ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గోరింటాకు-- మాలతి నేమాని --గోరింటాకు చేతికి పెట్టుకుంటే జ్ఞాపకాల ఎరుపు మనసుకి. అదేంటో ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఏమాత్రం తేడా లేకుండా ఎర్రగా పండి మురిపిస్తాయి. అసలు గోరింటాకు అంటే ఎంత హడావిడి, ఎంత ఆనందం, ఎంత అల్లరి. అమ్మ గోరింటాకు పెడుతుంది చేతులకి అనగానే, రోజూ నిజంగా చదివినా చదవకపోయినా ఆరోజు మాత్రం బుద్ధిగా ముందే హోమ్ వర్క్ ఏదయినా ఉంటే చేసేసి, పుస్తకాలు సద్దేసేవాళ్ళం. ఎవరికి వాళ్ళం నాకు ముందు అంటే నాకు ముందు అని పోటీ మొదలు నాకు మా అక్కలకి. అమ్మ రోట్లో గోరింటాకు రుబ్బుతుంటే రిథమిక్ గా కదిలే అమ్మచెయ్యి చూస్తూ, గాజుల చప్పుడు వినడం ఓ చక్కని అనుభూతి!... ఎంతమందిలో ఉన్నా అమ్మగాజుల చప్పుడు గుర్తుపట్టేస్తాం అదేంటో... అలాగే నాన్న సైకిల్ బెల్ కూడా లోపలెక్కడో ఉన్నా నాన్న సైకిల్ బెల్ విని పరిగెత్తుకుంటూ గేటుదగ్గరకి వచ్చేసేదాన్ని. మాకు గోరింటాకు పెట్టాలి అంటే అమ్మకి ఎంత పనో, ఆరోజు అమ్మే అన్నం కలిపి నోట్లో పెట్టేసేది త్వరగా తింటామని. అప్పుడు అమ్మ నా చెయ్యి పట్టుకుని ముందుగా వేళ్ళకి టోపీలు(అలాగే పిలిచేవాళ్ళం అరచేతి మధ్యలో చందమామ, చుట్టూ చుక్కలు. ఆ చుక్కలు కొంచెం ఆరాక ఊడిపోతుంటే వాటిని మళ్లీ మళ్లీ పెట్టమని అమ్మని ఎంత సతాయించేదాన్నో.మా ముగ్గురికీ రెండు చేతులకి పెట్టేసరికి, నాన్న ఆఫీస్ నించీ రావడం, భోజనం చేయడం కాబట్టి అమ్మ గోరింటాకు పాపం పనంతా అయ్యాక పెట్టుకునేది. అప్పటికే రోట్లో రుబ్బి, మాకు పెట్టినందుకు అమ్మ చెయ్యి మంచి పగడాల మాలంత అందంగా ఎర్రగా పండేది. నాన్న నన్ను ఎత్తుకుని తీసుకెళ్లి పడుకోబెట్టటం, గోరింటాకు చేతులకి కదా నడవచ్చు కదా అని మా అక్కలిద్దరూ నన్ను ఏడిపించడం!...మర్నాడు పొద్దున్నే నిద్ర లేచేసరికి, నిద్రలో మర్చిపోయి చెంపకి ఆన్చుకున్న చేతి గుర్తులు, అక్కడక్కడా ఎర్రగా. నాదే బాగా పండింది అని మాలో మేము పోటీ పడిపోయి నాన్న దగ్గరికి వెళ్తే, ఆ చేతులు చూసిన నాన్న నవ్వులో నిజంగానే పండేది గోరింట. ఒకరికి తెలీకుండా ఒకరికి నీదే బాగా పండిందిరా అని చెప్పడం ఓ అందమైన అబద్ధం. ఎప్పుడూ వద్దు అనే నా చిట్టితల్లికి గోరింటాకు పెడుతుంటే ఒక్కసారిగా నన్ను చుట్టేసిన జ్ఞాపకాలు.
June 29, 2020 • T. VEDANTA SURY • Memories