ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిలుక vs కాకి-- నల్లగా వుంటావని, నీ గొంతు కర్ణ కఠోరమని, జనం నన్ను ప్రేమిస్తారని గొప్పలు పోతూ కాకిని తక్కువచేసి మాట్లాడేది చిలుక. ఒకరోజు ఎవరో వల పన్ని చిలుకని ఎత్తుకు పోయారు. కాకిని ఎవరూ పెంచుకోరు కనుక కాకి స్వేచ్ఛగా వుంది. కథ ఇక్కడితో ఐపోలేదు. చిలుకని పంజరంలో పెట్టి మాటలు నేర్పిస్తున్నాడు ఎత్తుకెళ్ళిన వాడు. ఒక మాట మాట్లాడితే ఒక చిన్న పండు ఆహారంగా ఇస్తాడని చిలుకకి అర్ధమయింది. ఐనా మంచి తిండి దొరుకుతోందని సంతోషిస్తూ మాటలు నేర్చుకుంటోంది. ఇలా వుండగా చిలుకని పెంచుకుంటున్న వ్యక్తి ఇంట్లో తద్దినం వచ్చింది. కార్యక్రమం అయ్యాక పిండంతో పాటు చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన గారెలు, పిండివంటలు వగైరాలన్నీ ఆకులో పెట్టి "కా.. కా.. కా.. కా" అని కాకిని ఆహ్వానించాడు.కాకి ఆ దృశ్యాన్ని చూసి చిలుక వున్న పంజరం దగ్గర వాలి, "చిలుకా..చిలుకా..చూశావా… నీకు తిండి కావాలంటే అతని భాషనేర్చుకోవాలి. అదే నాకు తిండి పెట్టడం కోసం అతను నా భాషలో " కా.. కా.. కా.. కా"అని పిలుస్తున్నాడు. ఎవరు గొప్పంటావ్ " అంది గర్వంగా. చిలుక చిన్నబోయి తలొంచుకుంది. . "కనుక చిలుకా ఎవరి విలువలు వారికుంటాయి. ఎవర్నీ తక్కువ చేయవద్దు" అంటూ ఒక స్వీటు ముక్క తెచ్చి చిలుకకి ఇచ్చింది కాకి ! *నా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పిన కథ. . -దివాకర్ బాబు మాడభూషి
August 8, 2020 • T. VEDANTA SURY • Story