ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చూసేది నాకు తెలుసులే---డా.. కందేపి రాణీప్రసాద్.
October 29, 2020 • T. VEDANTA SURY • Story

కోసల రాజ్యంలో గోపన్న అనే యువకుడు ఉండేవాడు. వాడి తల్లిదండ్రుల ఈ మధ్యనే చనిపోయ్యారు. పొట్ట పోసుకోవడానికి ఏ పని రాదు.ఏ శాస్త్రాలు చదవలేదు. కానీ రాజాస్తానంలో ఉద్యోగం రావాలని కోరిక మాత్రం ఉండేది.
 ఈ ఊర్ల్లోకి ఒక సాధువువచ్చాడు. జనం తండోప తండాలుగా వెళుతున్నారు.దాంతో గోపన్న కూడా వెళ్ళాడు.
తన కోరిక విన్నవించుకున్నాడు.సాధువు గోపన్నతో “రేపు ఉధ్యనవనానికి రా!నీకక్కడ మంత్రం బోధిస్తాను.మూడు
రోజులు ఆ మంత్రాన్నినిష్టగా పాటించావంటే నీకు రాజు గారి ఆస్థానంలో ఉద్యోగం లభిస్తుంది” అన్నాడు.
 మరునాడు ఉదయమే గోపన్న రాజుగారి కోట ఎదురుగా ఉన్న ఉద్యానవనానికి వెళ్ళాడు.అక్కడ ఒక చెట్టు కింద సాధువు కూర్చుని ఉన్నాడు. గోపన్నతో ఇలా రా మంత్రం చెపుతాను అని సాధువు ఎదురుగా ఉన్న గాడిదను
చూపించి “అదేం చేస్తుంది అని అడిగాడు.గోపన్న అటు చూశాడు. ఆ గాడిద అటూఇటూ చూస్తోంది. అదే చెప్పాడు గోపన్న అయితే “నువ్వు చూసేది నాకు తెలుసులే” అని మూడు సార్లు అను. ఇది మొదటి మంత్రం” అన్నాడు సాధువు.
సరే అన్నాడు గోపన్న.
 మరల ఇప్పుడు గాడిదను చూడు అన్నాడు సాధువు. అప్పుడు గాడిద చెట్టుకేసి తన ఒళ్ళును రుద్దుకుంటోంది. గాడిద తన ఒంటిని చెట్టుకేసి రుద్దుకుంటున్నది అన్నాడు గోపన్న. అయితే నీ రెండో మంత్రం విను “నువ్వు రుద్దేది నాకు తెలుసులే, నువ్వే రుద్దేది నాకు తెలుసులే” అని మూడుసార్లు అనాలి అన్నాడు సాధువు.
సరేనాని తల ఊపాడు గోపన్న.
 సాధువు మళ్ళీ గాడిదను చూడమన్నాడు. ‘ ఇప్పుడేం చేస్తుంది ’ అనడిగాడు. గాడిద పరిగెత్తుతోంది ఆ సమయంలో. గాడిద పరిగెత్తుతోంది అని చెప్పాడు గోపన్న.”నువ్వు పరిగెత్తేది నాకు తెలుసులే, నువ్వు పరిగెత్తేది
నాకు తెలుసులే” అని మూడు సార్లు ఆను. “అదే నీ మూడో మంత్రం” అన్నాడు సాధువు.
 “ ఈ మూడూ మంత్రాలను రోజూ ఈ ఉద్యానవనంలో పెద్దగా పాటించాలి.అప్పుడు నీకు రాజాస్థానంలో ఉద్యోగం దొరుకుతుంది పో” అన్నాడు సాధువు. గోపన్న సరే నని తలాడించాడు.
 మరునాడు ఆ ఊరి రాజుగారు గడ్డం చేయించుకోవటానికి తోట లోకి వచ్చి కూర్చున్నాడు. అప్పటికే క్షవరం చేయడానికి వచ్చిన మంగలి బిత్తర బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు. అదే సమయానికి ఎక్కడి నుంచో “నువ్వు చూసేది నాకు తెలుసులే, నువ్వు చూసేది నాకు తెలుసులే” అని మాటలు వినిపించాయి. మంగలి వాడు ఆ మాటలు విని బెదిరాడు.తన బెదురును కనపడనీయకుండా కత్తిని తీసుకొని పదును కోసం బండకేసి రుద్దుతున్నాడు.
 ఆ వెంటేనే మరల “నువ్వు రుద్దేది నాకు తెలుసులే,నువ్వు రుద్దేది నాకు తెలుసులే ‘ అని మాటలు వినిపించాయి.మంగలోడిది విషయం అర్థమైంది. నా కుట్ర బయటపడిపోయింది అని భయపడి పరుగుతీస్తున్నాడు.అప్పుడు వెంటనే “నువ్వు పరిగెత్తేది నాకు తెలుసులే,నువ్వు పరిగెత్తేది నాకు తెలుసులే అన్న మాటలు వినపడ్డాయి.మంగలోడికి భయంతో చెమటలు పట్టేసి వానికి పోసాగాడు.
 రాజు గారికి అర్థం కాలేదు. మంగలోడు క్షవరం చేయకుండా ఎందుకు పారిపోతున్నాడు అనుకోని “వాడినిలా 
పట్టుకురండి” అని భటుల నాజ్ఞాపించాడు. వెంటనే భటులు మంగలోడిని పట్టుకొని రాజు కెదురుగా నిలబెట్టారు. మంగలోడు రాజుగారి కాళ్ళ మీద పడి “నాకేం తెలియదు ప్రభూ! అంతా మంత్రిగారే చెప్పారు. నన్ను వదిలేయండి”
అంటూ వెదుకున్నాడు. పరిస్థితి గ్రహించిన మంత్రి ఎల్లగా జారుకోబోయాడు. రాజుగారి కనుసైగతో రాజభటులు మంత్రిని పట్టుకొని బంధించారు.
 అప్పుడు విషయం ఏంటని మంగలోడిని అడిగారు రాజుగారు.ప్రభూ!మంత్రిగారు శత్రురాజులతోచేయికలిపి మిమ్మల్ని హత్య చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు.అందుకని నన్ను బెదిరించి మీకు క్షవరం చేసేటప్పుడు చంపేయమన్నారు.గడ్డం గీస్తూ గొంతు కోసేయమన్నారు.అందుకే లోపలికి వచ్చి కత్తి నూరుతుంటే వాడేవాడో “నువ్వు రుద్దేది నాకు తెలుసు” అంటూ మాట్లాడాడు అసలు విషయం బయటపడిపోయిందని నేను పారిపోబోయాను.అంతలో మీరు పట్టుకున్నారు.అదీ ప్రభూ జరిగిన విషయం.ఇందులో నా తప్పేం లేదు.నన్ను క్షమించండి ప్రభూ” అని కళ్ళావెళ్ళాపడ్డాడు.
 రాజుగారికి విషయం అర్థమైమంత్రిని కారాగారానికి తరలించమని ఆదేశించాడు.ఆ తర్వాత “ఈ జరగబోయే హత్య కుట్ర గురించి తెలిసి మాట్లాడినతన్నితీసుకురండి” అని ఆజ్ఞాపించాడు.వెంటనే భటులు ఎదురుగా ఉన్న ఉద్యానవనానికి వెళ్ళి “నువ్వు చూసేదీ నాకు తెలుసులే,నువ్వు రుద్దేది నాకు తెలుసులే,నువ్వు పరిగెత్తేదినాకు తెలుసులే అని మంత్రాన్నిపటిస్తున్నగోపన్నను తీసుకొచ్చారు.రాజుగారు అతడ్ని “నీకు ఈ హత్య విషయం ఎలా తెలిసింది” అని ప్రశ్నించాడు.
 “నాకేహత్య విషయమూ తెలియదు ప్రభూ! నేను సాధువుగారు బొదించిన మంత్రాలు పటింస్తుండగా మీ భటులు నన్ను లాక్కొచ్చారు’ అన్నాడు గోపన్న భయపడుతూ.
 “మీ సాధువు బోధించిన మంత్రాలు ఏమిటి?” అని అడిగాడు రాజుగారు. గోపన్న ఇలా చెప్పాడు – నువ్వు చూసేది నాకు తెలుసులే,నువ్వు రుద్దేది నాకు తెలుసుసులే,నువ్వు పరిగెత్తేది నాకు తెలుసులే అని మూడు మంత్రాలు చెప్పాడు ప్రభూ!అప్పటికి రాజు గారికి విషయమంతా అర్థమై నవ్వుకున్నాడు.వాడి పాటకి వాడు ఉద్యానవనంలో మంత్రాలు జపిస్తుంటే హత్య విషయం తెలిసిందని మంగలోడు భయపడ్డాడు.అదీ విషయం.
 ఇలా దగ్గరగా రా! అని గోపన్నను నవ్వుతూ పిలిచాడు. “నువ్వు ఈ రోజు నా ప్రాణాలు కాపాడావు. నీకేం కావాలన్నా అడుగు” అన్నాడు.
 రాజుగారు నవ్వుతూ మాట్లాడే సరికి గోపన్నకు దైర్యం వచ్చింది. “ప్రభూ మీ ఆస్థానంలో ఉద్యోగం కావాలి. దాని కోసమే ఈ మంత్రాలు జపిస్తున్నాను ప్రభూ!” అన్నాడు గోపన్న.రాజుగారు వెంటనే “ఇతడ్ని మంత్రిగా నియమించండి.మంత్రి గారి స్థానం ఖాళీ అయింది కదా!” అన్నాడు.”గోపన్నా నువ్వు ఇక నుంచీ ప్రజోపయోగ కార్యక్రమాలకు మంచి సలహాలు ఇవ్వాలి” అన్నాడు. ఏది ఏమయితేనేం గోపన్నకు రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం వచ్చింది.