ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గోపీనాథము వేంకటకవి:- వేంకటగిరి సంస్థానము నందు ఆస్థాన కవిగా గోపీనాథము వేంకట కవి ప్రసిద్ధికెక్కాడు. ఈయన అనేక గ్రంథములు రచించాడు. వాటిలో వాల్మీకి రామాయణం అనుకరించి గోపీనాథ రామాయణం వ్రాసాడు. ఇందులో కృష్ణ జన్మ ఖండము, శిశుపాల వధ, బ్రహ్మ వైవర్త పురాణము నందలి భాగము, భాస్కర, రామాయణాదులు యథాతథముగా లేవని, అర్ధము కాగలదు. వేంకట కవి తన రామాయణాన్ని మూలం అనుసరించి రాసాడు. ఇతని శైలి సరళమై, మృదుమధురంగా ఉంటుంది.ఇది మనోహరమైన కావ్యము.--తరిగొండ వేంకమాంబ:-ఈ యుగము నందు ప్రసిద్ధి చెందిన కవయిత్రుల లో తరిగొండ వెంగమాంబ పేర్కొనదగినది. ఈమె 18 వ శతాబ్దానికి చెందినది. ఈమె తండ్రి పేరు కానాల కృష్ణయ్య, తల్లి మంగమాంబ. ఈమె ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. ఈమె వేంకటేశ్వరుని భక్తురాలు. వంశపారంపర్యంగా సనాతన వైష్ణవ సాంప్రదాయమునకు వీరి కుటుంబము పెట్టింది పేరు. ఈమెకు బాల్యము నుండి కూడా రామాయణ, మహాభారతాదులు‌ కరతలామలకములు. ఈమెకు రచయిత్రిగ వన్నెతెచ్చిన గ్రంధములు వేంకటాచల మహత్యము, జ్ఞాన వాశిష్ఠ రామాయణము, రాజయోగ సారమువంటి మరికొన్ని గ్రంథములు గలవు. ఈమె వ్రాసిన గ్రంథములు తరిగొండ నృసింహ స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. జ్ఞాన వాసిష్టశిష్టమను, ద్విపద కావ్యము తరుణోపాయము గా రచించినట్లు రచయిత్రి చెప్పుకున్నది. జీవితంలో వైరాగ్య ప్రభావంతో పాటు ఆత్మానాత్మ వివేచనకు సంబంధించిన కథలు ఈ కావ్యము నందు అనేకము ఉన్నవి. వేదాంత విషయాలను కూడా ఈమె పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో మృదు మధురంగా వ్రాసింది. ఈ కావ్యాన్ని మడికి సింగన అను కవి ఇంతకు పూర్వము పద్య రూపంలో రాశాడు. ఈమె వ్రాసిన రాజయోగ విశేషములు వివరణాత్మకంగా రాసి పెట్టారు. ఇదీ ద్విపద కావ్యమే, వేంగమాంబ రచించిన గ్రంథములలో వేంకటాచల మహత్యము ప్రసిద్ధమైనది. ఈ వేంకటగిరి క్షేత్రమహత్యం గ్రంథములో క్షేత్ర మహిమను వర్ణించు గ్రంథము.ఈ కావ్యానికి మూలములు వరాహ, భవిష్యోత్తర, పద్మ పురాణములు. ఇందు వేంకటేశ్వర మహత్యం వర్ణించబడినది. మాధవుడు అను బ్రాహ్మణ యువకుని కథ మిక్కిలి రసవత్తరంగా వ్రాయబడినది.అదేవిధంగా ఇందలి పద్మావతి శ్రీనివాసుల వివాహ వృత్తాంతము రమణీయమై ఒప్పారుచున్నది. పద్మావతి, శ్రీనివాసుల కళ్యాణము హృద్యముగా వ్రాయబడినది. శ్రీనివాసుడు ఎరుకల సాని వేషమున అంతఃపురమునకు వెళ్ళుట, అతనికి, లక్ష్మీదేవికి మధ్య జరిగిన సంవాదము సహజముగా వర్ణింపబడినది. తన భర్త ద్వితీయ వివాహము చేసుకొన్నప్పుడు లక్ష్మీదేవి అనుభవించిన మనోవేదనను వేంగమాంబ తన కవితా చాతుర్యం ద్వారా వ్యక్తపరిచింది. స్త్రీ హృదయం ఎటుల ఉండునో తన రచనలో చక్కగా వ్రాసినది. ఈమె రచనాశైలి, వేదాంత విషయ వివరణ సందర్భానుసారంగా మృదుమధురంగా రచించినది. ఈమె రచనా విశిష్టత ద్వారా ఈమె గుణగణాలు, వినయ విధేయతలు తెలియుచున్నవి. శృంగార రసమును వర్ణించుటకు ఈమె వైముఖ్యము చూపినది. ఈమె కావ్య రచన ఆత్మజ్ఞానమునకును, ఔచిత్యమునకును, ఆటపట్టుగా కనిపించును.(ఇది 82వ భాగం) - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 4, 2020 • T. VEDANTA SURY • Serial