ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గోపులు బొమ్మలు: -రచన యామిజాల జగదీశ్---తమిళ చిత్రకారులలో కీ.శే. గోపులుగారు సుప్రసిద్ధులు. ఆయన కార్టూనిస్టుకూడా. 1924లో తంజావూరులో జన్మించిన గోపులుగారి అసలు పేరు గోపాలన్. చిన్నప్పటినుంచే ఆయనకు చిత్రకళపై ఆమక్కువ ఎక్కువ. దాంతో స్కూలు చదువు ముగియడంతోనే కుంభకోణం ఆర్ట్స్ కళాశాలలో చేరారు. అంతేకాకుండా లిఖిత పత్రికొకటి తీసుకొస్తూ అందులో కార్టూన్లు వేస్తుండే వారు.ఆనందవిగడన్ అనే వారపత్రికలో ఉద్యోగస్తులైన అలనాటి చిత్రకళ మేధావి మాలిగారంటే గోపులుగారికి ఎంతో గౌరవం. మద్రాసుకు ఉద్యోగాన్వేషణకోసం వచ్చిన గోపులుగారు తన మానసిక గురువైన మాలిని కలిశారు.అది 1941. దీపావళి కోసం ప్రత్యేక సంచికకోసం ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. త్యాగరాజస్వామి తమ ఇంట పూజ గదిలో పూజించిన రామపట్టాభిషేకం చిత్రాన్ని గీసి తీసుకురమ్మని, బాగుండే పక్షంలో దీపావళి సంచికలో వేస్తామని గోపులుగారితో మాలిగారు చెప్పారు. అప్పుడు గోపులుగారు తిరువయ్యారు వెళ్ళి త్యాగరాజస్వామి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి మాలీగారడిన రామపట్టాభిషేకం బొమ్మ గీసారు.అప్పుడాయన వయస్సు పదహారేళ్ళు. ఈ బొమ్మ మాలిగారికి ఎంతగానో నచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం మాలిగారు ఆ ఏడాది దీపావళి సంచికలో ప్రచురించారు. ఆరోజుల్లోనేకాదు ఇప్పటికీ తమిళనాడులో దీపావళి సమయంలో ఆయా వారపత్రికలు, మాసపత్రికలు ఎక్కువ పేజీలతో పెద్ద సైజులో ప్రత్యేక సంచికలను ప్రచురిస్తున్నాయి. దాదాపుగా ఈ పత్రికలన్నింటిలో ఓ పది పదహారు పేజీలు ప ఫుల్ పేజీ దేవుడు బొమ్మలను ప.రచురిస్తాయి. వాటిని కట్ చేసి ఫ్రేములు కట్టించుకునేవారున్నారుంటే అవి ఎంత బాగుండేవో ఆలోచించండి. అలా ప్రచురమైన గోపులుగారి రామపట్టాభిషేకం బొమ్మకు విశేష ప్రశంబలు లభించాయి. అప్పటినుంచి గోపాలన్ గారి పేరు "గోపులు"గా మారిపోయి నలుగురి నాలుకలపై నానింది. ఆయనకు గోపులు అని పేరు పెట్టింది మాలిగారే.పురసైవాక్కంలోనే మిత్రులతో కలిసి బొమ్మలు, కార్టూన్లు వేస్తూ వచ్చిన గోపులుగారు ఆనంద విగడన్ వారపత్రికలో 1945లో ఉద్యోగిగా చేరారు. ఈ వారపత్రికలో ఆయన ఇరవై ఏళ్ళకుపైగా పని చేశారు.గోపులుగారికి పుస్తకపఠనమంటే ఎంతో ఇష్టం. దేవన్‌, కొత్తమంగళం సుబ్బు, తదితరులు రాసే రచనలలో ప్రముఖ పాత్రలకు గోపులుగారి కుంచె జీవం పోసేది.అవి పాఠకులను కట్టిపడేసేవి.సావి పేరుతో సుప్రసిద్ధులైన రచయిత "వాషింగ్టన్లో పెళ్ళి" కథకు ఆయన గీసిన బొమ్మలు మరచిపోలేనివి. ఈ కథ నాటకంగానూ రికార్డు స్థాయిలో ప్రదర్శించారు. అంతేకాదు, ఇదే కథతో సినిమాకూడా తీశారు. నేనూ నాటకమూ సినిమా రెండూ చూశాను. ఇప్పటికీ ఈ కథ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇది పూర్తిగా హాస్య రచనే. ఆయనతో కలిసి పలు ప్రాంతాలు సందర్శించి ఆయన రాసిన యాత్రా కథనొలకు గోపులు గారు వేసిన బొమ్మలకు విశేష ఆదరణ లభించింది.దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినప్పుడు సంబరాలు జరుపుకుంటున్నట్టుగా ఆనందవిగడన్ ప్రత్యేకించి ఓ ముఖచిత్రం ప్రచురించింది. ఈ చిత్రాన్ని గోపులుగారు వేయడం విశేషం.బొమ్మలేకాకుండా రాజకీయ కార్టూన్లు వేయడంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంతరించుకున్న గోపులుగారు గీసిన కామిక్ స్ట్రిప్స్ (మాటలు లేకుండా) చూడగానే నవ్వొచ్చేవి. వాటితో ఆయనకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పది వేలకుపైగా బొమ్మలు వేసి గొప్ప ఆర్టిస్టుగా ఖ్యాతి గడించిన గోపులుగారిది చిన్నపిల్లల మనస్తత్త్వం. పోగో ఛానెల్ ని ఆయన ఎంతో ఇష్టపడి చూసేవారు. ఆయనే ఈ విషయాన్ని చెప్పుకున్నారు. కీ.శే. జయకాంతన్ చిన్న కథలకు తాను వేసిన బొమ్మలంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఆయన 1963లో పత్రికా ఉద్యోగం నుంచి తప్పుకుని ప్రకటనల విభాగంలో చేరారు. తమిళనాడులో కొన్ని ప్రముఖ సంస్థలు ఆయనతో లోగోలు వేయించుకున్నాయి. ఆనంద విగడన్, అముదసురభి, కల్కి, కుముదం, కుంగుమంవంటి పత్రికలకు ఫ్రీలాన్సరుగా ఆయన బొమ్మలు వేయసాగారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పుడు గోపులుగారు తనను కలవడానికి వచ్చిన మిత్రులతో "నా బాణీని గోపులూ స్ట్రోక్స్ అంటారు. ఇప్పుడు నాకే స్ట్రోక్ వచ్చేసింది" అని నవ్వుతూ చెప్పేవారు.కుడి చేత్తో బొమ్మలు వెయ్యలేని స్థితి వచ్చినప్పుడుకూడా ఆయన బొమ్మలు గీయడం మానలేదు. ఎడం చేత్తో వేస్తూ వచ్చారు. కళైమామణి, ఎం.ఎ. చిదంబరం చెట్టియార్, జీవితకొల సాఫల్యం వంటి అనేక అవార్డులూ రివార్డులూ పొందిన గోపులుగారు 2015 ఏప్రిల్ 29న మరణించారు. కానీ ఆయన వేసిన బొమ్మలను ఇప్పటికీ ప్రముఖంగా చెప్పుకునే వారున్నారంటే అది అతిశయోక్తి కాదు. అదీ ఆయన చిత్రకళకు దక్కిన గొప్ప గుర్తింపు.- యామిజాల జగదీశ్
August 3, 2020 • T. VEDANTA SURY • Memories