ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిల్లు లేదా కన్నం అణా!: --- యామిజాల జగదీశ్
August 25, 2020 • T. VEDANTA SURY • Memories

ఆంధ్రజ్యోతి మద్రాసు శాఖలో  కంట్రిబ్యూటరుగా పని చేస్తున్న రోజులవి. రాస్తేనే డబ్బు అనికాక రాసినవి అచ్చయితేనే డబ్బులు ఇచ్చేవారు. సెంటీ మీటరుకి ఇంతా అని లెక్కకట్టి డబ్బులు ఇచ్చేవారు. కనుక ఎంతో కొంత సంపాదించడం కోసం ఎక్కడైనా ఏవైనా విశేషాలు దొరుకుతాయాని కళ్ళు రోడ్లల్లో వేటాడేవి. అలా తిరుగుతున్న ఓరోజు నేను చదువుకున్న శ్రీ రామకృష్ణా మిషన్ మెయిన్ స్కూలు కాంపౌండ్ గోడకు అనుకుని ప్లాట్ ఫాంమీద ఒకతను ఓ అద్దం మూతున్న చెక్క పెట్టెలో పాతకాలపు నాణాలు కొన్ని కరెన్సీ నోట్లు పెట్టుకుని కూర్చున్నాడు. నాణాలతో రోడ్డుపక్కన కూర్చోవడమేమిటాని అనుకుని దగ్గరకు వెళ్ళి పలకరించాను. అతనితో మాట్లాడితే తెలిసింది "పాత నాణాలు అమ్మే అతనని" వాటిలో అప్పట్లో చలామణిలో లేని నాణాలూ కరెన్సీ నోట్లూ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటీ ఒక్కో రేటుకి అమ్ముతానన్నాడు. వాటిని నమ్ముకుని అప్పటికి ఓ ఏడెనిమిదేళ్ళుగా బతుకుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఆంధ్రజ్యోతి మద్రాసు టాబ్లాయిడ్ పేపరుకోసం ఓళకథ రాయొచ్చనుకుని అతని వివరాలు అడిగి తెలుసుకోవడం తోపాటు  ఒక పైసా నాణాలు మూడింటితోపాటు ఇరాక్ వాళ్ళ కరెన్సీ నోటొకటి తక్కువ ధరకు ఇచ్చాడు. 
 మన కరెన్సీ నాణాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారిగా  1950, ఆగస్లు 15వ తేదీనాడు భారత ప్రభుత్వం నాణాలను చలామణిలోకి  తీసుకొచ్చింది. 
అంతకుముందూ మన దేశంలో నాణాలు వాడుకలో ఉండేవి. అయితే అప్పటి వరకూ బ్రిటీష్‌ ఇండియన్‌ కరెన్సీపై బ్రిటిష్‌ రాజు బొమ్మ ఉండేది. కానీ స్వాతంత్ర్యం అనంతరం మన దేశంలో సొంతంగా తయారు చేసుకున్న నాణాలపై బ్రిటీష్ రాజు బొమ్మను  తొలగించి నాలుగు సింహాలు, అశోక చక్రం ముద్రతోకూడిన తొలి భారత రూపాయి బిళ్లను వాడుకలోకి తీసుకొచ్చారు. 
ఈ నాణాలను సిల్వరు, రాగి, లేదా నికిల్‌ వీటిలో ఏదో ఒక లోహాన్ని ఉపయోగించి నాణాలను తయారు చేసేవారు. మరికొంతకాలానికి రెండేసి లోహాలను ఉపయోగించి నాణాలను తయారు చేయడం వాడుకలోకొచ్చింది.
బ్రిటిష్ పాలనలోని మారక ద్రవ్య ప్రమాణం విషయానికొస్తే,  రూపాయి అంటే పదహారు అణాలు. అంటే తొంబై ఆరు పైసలన్నమాట. ఎందుకంటే, అప్పట్లో  ఒక అణాకు 6 పైసల విలువుండేది. అర్దణా అంటే మూడు పైసలు. 
ఈ విధానం దేశానికి స్వరాజ్యం వచ్చాక కూడా కొనసాగింది. 
అయితే 1957లో దశాంక విధానం అమలులోకి వచ్చినప్పుడు రూపాయికి 100 నయా పైసలు (కొత్త పైసలు) గా నిర్ణయించారు. 
1964లో 'నయాపైస'ను 'పైస'గా పేరు మార్చారు. 
ఇప్పటికీ 25 పైసలను నాలుగు అణాలు అనడం, 50 పైసలను ఎనిమిది అణాలు అనడం తెలిసిందే కదా.
అణాలో 12వ భాగాన్ని  దమ్మిడీ అనేవారు.
అణాలో 4వ భాగాన్ని పావు అణా అని, అణాలో సగభాగాన్ని  పరక అని, 
అణా అంటే 6 పైసలు అని చెప్పేవారు.
రెండణాలను 12 పైసలు లేదా బేడా అని, 
4 అణాలను పావలా అని,
అర్ద రూపాయిని 8 అణాలు అని అనేవారు.
ఇదంతా అటుంచి చిల్లు అణా పుట్టుక విషయాన్ని చూద్దాం.
అది 1943. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. లోహాల కొరత ఏర్పడింది. అప్పట్లో రాగిని అధికంగా వాడేవారు. రేడియోలోనూ రాగి చువ్వలు కావలసి వచ్చేది. ఆయుధాలలో రాగి, ఇత్తడి వినియోగించేవారు. మరోవైపు యుద్ధం జరుగుతున్న రోజులవడంతో సొరంగం పనులకూ, లోహాల ముడిసరుకును తీసుకుపోయే పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దాంతో లోహాల ధర ఆకాశాన్నంటాయి. మన దేశంలో నాణెం విలువ లోహం విలువకన్నా ఎక్కువగా ఉండేది. దీంతో మద్రాసు జనం ఆ నాణాలను ఖర్చుపెట్టకుండా జాగర్త చేయసాగారు. లోహాలను నల్లబజారులో అమ్మే పరిస్థితి నెలకొంది.ఇంకేముంది నాణాల కొరత నానాటికీ పెరుగుతూ వచ్చింది. చిల్లర కష్టాలు మొదలయ్యాయి.
చిన్న చిన్న హోటళ్ళలో తినడానికి వచ్చేవారిని వాకిట్లోనే ఆపి తగినంత చిల్లర 
ఉంటేనే లోపలకు రానిచ్చేవారు. అంతేకాదు, చిల్లరకు బదులు వాటికి సరిసమాన విలువుండే పోస్టల్ స్టాంపులను ఇచ్చేవారు. దాంతో ప్రభుత్వం చిల్లర నాణాలను తయారుచేసే కేంద్రాలను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే యుద్ధ కాలంలో అమలులో ఉండే చట్టం ప్రకారం నాణాలను వాటి విలువ కన్నా అధిక ధరకు అమ్మడమనేది నేరమని పరిగణించారు.
నాణాలను ఎవరైతే దాచి పెట్టుకున్నారో వివరాలు చెప్పినవారికి ప్రభుత్వం కానుకలు ఇచ్చింది. అంతేకాకుండా నాణాలు దాచుకున్న వారికి శిక్ష విధించేవారు. నూతన చట్టం ప్రకారం హోటళ్ళల్లోనూ చిల్లర వర్తకుల దగ్గర ఆకస్మిక తనీఖీలు చేపట్టారు.
ఈ సమయంలో అనేకులు పట్టుబడ్డారు. వారిలో ఒకరు మైసూర్ కేఫ్ హోటలుకి చెందిన ఒకరిని పట్టుకోవడం సంచలనమైంది. దీంతో హోటల్ యజమానుల సంఘం అధ్యక్షుడు రామనాథ అయ్యర్ నాయకత్వంలో ఓ బృందం మద్రాసు పోలీసులను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంది. తమ పరిశ్రమలో చిల్లర నాణాల ఆవశ్యకతను విడమరిచి చెప్పింది. చివరకు ప్రభుత్వం ఈ సమస్యకు ఓ ముగింపు తీసుకొచ్చింది. పాత నాణాలకు బదులు సగం బరువున్న కొత్త నిణాలను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో నాణాల మధ్యలో కన్నం (చిల్లు) పెట్టాలని నిర్ణయించి బరువు తక్కువ ఉండేలా 1943 ఫిబ్రవరిలో ఈ కొత్త చిల్లు నాణాలను వాడుకలోకి తీసుకొచ్చింది. ఇంతలో యుద్ధం ముగిసి లోహాల ధర తగ్గడంతో చిల్లర కొరత తొలగిపోయింది. అయినప్పటికీ మధ్యలో చిల్లు ఉండే అణాలు చలామణిలో కొనసాగాయి.