ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చాకచక్యం: --డి.కె.చదువులబాబు--9440703716
November 16, 2020 • T. VEDANTA SURY • Story

అమరావతి గ్రామంలో ఉండే యశోదమ్మకు రాముడు అనే కొడుకు ఉండేవాడు. రాముడు చాలా తెలివైనవాడు. చమత్కారి. ఒకసారి యశోదమ్మ వాడికి సంచి, డబ్బు ఇచ్చి బియ్యం తీసుకు రమ్మని చెప్పింది. అంగడికి వెళ్ళి తల్లి ఇచ్చిన నాణెం ఇచ్చి బియ్యం తీసుకున్నాడు. దారిలో వస్తుంటే ఓచోట ఒకడు కోతిని ఆడిస్తూ కనిపించాడు. వాడి చుట్టూ జనం గుంపుగా ఉన్నారు. 'కోతి ఆట చాలా బాగుంటుంది.' అనుకుంటూ రాముడు అక్కడ నిలబడ్డాడు. భుజం మీద సంచిని క్రిందపెట్టి కోతి ఆట చూడసాగాడు.
ఆవీధిలో నారాయణ అనేవాడు రాముడు సంచిని క్రింద పెట్టడం చూశాడు. వెంటనే వాడు తనఇంట్లో ఉన్న అలాంటి సంచిని తీసుకుని దానిలో ఇసుకను నింపాడు. ఇసుక సంచిని అక్కడుంచి మెల్లిగా బియ్యం సంచిని పట్టుకెళ్ళాడు. కోతి ఆట పూర్తయ్యాక రాముడు సంచిని భుజంమీద పెట్టుకుని ఇంటికెళ్ళాడు.
"ఏంటీ...ఇంత ఆలస్యమైంది ?ఎలా వెళ్తే అలా వెళ్ళడమేనా? అన్నానికి బియ్యం లేవు" అంటూ యశోదమ్మ సంచి విప్పింది. లోపల ఇసుక ఉంది.
"ఏంటిది..బియ్యం తెమ్మంటే ఇసుక తెచ్చావ్? ఇంతసేపూఎక్కడున్నావ్?" అని గద్దించింది.
రామునికిఎవరో మోసం చేశారని అర్థమయింది. వెంటనే వాడు తడబడకుండా "అమ్మా!నువ్విచ్చిన నాణెం జారి ఇసుకలో పడిపోయింది. ఇంతసేపూ వెదికాను.కనిపించలేదు.నీవు కూడా వెదుకుతావని నాణెం పడ్డచోట ఉన్న ఇసుకను సంచికెత్తుకుని తీసుకొచ్చాను." అంటూ ఆలస్యానికి కారణాన్ని చాకచక్యంగా చెప్పాడు. అమ్మ నుండి చీవాట్లు తప్పాయి. రాముడు ఇంటినుండి బయటపడి కోతి ఆట చూసిన వీధిలోకెళ్ళాడు. ఓపదిమందితో జరిగిన విషయం చెప్పి "బియ్యం పోతేపోయాయి. ఆ సంచిలోని ఇసుకలో బంగారు ఉంగరం దొరికింది" అంటూ సంతోషంగా చెప్పి ఇల్లుచేరాడు.
ఈవిషయం ఆనోటా ఈనోటా పడి క్షణాల్లో నారాయణకు తెలిసింది.  వాడు బియ్యం సంచి తీసుకుని పరుగున రాముడి ఇంటికెళ్ళి "పొరపాటున సంచులు తారుమారయ్యాయి.ఇదిగో నీబియ్యం సంచి.నాఇసుక సంచి ఇవ్వు"అన్నాడు.
"ఇదిగో ఆమూల కూర్చుని అమ్మ వెదుకుతోంది చూడు. ఆ ఇసుక నీదే. సంచికెత్తుకుని వెళ్ళు" అన్నాడు రాముడు.
నారాయణ యశోదమ్మతో"పెద్దమ్మా!…ఏంటి వెదుకుతున్నావ్?" అన్నాడు.
ఆమె జరిగిన విషయం చెప్పి "రాముడు పోగొట్టుకున్న నాణెంకోసం వెదుకుతున్నాను"అంది దిగులుగా.
నారాయణకు అంతా అయోమయంగా అనిపించింది.
"ఈ ఇసుకనాది. నేను తీసుకెళ్తా!"అన్నాడు
రాముడు అక్కడకొచ్చి"తీసుకెళ్ళు"అన్నాడు
"మరి అందులో దొరికిన ఉంగరమో!" అన్నాడు నారాయణ.
"ఇసుకలో నాణెం పడిపోయిందని అమ్మకూ, ఇసుకలో ఉంగరం దొరికిందని వీధిలోనూ నేను చెప్పిందంతా కట్టుకథ. ఇసుకలో బంగారు ఉంగరం దొరికితే అమ్మ నాణెం కోసం వెదుకుతూ దిగులుగా ఎందుకుంటుంది?ఉంగరం దొరికితే నేను పదిమందికీ తెలిసేలా ఎందుకు చెబుతాను ఉంగరం పోగొట్టుకున్నోళ్ళు ఇంటి మీద కొచ్చిపడరా?బియ్యం సంచి దొంగిలించి ఇసుక సంచి పెట్టినోడ్ని బయటకు లాగడానికే అలా చేశాను. నీలాంటి దొంగబుద్ది నాకు లేదు. మా అమ్మ, నాన్న,ఉపాధ్యాయులు నిజాయితిగా బతకడం నాకునేర్పారు."అంటూ కేకలేశాడు.
నారాయణకు రాముడి చాకచక్యం అర్థమయింది.మారుమాట్లాడకుండా ఇంటి దారి పట్టాడు. కొడుకు నేర్పుకు యశోదమ్మ మురిసిపోయింది.