ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురు దెవొ భవ :-రాజగోపాల్ కుప్పిలి
September 5, 2020 • T. VEDANTA SURY • News

గుకారత్వంధకారస్యాత్ 
రుకారస్తన్నిరోధకః |
అంధకార నిరోధిత్వాత్ 
గురురిత్యభిధీయతే ||

      చిన్నారులలో అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని ప్రసాదించువాడు గురువు అని ఉపనిషత్ వాక్యం.  
     ప్రపంచాన్ని నల్లబల్లగా మలచి, సుద్దతో సుధా కాంతుల్ని జల్లి, బడికి వచ్చిన చిన్నారులను ప్రేమ అనే ఉలితో సుందర విగ్రహాలుగా మార్ఛే శిల్పాచార్యుడు గురువు.
     ప్రకృతికి ప్రతికృతిని దిద్దే చిత్రకారులను, సరిగమలకు సరాగాలను పలికించే గాన గంధర్వులను, మహమ్మారి రోగాలనుండి రోగుల ప్రాణాలను కాపాడే వైద్యులను, దేశంకోసం ప్రాణాలను పణంగాపెట్టి పోరాడే వీర జవానులను, భాషకందని భావాలను సైతం తెనిగించే కవీశ్వరులను, నటనతో హావభావాలను ప్రదర్శించే నటులను, నృత్యంతో నటనా కౌశలాన్ని ప్రదర్శించే నాట్య కళాకారులను, రాకెట్లను కనుగొని, గ్రహాల ఉనికిని, వాటి చలనాలను పరీక్షించి, సృష్టికి ప్రతిసృష్టి చేసే శాస్త్రవేత్తలను దేశానికి అందిస్తున్న అపర విశ్వామిత్రుడు ..గురువు.
     ఉపాధ్యాయవృత్తికే వన్నె తెచ్చిన గురుతుల్యులు, 2007 సెప్టెంబరు5 న నాటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా సింగ్ పాటిల్ చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరించిన గురువరేణ్యులు, తెలుగు బాల సాహిత్య జగత్తులో ఉత్తరాంధ్రలో ఒక దీపకళిక - శ్రీ బెహరా ఉమామహేశ్వరరావు. పిల్లలలో జ్ఞానకాంక్షని, ప్రకృతి పట్ల ఆసక్తిని, చదువుల పట్ల శ్రద్ధని, పెద్దలపట్ల గౌరవాన్ని కలిగించడానికి బాల సాహిత్యాన్ని అద్భుత సాధనంగా ఉపయోగించి, సఫలీకృతులైన ప్రముఖులలో ఈయన ఒకరు. 
 "జ్జానం దేహి స్మృతిం దేహి
 విద్యాం విద్యాధి దేవతా
ప్రతిష్టాం కవితాం దేహి
శక్తిం శిష్య ప్రబోధికాం" 
  ఓ తల్లీ!  విద్యకు అధి దేవత అయిన సరస్వతీ! నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, జ్ఞాపకాన్ని ప్రసాదించు, విద్యనుఅనుగ్రహించు, ప్రతిష్ఠను, కవితా శక్తిని ప్రసాదించు, శిష్యులను జ్ఞానవంతులను చేసే శక్తినిఅనుగ్రహించు.. బ్రహ్మ వైవర్త పురాణం లోని ఈ శ్లోకం  ఈతని నిత్య పారాయణ పుస్తకంలోనేకాక, ఈతని మస్తకంలో నిక్షిప్తమైపోయింది. ఈయన ప్రసంగాలలో ముఖ్యంగా వినబడేవి -"గురువు కన్నబిడ్డలతో సమానంగా శిష్యులను ప్రేమించగలగాలి. చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత గురువులదే.దైవభక్తి, దేశభక్తితో పాటు తాము బోధించే విషయాలపై చక్కటి పరిజ్ఞానం, శాస్త్రజ్ఞానం వుండాలి. దేశచరిత్ర, సంస్కృతి పిల్లలకు బోధిస్తూ వుండాలి. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధి అన్న విషయాన్ని విస్మరించ కూడదు. పిల్లలమనస్సులు పెద్ద చెట్ల చుట్టూ అల్లుకునే లేత తీగల వంటివి. గురువులైనవారు ఆ లేత తీగలను సరియైన మార్గంలో అల్లుకునేట్లు చూడాలి.పిల్లలు సక్రమమైన మార్గంలో నడిస్తేనే దేశ భవిష్యత్తు బంగారు బాట కాగలదు" అని.
     అలాగే "విద్య ఒక ప్రవాహం, విద్య ఒక నిర్విరామ ఝరి, విద్య ఒక నిరాటంక వాహిని, విద్య జ్ఞానరూప ప్రకాశిక, విద్య ఒక మహార్ణవం, విద్య సకల ప్రజ్ఞల మయం, విద్యతోనే మానవుని జీవితం, అభివృద్ధి, ఎదుగుదల, సర్వం ముడిపడి ఉన్నాయి. చిన్నారులు విద్యయందు అభిలాష కలిగి, దిన దిన ప్రవర్ధనమానంగా పరిణతి  చెందుతూఉన్నత శిఖరాలను అధిరోహించడానికి విద్యార్థి దశలోనే అర్ధవంతమైన, పరిశీలనాత్మకమైన,సృజనాత్మకమైన,వ్యవహారాత్మకమైన, సమతుల్యమైన విద్యను అభ్యసించి, తెలివిని పెంపొందించుకోవాలి" అని అంటారు.
    ప్రైవేటు పాఠశాలలో, ఉపాధ్యాయ వృత్తిలో
రెండు దశాబ్దాలు దాటి సాగిన నా పయనంలో నేను ఆదర్శంగా తీసుకున్న వారిలో ప్రముఖులు శ్రీ బెహరా ఉమామహేశ్వరరావు.  ఏడు పదుల వయసు దాటినా, సాహితీ సేద్యం చేస్తూ, పాఠకులను అలరిస్తూ వస్తున్నారు. ఈతని రచన లేని దిన, వార, పక్ష, మాస పత్రికలు లేవంటే అతిశయోక్తి కాదు. ఒక గేయం వ్రాసినా, కథ వ్రాసినా, కవిత వ్రాసినా, గేయ కథ వ్రాసినా, వ్యాసం వ్రాసినా, బెహరా వారి కృతిలో ఆయనదైన వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, భావంలో, భావనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. 
    "మొలక" దినపత్రికలో తెలుగు సాహిత్య కవులపై ఈయన వ్రాసిన 101 వ్యాసాలు వరుసగా ప్రచురించ బడ్డాయి. వేలాది రచనలు చేసి,   ఇద్దరు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలచే (శ్రీ  రావూరి భరద్వాజ, డా. సి. నారాయణ రెడ్డి) ప్రశంసలందుకున్న శ్రీ బెహరా కలం నుండి మరెన్నో సాహితీ సుమాలు జాలువారాలని ఆకాంక్షిస్తూ.. గురువులకు, సాహితీ ప్రియులకు - "గురుపూజోత్సవ శుభాకాంక్షలు".