ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిన్నారుల కలల ప్రపంచం:- సాదిక్ అలీ
October 31, 2020 • T. VEDANTA SURY • News
  • ఇది ఒక స్పూర్తి దాయకమైన ప్రభుత్వ స్కూల్ కథ. స్పూర్తి ప్రదాత అయిన ఒక టీచర్ కథ. బెంగుళూరు హైవే మీద షాద్ నగర్ - జడ్చర్ల మధ్యలో మాచారం అనే ఒక ఊరు ఉంటుంది.అక్కడి నుంచి ఐదారు కిలోమీటర్లు లోపలి మట్టిరోడ్డు గుండా ప్రయాణం చేస్తే చౌట గడ్డ తాండా అనే గ్రామం వస్తుంది.అక్కడి భూములు చౌడు భూములు , పెద్ద పెద్ద బండరాళ్ళు. పట్టుమని 40 గడపలు కూడా ఉండవు. అలాంటి ఊళ్ళో ఉన్న ఒక అతి చిన్నప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ఈరోజు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అదే స్కూల్ తోపుడుబండి ని కూడా ఆకర్షించింది.మేము చూసింది మీతో పంచుకోవాలనే మా ఆరాటం.ఇది చదివి స్పూర్తి పొంది మరి కొందరు అనుసరిస్తారనే ఆశతో ఈ పోస్ట్ రాస్తున్నాను.
  •   స్కూల్ ముఖద్వారం చూస్తేనే మైమరచిపోతాం.చిన్నారుల కలల ప్రపంచం లోకి అడుగు పెట్టినట్లు ఉంటుంది. వేలు,లక్షలు ఫీజులు వసూలు చేసే కార్పోరేట్ స్కూల్స్ కూడా అలా ఉండవు అని ఖచ్చితంగా చెప్పగలను. స్కూల్ ఆవరణ ఒక ఉద్యాన వనంలా ఉంటుంది. అడుగడుగునా ఆక్సిజన్ అందించే చెట్లు. వర్షపు నీరు వృధా కాకుండా ఫిల్టర్ చేసి నిలువ చేసే వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్.పొడి చెత్త,తడి చెత్త వేయటానికి ఏర్పాట్లు,తడి చెత్తను ఎరువుగా మార్చి ఆవరణ లోని మొక్కలకు వాడుకునే విధానం,పిల్లల ప్లే గ్రౌండ్, స్వచ్చ భారత్ అవార్డ్ పొంది నిత్యం తళతళ మెరిసే టాయిలెట్లు,కిచెన్ గార్డెన్ అన్నీ పొందికగా కన్పిస్తాయి.
  •    ఇకపోతే,అక్కడి తరగతి గదులు,గోడలు వాటికవే పాఠాలు చెప్తాయి. అక్కడ గోడ పత్రిక ఉంది.గ్రంధాలయం ఉంది. టీచింగ్ మెథడ్ ,లెర్నింగ్ ప్రాసెస్ అంతా వినూత్నంగా ఉంటుంది.ఇదంతా ఎలా సాధ్యం అయ్యింది.అది ఒకే ఒక వ్యక్తీ స్వప్నం ,తన తోటి ఉద్యోగి,విద్యార్ధుల సాయంతో సాకారం చేసుకున్నాడు.అతడే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ బోగం నరేందర్.ఎనిమిది ఏళ్ళ క్రితం ఆ స్కూల్ కి బదిలీపై వచ్చారు. చుట్టూ బండలు ,రాళ్ళు,మొక్క మొలవని చౌడు భూమి.ఒకే ఒక తరగతి గది. దాన్ని మార్చాలని ఆరోజే కంకణం కట్టుకున్నాడు.అలాంటి స్కూల్ ని ఈరోజు విద్యార్ధుల కలల ప్రపంచంగా తీర్చిదిద్దాడు. ఏడాదికి కేవలం ఐదువేలు మాత్రమె గ్రాంట్ వచ్చే ఆ స్కూల్ ని లక్షన్నర ఖర్చుపెట్టి స్వర్గంగా మార్చాడు.అహర్నిశలు కష్టపడ్డాడు.అక్కడి విద్యార్ధులను ఆణిముత్యాల్ల తీర్చిదిద్దుతున్నాడు. రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయి అవార్డులు సాధిస్తున్నాడు. ఆ స్కూల్ ఎంతో మందికి స్పూర్తినిస్తోంది.ఆయన స్పూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు.
  •   టీచర్లు తలచుకుంటే,స్థానిక ప్రజాప్రతినిధులు సహకరిస్తే ,రాష్ట్రంలోని ప్రతీ స్కూల్ ని అలా తీర్చిదిద్దవచ్చు. దీన్ని ఒక యజ్ఞంలా భావించి ,చిత్తశుద్ధితో పనిచేయటానికి పూనుకుంటే సహకరించటానికి తోపుడుబండి సిద్ధంగా ఉంది.                                         
  • నా ఫోన్ నెంబర్ 9346108090
  • పీ.ఎస్. ఇక్కడున్న ఫొటోలతో పాటు మరిన్ని ఫోటోలు,వీడియో లు నా దగ్గరున్నాయి.ఆసక్తి గల టీచర్లు ,సంస్థలు సంప్రదించండి.