా శిఖరం'-'సప్తరుషుల నివాస మైన'రత్నథాతు శిఖరం'-బ్రహ్మ లోకం లోని'సుమేర,హేమశృంగ శిఖరం'-రుద్రుల నివాసమైన'గజశైలశిఖరం'-ఆదిత్యులు,అశ్వని దేవతల నగరం లోని'సుమేఘ శిఖరం'-గంధర్వుల నగరంలోని'హేమకక్ష'-యక్షుల నగరం లోని'శతశృంగ'-నాగలోకం లోని'తామ్రభ శిఖరం'వంటి మహాన్నత శిఖర నివాసులైన ప్రజలందరూ నీగుణ గణాలను,కీర్తి ప్రతిష్టల గురించి చెప్పుకోవడం నాకు తెలుసు.సర్వగుణ సంపన్నుడవు అయిన నీవే నాకు ఉన్న సందేహాన్ని తీర్చాలి.మనప్రయాణంలో నీకు అలసట తెలియకుండా కథా రూపంలో తెలియజేస్తాను.. .అమరావతి నగర పొలిమేరలలో సదానందుడు రాజు గారి సహాయంతోఆశ్రమం నడుపుతున్నాడు. ఆ ఆశ్రమంలో ఎందరోవేద విద్యతో పాటు, పలురకాల విద్యలు నేర్చుకుంటున్నారు.ఒకరోజు రాజభటుడు సదానందుని దర్శించి 'గురుదేవ రాజు గారి ఇంట పూజా కార్యక్రమం ఉంది,దాన్ని నిర్వహిం చ డానికి ఒకరిని పంపమన్నారు,ఇదిరాజగారి ఆజ్ఞ'అన్నాడు రాజభటుడు. వేద విద్య పూర్తిచేసిన ముగ్గురు పండితులను చేరపిలిచి 'నాయనలారా రాజు గారిఇంట పూజా కార్యక్రమం ఉందట ఒకరిని పంపమన్నారు మీరు ముగ్గురూ వెళ్లిరండి'అన్నాడు సదానందుడు. 'గురుదేవా రాజుగారు ఒక్కరినే తీసుకు రమ్మన్నారు 'అన్నాడు రాజభటుడు.'భయపడక ఈ ముగ్గురుని నీవెంట తీసుకు వెళ్లు'అన్నాడు సదానందుడు. రాజభటుని వెంట ముగ్గురుపండితులతొ బయలు దేరారు.కొంతదూరం ప్రయాణం చేసాక ఒక వర్తకుడు వారికి ఎదురై 'అయ్య మాఇంట పూజా కార్యక్రమం ఉంది,మీలో ఒకరు ఆకార్యక్రమం నిర్వహిస్తే కోరినంత ధనం ఇస్తాను'అన్నాడు.మూడవ పండితుడు ఆవర్తకుని వెంట వెళ్లిపోయాడు.రాజభటునితో ఇద్దరు పండితులతో నడవసాగారు.అలా కొంతదూరం ప్రయాణం చేసినతరువాత ఒక వ్యెక్తి వీరికి ఎదురువచ్చి 'అయ్యామాఇంట్లో లక్ష్శిపూజ చేయాలి నిర్వహించిన వారికి కోరినంత ధనం ఇస్తాను మీ ఇరువురిలో ఎవరైనా ఒకరు రాగలరా?'అన్నాడు.రాజభటుని వెంట ఉన్నపండితులలో ఒకరు ఆ వ్యక్తితో వెళ్లి పోయాడు.మిగిలిన ఒక పండితునితో బయలుదేరిన రాజభటుడు. రాజధాని చేరాడు.'విక్రమార్క మహీపాలా సదానందుడు ముగ్గురుపండిత శిష్యులను రాచకార్యానికి పంపినా చివరకు ఒక్కడే వెళ్ళి రాచకార్యం పూర్తి చేసాడు.మరి సదానందుడు ముగ్గురు శిష్యులను పంపడంలో ఆంతర్యం ఏమిటి? తెలిసి చెప్పక పోయావో మరణిస్తావు'.అన్నాడు బేతాళుడు.'బేతాళా ఎన్ని విద్యలు నేర్చినా ధనం సంపాదించడమే ధ్యేయంగా మనిషి జీవిస్తాడు.ముందు వెళ్ళిన ఇద్దరు పండితులు దైవకార్యాన్ని తిరస్కరించలేక వారితో వెళ్ళి అక్కడ సంపాదించిన ధనం ఆశ్రమ నిర్వాహణకు వినియోగించాలని ఆలోచనతో వెళ్ళారు.మొదట వెళ్ళిన మూడవపండితుడు తాను లేకున్న,మిగిలిన ఇద్దరూ రాచకార్యం నిర్వహించగలరని నమ్మకంతో వెళ్ళాడు.అదే నమ్మకంతో రెండో పండితుడు కూడా వెళ్ళాడు.చివరిగా మిగిలిన మూడవపండితుడు రాజు గారి శుభకార్యం నెరవేర్చాడు.ముందు జాగ్రత్తతొనే సదానందుడు ముగ్గురు పండితులను భటుని వెంట పంపించాడు'.అన్నాడు విక్రమార్కుడు.విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
July 25, 2020 • T. VEDANTA SURY • Story