ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చందమామలో కుందేలు (జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212---ఒకసారి దేవునికి “జంతువులు అన్నింటిలో ఏది మంచిదో తెలుసుకోవాలి” అనే కోరిక కలిగింది. ఒక పేదవాని వేషం వేసుకున్నాడు.అడవిలో సింహం దగ్గరికి పోయాడు. “ఆకలయి తావుంది. ఏమయినా వుంటే పెట్టవా" అని ఆ సింహాన్ని అడిగాడు.సింహం కోపంగా “నాకే ఏమీలేక చస్తావుంటే...మధ్యన నువ్వొకనివి. ఇంకొక్క నిమిషం ఇక్కడున్నావంటే ముందు నిన్ను చంపి తింటా చూడు" అనింది.దేవుడు ఏనుగు దగ్గరికిపోయి “ఆకలయితా వుంది. ఏమయినా వుంటే పెట్టవా" అని అడిగాడు.ఏనుగు పకపక నవ్వి “పొద్దున్నించి రాత్రి వరకు కనబడినదంతా తింటా వున్నా నాకే కడుపు నిండడం లేదు. నీకింకేం పెట్టేది.పోపో" అనింది. దేవుడు అలా కుక్కనీ, పిల్లిని ఆవునూ అన్నింటినీ అడిగాడు. కానీ ఏవి గూడా ఏమీ ఇవ్వలేదు.'లాభం లేదు. ఈ జంతువులలో వేటికి గూడా జాలీ, ప్రేమ, దయా ఏమీ లేవు” అనుకొని తిరిగి పోతావుంటే ఒక చోట ఒక కుందేలు క్యారెట్టు తింటా కనబడింది. "సరే దీన్ని గూడా ఒకమాట అడిగి పోదాం" అనుకోని ఆ కుందేలు దగ్గరికి పోయాడు. దేవుడు కుందేలుతో “ నిన్నటినుంచీ ఏమీ తినలేదు. ఆకలయితా వుంది. ఏమయినా వుంటే పెట్టవా" అని అడిగాడు. కుందేలు ఏమాత్రం ఆలోచించకుండా అయ్యోపాపం అంటూ తాను తింటావున్న క్యారెట్ ను అలాగే దేవునికి ఇచ్చివేసింది.దేవుడు అది తిని “ఇంత చిన్నది నా కడుపులో ఏ మూలకి సరిపోతుంది. ఇంకా ఆకలిగా వుంది" అన్నాడు. 'అలాగా' అని ఆ కుందేలు ఉరుక్కుంటా ఇంటిలోనికి పోయింది.దాచి పెట్టుకున్న పళ్ళన్నీ తెచ్చి దేవుని ముందు పెట్టింది. దేవుడు ఆ పళ్ళన్నీ తిని “ఉహూ... నిన్నటి నుంచీ ఏమీ తినలేదు కదా... దాంతో ఇంకా ఆకలిగా వుంది” అన్నాడు ,కుందేలు కాసేపు ఆలోచించి ఉరుక్కుంటా పోయింది. ఎండు పుల్లలన్నీ ఏరుకొచ్చి కుప్ప చేసింది. చెకుముకి రాళ్ళతో ఆ కుప్పని అంటించింది. “నీకు ఇవ్వడానికి ఇంక నా దగ్గర ఏమీ లేదు. నేను ఈ మంటల్లో దుంకుతా. బాగాకాలినాక నా మాంసం తిని నీ ఆకలి చల్లార్చుకో" అంటూ ఎగిరి మంటల్లోనికి దూకింది. కుందేలు మంచి మనసును చూసి దేవుడు చిరునవ్వు నవ్వాడు. దాంతో కుందేలు మంటల్లో దుంకినా దానికి ఏమీ కాలేదు. దేవుడు ఆ కుందేలుని ప్రేమగా చేతుల్లోకి తీసుకోని తల నిమిరాడు. “ఓ కుందేలూ నువ్వు చిన్న దానివైనా... ఎవరూ చేయలేని పని చేశావు. నీలాంటి మంచివాళ్ళు ఇక్కడ కాదు ఉండాల్సింది" అంటూ ఆ కుందేలుని తీసుకుపోయి చందమామలో పెట్టాడు. అందుకే అప్పటి నుండీ మనకు రాత్రి పూట చందమామలో కుందేలు పిల్ల కనిపిస్తా వుంది.
June 29, 2020 • T. VEDANTA SURY • Story