ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చివరికోరిక (పిల్లల కథ) రచన:బి.వి.పట్నాయక్.
November 1, 2020 • T. VEDANTA SURY • Story

   సమన్యాయ పాలన చేస్తున్న మృగరాజు పట్ల అడవిలో జంతువులు భయభక్తులతో  పాటు అమితమైన గౌరవం కలిగి జీవిస్తుండేవి.
         ఇప్పుడు మృగరాజు అంతిమ గడియలు లెక్కిస్తున్నాడని తెలిసి జంతువులన్నీ మృగరాజు గుహ ముందుకు వచ్చి చేరాయి.
        కొద్ది సేపటికి సింహం చనిపోయింది. జంతువులన్నీ గొల్లున ఏడ్చాయి.
          మంత్రిగా ఉంటున్న నక్క జంతువులన్నింటిని ఓదార్చింది. 'మన మృగరాజు చనిపోలేదు, దైవ సన్నిధికి వెళ్ళి వస్తామని చెప్పారు. తను తిరిగి వచ్చినంత వరకు ఉపవాస దీక్షతో నన్ను కాపుగా ఉండమని చివరి కోరిక కోరారు'అని సింహం చివరికోరికను బయట పెట్టింది నక్క.                 
       జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. చనిపోయిన జీవి బతకడం నమ్మలేని నిజం అవుతుంది. ఇదెలా సాధ్యం? అంటూ జంతువులలో గుసగుసలు ప్రారంభమయ్యాయి.
             'మిత్రులారా! ఇది అసాధ్య సంఘటన అని నాకు తెలుసు. మృగరాజు నమ్మకంగా ఈ విషయాన్ని చెప్పారు. మృగరాజు ఉప్పు తిని బతికే శరీరం ఇది. నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి మృగరాజు ఆగమనాన్ని స్వాగతిస్తాను. ఈ దీక్షలో నా ప్రాణాలు పోయిన పరవాలేదు'అని ప్రభు భక్తిని చాటుకుంది నక్క.
          మేము కూడా ఉపవాస దీక్షలో పాల్గొని నీకు తోడుగా ఉంటాము అంటూ సింహంపై ప్రేమాభిమానాలు ఉన్న మరి కొన్ని జంతువులు ముందుకు వచ్చాయి.
          'మిత్రులారా! మృగరాజు పట్ల మీ మమకారం వెల కట్టలేనిది. మీరంతా బ్రతికి ఉండాలి. మీరు లేని చోట మృగరాజు పునర్జన్మ అర్థ రహితం అవుతుంది. మృగరాజుపై మీకు నిజమైన భక్తి ఉంటే ఒక నెలరోజుల పాటు ఈ గుహ పరిసరాలకి రాకండి. ఆ మాత్రం సాయం చేస్తే నెల రోజుల్లో మృగరాజు మీ ముందు దర్శనమీయగలరు' ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది నక్క.
          జంతువులన్నీ వెనక్కి తగ్గాయి. మృగరాజును కడసారి చూసి అక్కడ నుండి కదిలాయి.
          నక్క త్యాగబుద్ధి గురించి అడవిలో జంతువులన్నీ కథలు కథలుగా చెప్పుకోవడం మెుదలు పెట్టాయి.
          నెల రోజులు గడిచిపోయాయి. జంతువులన్నీ సింహం రాక గురించి ఎదురుచూస్తున్నాయి
           ఒక రోజు ఆహారం కోసం  కుందేలు అడవిలో తిరుగుతిన్న సమయంలో ఉరుములు మెరుపులతో దట్టమైన వర్షం ప్రారంభమయ్యింది.దారి కనిపించక నానా తిప్పలు పడ్డ  కుందేలు, చివరకు ఒక గుహను చేరుకుంది. ఉరుములు బారి నుండి కాపాడుకోడానికి లోపలకు అడుగు పెట్టబోయింది. జూలు విదిలిస్తున్న సింహం కనిపించింది.అప్పుడు జ్ఞాపకం వచ్చింది నక్క కాపు ఉన్న మృగరాజు గుహ అది అని. భయంతో కపించిపోయింది.తను చూసిన నిజాన్ని మిగిలిన జంతువులకు చెప్పడానికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగుతీసింది.
             ఈ విషయం తెలిసిన జంతువులన్నీ సంతోషించాయి. వాన వెలిసిన వెంటనే మృగరాజుని కలిశాయి. కుశల ప్రశ్నలు వేశాక నక్క కనిపించకపోవడంతో ప్రభుభక్తిని చాటుకున్న నక్క గురించి అడిగాయి.
             'నక్క ప్రాణ త్యాగం చేయబట్టే నేను ఈ లోకానికి రాగలిగాను. ఈ ఎముకల రాశి నక్కవే' అంటూ ఎముకల రాశిని చూపించింది సింహం. రుజువు కనిపించడంతో నక్క స్వామి భక్తిని పొగడ్తలతో ముంచెత్తాయి వచ్చిన జంతువులు.
         ' గత నెలరోజులుగా స్వర్గలోకంలో అమృతం తాగి బతికాను.అది ఆ లోకానికి పరిమితం. ఇప్పుడు ఈ లోకంకి వచ్చాక ఆకలి సాధారణ విషయమైంది. దైవాజ్ఞ ప్రకారం నాకు నేనుగా జీవహింస చేయలేను. మీలో ఒక్కొక్కరు తనకు తానుగా ఆత్మార్పణ చేసుకొని నాకు ఆహారమైపోవాలి.నాకు ఆహారమైన జీవికి మాత్రం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇది నాకు దైవమిచ్చిన వరం' చెప్పింది సింహం.
           మృగరాజు మాటలకు జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి.ప్రభుభక్తి మెండుగా ఉండడంతో కాదనలేకపోయాయి. తెలివిగా బలమైన జంతువులన్నీ కుందేలు వైపు చూశాయి.
       తనను బలి పశువు చేసే ప్రయత్నాన్ని గమనించింది కుందేలు.  బలవంతుల ఆధిపత్యం నుండి బలహీనులు బయటపడడం కష్టమన్న నిర్ణయానికి వచ్చి తనకు తాను ప్రాణత్యాగం చేయడానికి సంసిద్థత వ్యక్తం చేసింది.
        బుజ్జగింపులు లేకుండా ప్రాణత్యాగానికి కుందేలు  ఒప్పుకోవడంతో పెద్ద జంతువులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాయి.స్వర్గలోక ప్రాప్తి కలుగుతున్న కుందేలు మనకు పూజ్యనీయురాలవుతుంది అంటూ  పొగడ్తలను అందుకున్నాయి.
         కుందేలు మాత్రం  ఒక మెలిక పెట్టింది. 'ప్రాణం పోయెముందు నా చివరికోరిక తీర్చాలి' అడిగింది.
         'ఏమిటా చివరికోరిక?' అడిగింది పులి.
        'బయటకు రక్తం చిందకుండా చనిపోవాలన్నదే నా చివరికోరిక'అంటూ తన చివరికోరికను బయట పెట్టింది కుందేలు.
        'అదెలా సాధ్యం? చంపేటప్పుడు రక్తం చిందకుండా ఉంటుందా?' నిలదీసినట్టు అడిగింది పులి.
        'పులిబావా! గట్టి శబ్ధం వింటే సున్నితమైన నా గుండె ఆగిపోతుంది. గుండె ఆగిపోయే చావులో రక్తం చిందదు' తన ప్రార్ధనను మన్నించమన్నట్టు అడిగింది కుందేలు.
         'అంత శబ్ధం ఎక్కడ నుండి పుట్టిస్తాము?' ఆలోచన అందక ప్రశ్నించింది పులి.
            'మృగరాజు గర్జన చాలు నా గుండె ఆగిపోడానికి'సూచన చేసింది కుందేలు.
          సింహ గర్జన శబ్ధం ఏపాటిదో పులికి తెలుసు. కుందేలు సూచన సబబు అనిపించింది. 'మృగరాజా! కుందేలు సంతృప్తి చావుకు చివరి కోరిక తీర్చడంలో సమంజసం ఉంది. మీ గర్జనతో కుందేలును కోరికను తీర్చండి' అంటూ సింహంపై  ఒత్తిడి తెచ్చింది.
         తప్పనిసరి పరిస్థితిలో సింహం జూలు విదిల్చి నిలబడింది. చిన్న జంతువులు భయంతో పరుగు పెట్టాయి. కుందేలు నిశ్చంతగా నిలబడింది.
          సింహం గొంతు సవరించి గర్జించబోయింది. గర్జనకు బదులు ఊల వినిపించింది.
          సింహం నోట నక్క ఊలా? ఇందులో మోసం దాగి ఉంది అనుకున్న పులి తన పంజాను సింహంపై విసిరింది. సింహం చర్మంలో దాగి ఉన్న నక్క చర్మం విడిచి ఒక్క ఉదుటున పరుగు పెట్టింది.
            సింహం చివరికోరిక అబద్ధమని తేలింది. నంగనాచి నక్క నెల రోజుల పాటు చచ్చిన సింహం మాంసం తిని ఆ తరువాత చర్మం కప్పుకొని మృగరాజులా చలామణీ అవ్వాలన్న దొంగ నాటకం అందరికి అర్థమైంది. మోసగించిన నక్కకు దేహశుద్ధి చేయడానికి అన్ని జంతువులు నక్క వెంట పడ్డాయి.
        'ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది'అంటూ కుందేలును సానుభూతితో పరామర్శించింది కోతి.
          'నక్క నిజ స్వరూపం ముందు నేను చూడబట్టే ఈ రోజు ధైర్యంగా చావుకు  ఒప్పుకున్నది. చివరికోరిక అంటూ ఎత్తు వేస్తే అదే చివరికోరికతో చిత్తు చేశాను'పక పక నవ్వుకుంటూ సమాధానమిచ్చింది కుందేలు.
          అందరిని అన్ని వేళల మోసం చేయలేమన్న సత్యం ఆలస్యంగా తెలుసుకున్న నక్క బతుకుజీవుడా అనుకుంటూ ఇంకా పరుగు పెడుతునే ఉంది.