ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిలిపి పాపాయి_మంచి మామయ్య రచన:బి.వి.పట్నాయక్,పార్వతీపురం.చరవాణి 9441349275.
October 14, 2020 • T. VEDANTA SURY • Poem

అందాల పాపాయి
ఆటలాడే వేళ
సరదాల మామయ్య
సందడీ చేసేను!

పాపాయి దరి చేరి
తాయిలం ఇచ్చేను
అంతటితో ఆగక
ఎత్తుకొని తిప్పేను!

అంతలోనే పాప
వింతగా ఏడ్చేను
అంతుచిక్కక మామ
ముద్దాడి అడిగేను!

పాపాయి పాపాయి
నా మంచి బుజ్జాయి!
ఏడుపును ఆపేసి
కారణం చెప్పోయి?

పాప;
బుజ్జి నా నోటిలో
బొటన వేని పెట్టి
బుద్ధిగా నేనుంటె
విసురుగా లాగావు

నీ ఊసు పట్టానా?
నీ జోలి కొచ్చానా?
ఎందుకు లాగావు?
అందుకే ఏడ్చాను!

మామయ్య :
చప్పరించే పనిలో
తాయిలం మరిచావు
తేనెలూరేనా అందు
తెలియజేయు తల్లి!

పాప:
ఆదమరిచే వేళ
నోట చేరిన వేని
తేనె కన్నా తీపి
పాలు కన్నా మేటి!

మామయ్య:
నోటిన వేనుంచి
మైమరచె అలవాటు
మంచిది కాదోయి
తెలుసుకో బుజ్జాయి!

పాప:
అటులనే మామయ్య
మీసాల గురవయ్య
మించిపోయే వేళ
మానుకుంటానయ్య!

చిలిపి మాటల పాప
గడుసైన జవాబుకు
అచ్చెరువుతో మామ
అభినందనలు తెలిపె!